ఒక్క మార్కు తేడాతో నా కుమారుడు మెడికల్ సీట్‌ కోల్పోయాడు 

25 Nov, 2025 22:51 IST


వైయ‌స్ఆర్ జిల్లా: ఒక్క మార్కు తేడాతో తన కుమారుడు మెడికల్ సీట్‌ కోల్పోయాడని చరణ్‌ తండ్రి జయప్రకాష్‌ ఆవేదన వ్యక్తం చేశారు. పులివెందుల క్యాంప్‌ కార్యాలయంలో వైయస్‌ జగన్‌ ను పలువురు కలిసి తమ సమస్యలు, కష్టాలు చెప్పారు. ఈ సందర్భంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్‌పరం చేయాలన్న చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయం వల్ల తన కుమారుడు ఎలా నష్టపోయాడనేది ఓ తండ్రి వైయస్‌ జగన్‌ దృష్టికి తీసుకొచ్చారు. పులివెందులకు చెందిన గాజుల జయప్రకాష్‌ తన కుమారుడు చరణ్‌సాయితో కలిసివచ్చి ప్రజాదర్భార్‌లో వైయస్‌ జగన్‌ ను కలిశారు. చరణ్‌సాయికి నీట్‌లో 470 మార్కులు వచ్చాయని, ఎస్‌ వి యూనివర్శిటీ పరిధిలో 471 మార్కుల కటాఫ్‌ కారణంగా ఒక్క మార్కు తేడాతో తన కుమారుడు మెడికల్ సీట్‌ కోల్పోయాడని చరణ్‌ తండ్రి జయప్రకాష్‌ ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా పులివెందుల మెడికల్‌ కాలేజీకి 50 సీట్లు, పాడేరు వైద్య కళాశాలకు రావాల్సిన 50 సీట్లు కోల్పోయామని వైయస్‌ జగన్‌ అన్నారు. ఈ రెండు మెడికల్ కాలేజీలకు మంజూరైన సీట్లు వచ్చి ఉంటే చరణ్ లాంటి విద్యార్ధులు వైద్య విద్యను అభ్యసించి మంచి డాక్టర్లయ్యేవారన్నారు. కూటమి ప్రభుత్వం వైద్యరంగాన్ని నిర్వీర్యం చేసిందని, తమ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 17 మెడికల్ కాలేజీలను ఏర్పాటుచేసి వైద్య విద్యను అందించే ప్రయత్నాన్ని కూటమి నాయకులు దూరం చేయడం దారుణమని మండిపడ్డారు. మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణపై వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ పోరాడుతుందని ఈ సందర్భంగా వైయస్‌ జగన్‌ అన్నారు.