ప్రభుత్వ ఆదేశాలు కచ్చితంగా పాటించాల్సిందే

24 Mar, 2020 17:53 IST

విశాఖపట్నం: కరోనా వైరస్‌ నియంత్రణలో ప్రజలంతా భాగస్వామ్యం కావాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని కోరారు. ప్రజలంతా సామాజిక దూరం పాటించాలన్నారు. కరోనా నియంత్రణపై విశాఖ జిల్లాలో వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు, పోలీసులతో మంత్రి ఆళ్ల నాని సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విశాఖ జిల్లాలో మూడు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయన్నారు. కరోనా నియంత్రణకు విశాఖలో 20 కమిటీలను నియమించామని, గ్రామ సెక్రటరీ ప్రత్యేక అధికారిగా వ్యవహరిస్తారని వివరించారు. వైరస్‌ నియంత్రణకు ప్రభుత్వం అన్ని రకాలు చర్యలు తీసుకుంటుందన్నారు. ఇందుకు అధికారుల కృషి అభినందనీయమన్నారు.  ఎన్ని పనులు ఉన్నా ఇంట్లోనే ఉండాలని, ప్రభుత్వ ఆదేశాలు కచ్చితంగా పాటించాల్సిందేనని చెప్పారు.

చంద్రబాబు లాంటి వ్యక్తులు ప్రజలను భయాందోళనలకు గురిచేయడం మానుకోవాలని సూచించారు. విదేశాల నుంచి వచ్చిన వారు కరోనా లక్షణాలు ఉంటే క్వారంటైమ్‌కు స్వచ్ఛందంగా రావాలనన్నారు.  నిబంధనలు పాటించకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతు బజార్లలో అధిక ధరలకు కూరగాయలు అమ్మితే లైసెన్స్‌లు రద్దు చేస్తామన్నారు.