అన్ని గుర్తు పెట్టుకుంటాం..!

కర్నూలు: అధికార పార్టీకి కొమ్ముకాస్తూ వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేస్తున్న అధికారులను గుర్తుపెట్టుకుంటామని, ఎవరిని వదిలే ప్రసక్తే లేదని వైయస్ఆర్‌సీపీ మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి హెచ్చరించారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిల అక్రమ అరెస్టును ఎమ్మెల్యే తీవ్రంగా ఖండించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..` ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుంది. లిక్కర్ స్కాం జరిగిందంటు విచారణ పేరుతో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి, అప్పటి ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి ని అరెస్టు చేయడం సిగ్గుచేటు. 2019లో వైయస్ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 43 వేల బెల్టు షాపులు తొలగించాం. 4380 పర్మిట్ రూంలు రద్దు చేశాం. టీడీపీ హయాంలో రూ.25 వేల కోట్ల లిక్కర్ స్కాం జరిగిందని సీఐడీ అధికారులు నిర్ధారించారు. టీడీపీ హయాంలో 69 శాతం మద్యం అమ్మకాలు జరిగితే వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో మద్యం అమ్మకాలు తగ్గుతు వచ్చాయి. సూపర్ సిక్స్ పథకాల అమలు చేయలేక వైయస్ఆర్‌సీపీ నేతలు, అప్పటి అధికారులు, సోషల్ మీడియా కార్యకర్తలు లక్ష్యంగా అక్రమ కేసులు పెట్టడమే కూటమి నేతలు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైయస్ఆర్‌సీపీ విజయం సాధించడం ఖాయం, ఇప్పుడు కూటమి లో వైయస్ఆర్‌సీపీ లక్ష్యంగా టార్గెట్ చేసిన అధికారులను ఎక్కడికి వెళ్లినా వదిలే ప్రసక్తే లేదు` అంటూ వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి హెచ్చరించారు.