రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును వెంటనే పూర్తి చేయాలి
అన్నమయ్య జిల్లా: రాయలసీమ ప్రాంతానికి భవిష్యత్తులో సాగునీరు, తాగునీటి సమస్యలు తీవ్రంగా మారనున్నాయని మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సాకే శైలజానాథ్ ఆందోళన వ్యక్తం చేశారు. శ్రీశైలం ప్రాజెక్టులోకి నీటి ప్రవాహం తగ్గిపోతుండటం పరిస్థితిని మరింత క్లిష్టం చేస్తోందన్నారు. మంగళవారం అన్నమయ్య జిల్లా మదనపల్లిలో జరిగిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ తాగునీరు, సాగునీరు భవిష్యత్ కార్యాచరణపై అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు రాజంపేట శాసన సభ్యులు ఆకేపాటి అమరనాథ్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో మాజీ మంత్రి, పుంగనూరు శాసన సభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ,తంబళ్లపల్లి శాసన సభ్యులు పెద్దిరెడ్డి ద్వారకనాధ్ రెడ్డి , పీలేరు మాజీ శాసన సభ్యులు చింతల రామచంద్రారెడ్డి ,మాజీ మంత్రి సాకే శైలజానాధ్ ,లక్కీరెడ్డి పల్లి మాజీ శాసన సభ్యులు రెడ్డెప్ప గారి రమేష్ రెడ్డి ,మదనపల్లి నియోజకవర్గ సమన్వయ కర్త నిస్సార్ అహ్మద్ ,మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి ,సీనియర్ నాయకులు నల్లారి తిమ్మారెడ్డి , మాజీ మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ ఇక్బాల్ అహ్మద్ మరియు ప్రజా ప్రతినిధులు, మున్సిపల్ చైర్మన్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సాకె శైలజనాథ్ మాట్లాడుతూ..కర్ణాటకలో ఆలమట్టి జలాశయం సామర్థ్యం పెరగడం, అప్పర్ భద్ర, తుంగభద్ర జలాల నిల్వల కారణంగా దిగువ రాష్ట్రాలకు నీటి లభ్యత తగ్గుతోందని తెలిపారు. శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణానికి లక్ష ఎకరాల భూమిని ఇచ్చిన ఘనత ఈ ప్రాంత రైతులదేనని గుర్తుచేశారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా నీటిని అందించే అవకాశముండగా, దానిని నిలిపివేయడం ద్వారా ప్రాంతానికి తీరని అన్యాయం జరుగుతోందని విమర్శించారు. పోతిరెడ్డిపాడు వద్ద 840 అడుగుల స్థాయిలో కృష్ణా నది నుంచి నీరు తీసుకురాగల అవకాశముందని, వెంటనే ప్రాజెక్టును పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. వ్యవసాయంపై ఆసక్తి లేని ప్రభుత్వ విధానాల వల్లే రాయలసీమ వెనుకబడుతోందని ఆరోపించారు. కేవలం 15 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే రాయలసీమ ప్రాజెక్టులు పూర్తవుతాయని, కానీ లక్షల కోట్ల రూపాయలు ఇతర ప్రాంతాల్లో ఖర్చు చేస్తున్నారని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు పనులను పూర్తి చేయకుండా ఉత్తరాంధ్రకు కూడా అన్యాయం జరుగుతోందని, హంద్రీనీవా ప్రాజెక్టులో కాలువల ఎత్తు తగ్గించడం వల్ల నీటి సరఫరా దెబ్బతింటోందని తెలిపారు. రాయలసీమ నుంచి కీలక సంస్థలను తరలించడం కూడా ప్రాంతానికి నష్టం కలిగించిందన్నారు.
మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ, రాయలసీమపై ప్రస్తుత ప్రభుత్వానికి ప్రేమలేదని, ద్వేషమే ఉందని తీవ్రంగా విమర్శించారు. నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినా ప్రాంత అభివృద్ధికి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. పోతిరెడ్డిపాడు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు ఇప్పటికే అధిక శాతం పూర్తయ్యాయని, దాన్ని నిలిపివేయడం అన్యాయమన్నారు. కుప్పం నియోజకవర్గానికి నీరు అందించిన ఘనత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిదేనని పేర్కొన్నారు. అమరావతి పేరుతో భారీగా భూములు, నిధులు వినియోగిస్తూ దోపిడీ జరుగుతోందని ఆరోపిస్తూ, పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తే రాయలసీమకు నీరు అందకుండా చేసే కుట్ర జరుగుతోందన్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు విషయంలో జరుగుతున్న అన్యాయంపై ప్రతి జిల్లాలో ప్రజలు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. గ్రేటర్ రాయలసీమతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని నేతలు కోరారు.
రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్ రెడ్డి మాట్లాడుతూ, దివంగత మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి పోతిరెడ్డిపాడు ద్వారా సాగునీరు అందించి రాయలసీమను సస్యశ్యామలం చేయాలని కృషి చేశారని గుర్తు చేశారు. తెలంగాణ ప్రాంతం నుంచి వ్యతిరేకత ఉన్నప్పటికీ జలయజ్ఞం ద్వారా రైతులకు నీరు అందించారని తెలిపారు. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొదటి నుంచి రైతు వ్యతిరేకిగా ముద్ర వేసుకున్నారని విమర్శించారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను కొనసాగించకుండా కుట్రలు జరుగుతున్నాయని, దీనివల్ల ప్రాంతానికి తీరని అన్యాయం జరుగుతోందని అన్నారు. గ్రామం నుంచి నియోజకవర్గ స్థాయి వరకు ఈ ఉద్యమాన్ని విస్తరించాలని పిలుపునిచ్చారు.
పీలేరు మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రా రెడ్డి మాట్లాడుతూ, వ్యవసాయం దండగ అన్న వ్యక్తి రాయలసీమకు ఎలా న్యాయం చేస్తారని ప్రశ్నించారు. నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినా ఉమ్మడి చిత్తూరు జిల్లాకు న్యాయం జరగలేదని విమర్శించారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌కు వేల కోట్ల రూపాయలు కేటాయించినప్పటికీ ప్రస్తుత ప్రభుత్వం దాన్ని నిలిపివేస్తోందని ఆరోపించారు. తంబళ్లపల్లె ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి మాట్లాడుతూ, పోతిరెడ్డిపాడు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును కొనసాగించాలని డిమాండ్ చేశారు. తమ నియోజకవర్గంలో పలు ప్రాజెక్టులను ప్రభుత్వం నిలిపివేసిందని, నీటి సమస్య తీవ్రంగా ఉందని తెలిపారు.
మాజీ ఎమ్మెల్యే దేశాయ్ తిప్పారెడ్డి మాట్లాడుతూ, రాయలసీమకు జరుగుతున్న అన్యాయంపై అందరూ కలిసి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ప్రాజెక్టు పూర్తయ్యే వరకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని అన్నారు. రాయచోటి మాజీ ఎమ్మెల్యే నరేష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, రాయలసీమకు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారానే సాధ్యమని తెలిపారు. అమరావతి పేరుతో వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. రాయలసీమకు న్యాయం జరగాలంటే అందరూ పార్టీలకు అతీతంగా ఈ ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని వైయస్ఆర్‌సీపీ నేతలు పిలుపునిచ్చారు.