ఇంటర్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేశాం

తాడేపల్లి: కరోనా నేపథ్యంలో ఇంటర్ పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేశామని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. శుక్రవారం సీఎం క్యాంపు కార్యాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. ఇంటర్ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తున్నామని చెప్పారు. పిల్లల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని పరీక్షలు నిర్వహిస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. కరోనా పాజిటివ్ ఉన్న వారు పరీక్షలు రాయనవసరం లేదని తెలిపారు. అలాంటి వారికి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించి రెగ్యులర్ సర్టిఫికెట్లు ఇస్తామని మంత్రి వెల్లడించారు. ప్రతి విద్యార్థిని థర్మల్‌స్క్రినింగ్ చేశాకే ఎగ్జామ్ హాల్‌లోకి పంపుతామని తెలిపారు. పరీక్షల విషయంలో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు.