ఈనెల 11న 'అమ్మఒడి' సాయం
విజయవాడ: ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకువచ్చారని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. యూనివర్సిటీల బలోపేతానికి ప్రాధాన్యత ఇస్తున్నామని, ప్రతి యూనివర్సిటీలో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. విజయవాడలో మంత్రి ఆదిమూలపు సురేష్ మీడియాతో మాట్లాడుతూ.. ఉన్నత విద్యలో అర్హులకు పూర్తిస్థాయి ఫీజురీయింబర్స్‌మెంట్ అందిస్తున్నామన్నారు. ఈనెల 11న అమ్మఒడి రెండో విడత ప్రారంభమవుతుందని చెప్పారు. విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాల్లో రూ.15 వేలు జమ చేయనున్నట్లు వివరించారు. నాడు–నేడు కింద మూడు విడతల్లో రూ.11 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాని తెలిపారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా హైయర్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ బోర్డు ఏర్పాటు చేశామని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. నిబంధనలు పాటించని 247 కాలేజీలకు షోకాజు నోటీసులు ఇచ్చామని, 48 ప్రైవేట్ అన్ ఎయిడెడ్ డిగ్రీ కాలేజీలపై చర్యలు తీసుకున్నామన్నారు. నాణ్యత ప్రమాణాలు పాటించని కాలేజీలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
నూతన విద్యా సంవత్సరంలో ఆన్‌లైన్ అడ్మిషన్ ప్రక్రియ చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు. ఈ విద్యా సంవత్సరంలో మూడు కొత్త కోర్సులు ప్రారంభిస్తున్నామని, ఐదేళ్ల పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సును ప్రారంభిస్తున్నట్లు వివరించారు. నాలుగేళ్ల ఆనర్స్ డిగ్రీ కోసం ఒక ఏడాది పీజీ కోర్సును కొత్తగా ప్రవేశపెడుతున్నామని చెప్పారు. నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఈడీ కోర్సును తీసుకువస్తున్నట్లు మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు.