నువ్వు పాలిస్తే సింగపూర్.. మేము పరిపాలిస్తే బిహారా..?
సచివాలయం: నువ్వు పరిపాలిస్తే సింగపూర్, జపాన్ అవుతుంది.. మేము పరిపాలిస్తే బిహార్‌లా ఉంటుందా.. చంద్రబాబూ? గత ఐదేళ్లలో బాబు కట్టిన సింగపూర్, జపాన్ చూడాలంటే అమరావతికి రండి.. అసెంబ్లీలో టాయిలెట్లు కూడా లేవని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. నోరు ఉంది కదా.. మీడియా ఉంది కదా.. అని మాట్లాడొద్దని హెచ్చరించారు. ఆస్తుల రేట్లు ఎక్కడ పడిపోతాయోనని ఏడుపుతప్ప.. ప్రజల మీద చంద్రబాబుకు ప్రేమ లేదన్నారు. సింగపూర్, జపాన్ అని మాట్లాడేవారికి ఇక్కడేం పని.. అక్కడికి వెళ్లిపోవచ్చు కదా అని ఎద్దేవా చేశారు. సచివాలయంలో మంత్రి అవంతి శ్రీనివాస్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
‘ఏడు నెలల్లో రాష్ట్రం నాలుగేళ్లు వెనక్కు వెళ్లిపోయిందని చంద్రబాబు అంటున్నాడు. పారదర్శకంగా నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చినందుకు వెనక్కు వెళ్లిందా..? వైయస్ఆర్ రైతు భరోసా ఇచ్చినందుకు బిహార్ కంటే ఘోరమైందా..? 43 లక్షల మందికి అమ్మఒడి పథకం ద్వారా రూ.650 కోట్లు ఇచ్చినందుకు వెనక్కు వెళ్లిపోయిందా..? కుల, మత, ప్రాంతం, చివరకు పార్టీలు కూడా చూడకుండా సీఎం వైయస్ జగన్ అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. ఐదేళ్లలో నువ్వు ఒక్క ఇల్లు అయినా ఇచ్చావా చంద్రబాబూ..? విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో దిగి నోవాటెల్ హోటల్లో మీటింగ్ పెట్టి ఫొటోలు దిగి వెళ్లిపోవడం, లులూ గ్రూపు లాలూచీ, డేటా సెంటర్ల లాలూచీ మాకు తెలియదా..? ఐటీ కంపెనీ పెట్టిన వారికి కన్సేషన్ ఇస్తానని అన్నాడు.. ఎగ్గొట్టాడు.. మరోసారి ప్రెస్‌మీట్ వారితో పెట్టిస్తాను.. వాస్తవాలు తెలుస్తాయి.
గతంలో జరిగిన పొరపాటు మళ్లీ జరగకుండా ఉండాలంటే అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణ జరగాల్సిన అవసరం ఉంది. మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలని, ప్రజలంతా సంతోషంగా ఉండాలన్న సీఎం వైయస్ జగన్ ఆలోచనను అన్ని జిల్లాలకు తీసుకెళ్లాలని నిర్ణయించాం. రాయలసీమ జిల్లాల్లో 200 అడుగులు తవ్వితే కానీ, వాటర్ రాదు.. శ్రీకాకుళం అత్యధిక వలసలు వెళ్లే జిల్లా.. విజయనగరం వర్షపాతం తక్కువ ఉన్న జిల్లా.. ఆర్థికంగా, అభివృద్ధి పరంగా, రాజకీయంగా ఈ మూడు ప్రాంతాలు వెనుకబాటుకు గురయ్యాయి. ఒకప్పుడు రతనాలు పండించే రాయలసీమలో రాళ్లు కూడా దొరికే పరిస్థితి లేదు. అధిక ఆదాయం వచ్చే మహానగరం లాంటి హైదరాబాద్‌ను కోల్పోయిన తరువాత ఆంధ్రరాష్ట్రం చాలా ఇబ్బందులు పడుతుందని, గతంలో జరిగిన పొరపాటు మళ్లీ జరగకూడదు అంటే అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణ జరగాలన్నారు.
పెద్ద బోట్ల అనుమతి కోసం విధి విధానాలు రూపొందించామని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. ఫిబ్రవరి 20 నాటికి తొమ్మిది కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేస్తామని, స్టేట్ లెవల్లో డిప్యూటీ కలెక్టర్ కంట్రోల్ రూమ్ మానిటర్ చేస్తారన్నారు. కంట్రోల్ రూమ్ పర్మిషన్ ఇచ్చిన తర్వాతే పెద్ద బోట్లకు అనుమతులు ఇస్తామని వివరించారు. కరోనా వైరస్ వ్యాప్తి ప్రజలకు చైతన్యం కల్పించేందుకు ర్యాలీలు నిర్వహించాలని నిర్ణయించడం జరిగిందని మంత్రి అవంతి తెలిపారు. ఆస్పత్రుల సూపరింటెండెంట్లతో భాగస్వామ్యమై ప్రతి జిల్లాలో అవగాహన ర్యాలీలు చేయాలని నిర్ణయించామన్నారు.