చంద్రబాబు కూటమి పాలనలో మైనారిటీలకు రక్షణ లేదు
తాడేపల్లి: ఎన్నికల సమయంలో మైనారిటీలకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు, ఆ హామీలను అమలు చేయకుండా ముస్లిం సమాజానికి వెన్నుపోటు పొడిచారని వైయస్ఆర్‌సీపీ మైనారిటీ విభాగం నాయకులు మండిపడ్డారు. తాడేపల్లిలోని వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మైనారిటీ విభాగం రాష్ట్ర స్థాయి సమావేశంలో పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి దిశానిర్దేశం చేశారు. అలాగే సమావేశంలో పలువురు నేతలు మాట్లాడారు.
మైనారిటీలకు ఇచ్చిన 17 హామీల్లో ఒక్కటి కూడా అమలు కాలేదని, వక్ఫ్ సవరణ బిల్లు విషయంలో కూడా చంద్రబాబు మాట తప్పారని వైయస్ఆర్‌సీపీ మైనారిటీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఖాదర్ బాషా ఆరోపించారు. మైనారిటీల సంక్షేమానికి వైయస్ జగన్ ప్రభుత్వం ఐదేళ్లలో డీబీటీ, నాన్-డీబీటీ పథకాల ద్వారా వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని గుర్తు చేశారు.
ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ, ఎస్ఐఆర్ ప్రక్రియలో మైనారిటీల ఓట్ల తొలగింపుపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతి ఓటును కాపాడుకునేందుకు బూత్ స్థాయి కార్యకర్తలు చురుగ్గా పనిచేయాలని పిలుపునిచ్చారు. మైనారిటీలను కేవలం ఓటు బ్యాంకుగా ఉపయోగించుకోవడమే చంద్రబాబు రాజకీయమని విమర్శించారు.
ఎమ్మెల్సీ ఇసాక్ బాషా మాట్లాడుతూ, హజ్ యాత్రను కూడా రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. గత వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో హజ్ యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పించగా, ప్రస్తుతం అనేక సమస్యలు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు.
● కూటమి పాలనలో ముస్లింలకు రక్షణ లేదు
- హఫీజ్ ఖాన్, మాజీ ఎమ్మెల్యే, మైనారిటీ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్
కూటమి ప్రభుత్వం మన పార్టీ మైనార్టీ యువకుడైన రషీద్‌ని పొట్టనపెట్టుకుంది. అతడిని నడిరోడ్డు మీద అత్యంత దారుణంగా నరికి చంపినా నిందితులను శిక్షించలేదు. రషీద్ కుటుంబానికి మనమే అండగా నిలబడాలి. 2019-24 మధ్య ముఖ్యమంత్రిగా ఉన్న వైయస్ జగన్ గారు మైనారిటీలను రాజకీయంగా ఎంతగానో ప్రోత్సహించారు. నాడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎన్నార్సీకి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మాణం చేసిన ఘనత కూడా వైయస్ జగన్ గారికే దక్కుతుంది. ఎన్నార్సీపై అసెంబ్లీలో సీరియస్‌గా చర్చ జరుగుతుండగా టీడీపీ ఎమ్మెల్యేలంతా సభ నుంచి వాకౌట్ చేశారు. అప్పుడూ, ఇప్పుడూ ముస్లిం ప్రజల మనోభావాలను చంద్రబాబు అస్సలు పట్టించుకోవడం లేదు. వక్ఫ్ ఆస్తులను పరిరక్షించడానికి వైయస్ జగన్ గారు జీవో నెంబర్ 40 తీసుకొచ్చారు. ముస్లిం సామాజికవర్గానికి గతంలో అందే ఏ పథకం నేడు చంద్రబాబు కూటమి పాలనలో అందడం లేదు. ఐదేళ్లలో వైయస్ జగన్ గారు చేసిన మంచితోపాటు రెండేళ్ల చంద్రబాబు మోసాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి.
