మహిళా సాధికారత, స్వావలంబనే సీఎం లక్ష్యం
నెల్లూరు: ప్రజా సంకల్ప యాత్రలో ఇచ్చిన హామీ మేరకు 78 లక్షల మంది డ్వాక్రా సంఘాల మహిళలను ఓ అన్నలా ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదుకుంటున్నారని ఇరిగేషన్ శాఖ మంత్రి డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. వైయస్ఆర్ ఆసరా పథకం కింద రెండు విడతల్లో కలిపి రూ.12,759 కోట్లు నేరుగా లబ్దిదారుల అకౌంట్‌లో జమ చేశారన్నారు. నెల్లూరు జిల్లాలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలను అప్పుల ఊబిలోనుంచి బయటకు తీసుకు రావాలన్నదే సీఎం వైయస్ జగన్ ఆలోచన అని, మహిళా సాధికారత కోసం అనేక పథకాలను అమలు చేస్తున్నారన్నారు. 2014 ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలోని లక్షల మంది అక్కచెల్లెమ్మలను మోసం చేశారని ధ్వజమెత్తారు.
మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఇంకా ఏమన్నారంటే..
చంద్రబాబు హయాంలో రూ.14వేల కోట్లు ఉన్న డ్వాక్రా అక్కచెల్లెమ్మల బకాయిలు 2019 నాటికి రూ.25వేల 517 కోట్లకు చేరాయి. వైయస్ జగన్ తన పాదయాత్రలో అక్కచెల్లెమ్మల బాధలు చూసి నాలుగు విడతలుగా వడ్డీతో సహా బకాయిలన్నీ పూర్తిగా చెల్లిస్తామని ఇచ్చిన హామీకి కట్టుబడి అధికారంలోకి రాగానే ఇప్పటికి రెండు విడతలుగా రూ.12,759 కోట్లు విడుదల చేశారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంలో చంద్రబాబుకు, సీఎం వైయస్ జగన్‌కు ఎంత వ్యత్యాసం ఉందో ఈ ఒక్క అంశం చూసినా అర్థం అవుతుంది.
టీడీపీ అయిదేళ్లు అధికారంలో ఉన్నప్పటికీ డ్వాక్రా సంఘాల బకాయిలు చెల్లించకుండా, కేవలం ఎన్నికల ముందు పసుపు-కుంకుమ పథకం పేరుతో తూతూమంత్రంగా చెల్లింపులు చేశారు. చంద్రబాబు మోసాన్ని గుర్తించిన అక్కచెల్లెమ్మలు 2019 ఎన్నికల్లో టీడీపీకి సరైన బుద్ధి చెప్పారు. అలాగే సున్నావడ్డీ పథకానికి చంద్రబాబు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత వైయస్ఆర్ సున్నావడ్డీ పథకం ద్వారా.. ఆ వడ్దీ భారాన్ని మొత్తం మా ప్రభుత్వం భరిస్తోంది అని చెప్పి, దాదాపు 98లక్షల మంది మహిళలు లబ్ధి పొందేవిధంగా ఇప్పటికే రూ.2,354 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది.
ఆసరా నుంచి చేయూత వరకూ.. ఏ పథకం చూసినా ముఖ్యమంత్రి వైయస్ జగన్ లక్ష్యం ఒక్కటే. మహిళా సాధికారత, స్వావలంబనే. దాదాపు 50లక్షల మంది తల్లులు, అమ్మ ఒడి ద్వారా తమ పిల్లల్ని చదివించుకునేందుకు వీలుకల్పిస్తూ రెండేళ్లలో దాదాపు రూ.13వేల కోట్లు అక్కచెల్లెమ్మలకు చెల్లించాం. అలాగే జగనన్న విద్యా దీవెన - ఫీజు రీయింబర్స్ మెంటు ద్వారా దాదాపు రూ.5,600 కోట్లు తల్లుల బ్యాంకు ఖాతాలలో జమ చేశాం. గత ప్రభుత్వంలో మహిళలకు ఒక్క ఇల్లు కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. టీడీపీ సర్కార్ టిడ్కో ఇళ్ల నిర్మాణం పేరుతో ప్రతినెల లోన్ ద్వారా రూ.2800 చెల్లించేలా అప్పు భారాన్ని మోపారు.
వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక 2 లక్షల మందికి పైగా లబ్ధిదారులకు 300 చదరపు అడుగుల ఇళ్లపై ఉన్న అప్పును తీసివేసి, ప్రతి ఇంటిని ఒక్క రూపాయికి ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు. తద్వారా ప్రభుత్వంపై రూ.4వేల కోట్లు భారం పడినప్పటికీ ప్రతి అక్కచెల్లెమ్మకు మంచి చేసే ప్రయత్నం చేస్తున్నాం. అలాగే రాష్ట్రంలో 31లక్షలమంది మహిళలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి, వారికి ఇళ్లు కట్టించే కార్యక్రమాలు మొదలుపెట్టి, తొలివిడతగా ఈ ఏడాది 15.60 లక్షలు ఇళ్లు కట్టించే ప్రయత్నాలు జరుగుతుంటే దానిమీద కూడా కోర్టుకు వెళ్లి స్టే తెచ్చి.. అక్కచెల్లెమ్మలను వంచించిన చంద్రబాబు నాయుడు లాంటి ప్రతిపక్షనేత ఉండటం సిగ్గుచేటు.
ఎన్ని అడ్డంకులు ఎదురైనా మంచి సంకల్పంతో ప్రారంభించిన పేదల ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసి తీరుతాం. అక్కచెల్లెమ్మలకు ఎంత చేసినా తక్కువే అని, వారిని అన్నిరకాలుగా ఉన్నత స్థాయికి తీసుకురావాలని ముఖ్యమంత్రి పని చేస్తుంటే.. మరోవైపు చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్ మహిళాభ్యున్నతిని అడ్డుకునే కార్యక్రమాలు చేస్తున్నారు. ఒకవైపు మహిళలకు మంచి చేస్తున్న ప్రభుత్వ పథకాలను న్యాయస్థానాలకు వెళ్ళి అడ్డుకుంటూనే.. మరోవైపు మహిళల గురించి ఏ హక్కుతో వారు మాట్లాడుతున్నారో రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా అక్కచెల్లెమ్మలు అర్థం చేసుకోవాలి. మహిళల అభ్యున్నతికి అధికారంలో ఉండగా ఏ ఒక్క కార్యక్రమం కూడా చేయని టీడీపీ, చంద్రబాబుకు మహిళల గురించి మాట్లాడే హక్కు లేదని చెబుతున్నాం.
ఒక్క రూపాయి అవినీతి లేకుండా, ఎవరి సిఫార్సులూ అవసరం లేకుండానే, మధ్యవర్తులు లేకుండా మహిళల ఖాతాల్లోనే నేరుగా సంక్షేమ పథకాల నగదు జమ అవుతోంది. రాజకీయ పదవుల్లో కూడా 50 శాతం పైగా మహిళలకు అవకాశం కల్పించిన ఘనత ముఖ్యమంత్రి వైయస్ జగన్‌దే. మహిళా సాధికారిత కోసం నామినేటెడ్ పదవుల్లోనూ వారికి పెద్దపీట వేశారు. గత ప్రభుత్వంలో ఎప్పుడైనా ఇలాంటి ఆలోచన వచ్చిందా?
పక్కరాష్ట్రంలో ఇల్లు కట్టుకుని, నెలకో రెండు నెలలకో.. చుట్టం చూపుగా ఆంధ్రప్రదేశ్‌కు వచ్చి వెళ్లేవారు ప్రభుత్వం మీద విమర్శలు చేయడం సిగ్గుచేటు. ఏపీలో సొంత ఇల్లు కూడా లేని చంద్రబాబు నాయుడు ఇక్కడకు వచ్చి చిల్లర రాజకీయాలు చేస్తే సహించేది లేదు. రాష్ట్రం గురించి, రాష్ట్ర ప్రజల గురించి మాట్లాడే హక్కు తండ్రీకొడుకులు కోల్పోయారు.
ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడే వైయస్ జగన్ ఇక్కడ ఇల్లు కట్టుకున్నారు. మరి మీరు అయిదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు కనీసం అమరావతిలో ఇల్లు కూడా కట్టుకోలేకపోయారెందుకు? అది చంద్రబాబు అయినా, జనసేన అధినేత అయినా, మీకు ఇల్లు ఎక్కడుంది అంటే హైదరాబాద్ అని చెబుతారు? రాజకీయాలు మాత్రం ఆంధ్రప్రదేశ్‌లో చేస్తారా? చుట్టం చూపుగా వచ్చి బురదచల్లడం, ఆ బురదను మీరే కడుక్కోండి అని వెళ్లడం సిగ్గుచేటు.
పేదల ఇళ్ల నిర్మాణాలపై దొంగచాటుగా కోర్టుకు వెళ్లిన ప్రతిపక్షాన్ని ఇతర రాజకీయ పార్టీలు ఎందుకు ప్రశ్నించడం లేదని అడుగుతున్నాం. మంచి కార్యక్రమం చేస్తే సహకరించాల్సిందిపోయి కుట్రలు చేస్తారా? ఎన్నికలు ఏవైనా, ప్రతి ఎన్నికల్లోనూ వైయస్ఆర్ సీపీ పక్షానే ప్రజలు నిలబడి, ముఖ్యమంత్రిని, ఆయన పరిపాలనను ప్రజలు దీవిస్తున్నారు. ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్న సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డికి ప్రజల ఆశీస్సులు ఎల్లప్పుడు ఉండాలని కోరుకుంటున్నాం`` అని మంత్రి అనిల్ అన్నారు.