ఎస్ఐఆర్ గురించి రాష్ట్రంలో మొట్టమొదటిగా మాట్లాడిన నాయకుడు వైయస్ జగన్ గారే. మ్యాపింగ్, డాక్యుమెంట్ సబ్మిషన్ ఎస్ఐఆర్ లో ముఖ్యమైన ప్ర్రక్రియ. 2002 ఓటర్ లిస్టు, 2025 ఓటర్ లిస్టులో మన ఓట్లను పరిశీలించుకోవడం. రెండింట్లో ఓటు ఉంటే బీఎల్‌వోలను కలిసి ఎన్యుమరేషన్ ఫామ్ పూర్తి చేసి పాస్‌పోర్టు ఫొటోతో అప్లికేషన్ పూర్తి చేయడం చేయాలి. ఒకవేళ 2002 నాటికి ఓటర్‌గా నమోదు కాని వారు కుటుంబ సభ్యుల ఓట్ల ద్వారా మ్యాపింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. 2002లో ఏ నియోజకవర్గం, ఏ బూత్, లో ఓటు ఉందో వెతకడమే కష్టమైన ప్రక్రియ. 2002, 2025లో ఓట్లు లేని వారు సెల్ఫ్ ఎన్యుమరేషన్ చేసుకుని కొత్త ఓటర్‌గా నమోదు కావాల్సి ఉంటుంది. పేరులో ఏవైనా తప్పులుంటే ఫామ్ నెంబర్ 8, డూప్లికేట్ ఓట్లు, చనిపోయిన వ్యక్తుల ఓట్లు తీసేయడానికి ఫామ్ నెంబర్ 7 ఉపయోగించుకోవాలి.
● ముస్లింలను నాయకులుగా తీర్చిదిద్దిన ఘనత జగన్‌దే
- రూహుల్లా, ఎమ్మెల్సీ
ముస్లింలను నాయకులుగా తీర్చిదిద్దిన ఘనత వైయస్ జగన్ గారికే దక్కుతుంది. ఒక్క వైయస్సార్సీపీలోనే ముస్లింలు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులుగా ఎదిగేలా ప్రోత్సాహం ఉంటుంది. 2024లో టికెట్ ఇవ్వలేక పోయినందుకు హఫీజ్ ఖాన్ గారిని భవిష్యత్తులో రాజ్యసభకు పంపుతానని వైయస్ జగన్ గారు అందరి ముందూ హామీ కూడా ఇచ్చారు. కానీ చంద్రబాబు కూటమి పాలనలో మైనారిటీలకు ప్రోత్సాహకమే కాదు, కనీసం రక్షణ కూడా లేదు.
● వైయస్సార్ తర్వాత మైనారిటీలకు అండగా నిలించింది జగనే
- నూరి ఫాతిమా, గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జి
మైనారిటీల పేదరికాన్ని ఆసరాగా చేసుకుని మోసపు హామీలతో చంద్రబాబు ఓటేయించుకున్నాడు. తీరా అధికారంలోకి వచ్చాక మైనారిటీలను పట్టించుకున్న పాపాన పోవడం లేదు. చంద్రబాబు మైనారిటీలను కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తున్నాడు. వక్ఫ్ సవరణ చట్టం విషయంలోనే మహిళల పట్ల చంద్రబాబు నైజం అర్థమైపోతుంది. రాష్ట్రంలో రెండేళ్లుగా మైనారిటీలను రాజకీయంగా అణగదొక్కుతున్నారు. టీడీపీలో గెలిచిన మైనారిటీ ఎమ్మెల్యేలు చంద్రబాబు చేతుల్లో కీలుబొమ్మలుగా మారిపోయారు. మనకు జరిగే అన్యాయంపై మనమే గొంతెత్తి ప్రశ్నించాలి. గుంటూరులో వేల కోట్ల విలువైన వక్ఫ్ భూములపై చంద్రబాబు కన్నుపడింది. రెండేళ్లుగా వాటిని కాజేయాలని చూస్తున్నాడు. దివంగత వైయస్సార్ తర్వాత మైనార్టీలను రాజకీయంగా ప్రోత్సహించింది జగన్ గారే. మైనారిటీ మహిళనైన నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి వైయస్ జగన్ గారు ప్రోత్సహించారు. మరో మహిళ జకియా ఖానుమ్ కు మండలి వైస్ చైర్ పర్సన్‌గా నియమించారు. చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటు పాలనపై ప్రజలకు అవగాహన కల్పించాలి.