చంద్రబాబు పదే పదే చెప్పినా తప్పు ఒప్పు కాదు

12 Feb, 2026 15:51 IST

తాడేప‌ల్లి:  తాడేపల్లి లోని భూమి వివాదంపై జరుగుతున్న ఆరోపణలకు వైయ‌స్ఆర్‌సీపీ మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి ఘాటుగా స్పందించారు. వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో తాడేపల్లిలో హెలీప్యాడ్ కోసం రైతు భూమిని బలవంతంగా లాక్కున్నారంటూ సీఎం చంద్రబాబు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని వేమారెడ్డి పేర్కొన్నారు. దశాబ్దాలుగా రైల్వే ఆధీనంలో ఉన్న ఆ భూమిని ఏ రైతు సాగుచేసిన ఆధారాల్లేవని స్పష్టం చేశారు. ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైన చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతున్నందునే.. వైయ‌స్ఆర్‌సీపీపై బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి అబద్దాలతో ఎంతకాలం ప్రజలను మభ్యపెడతారని నిలదీశారు. వాస్తవాలు తెలుసుకోకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదేపదే అబ‌ద్దాలు చెబితే త‌ప్పు ఒప్పు కాద‌ని  ఆయన విమర్శించారు.  తాడేప‌ల్లిలోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో దొంతిరెడ్డి వేమారెడ్డి మీడియాతో మాట్లాడారు.

ప్రెస్‌మీట్‌లో వేమారెడ్డి ఇంకా ఏమ‌న్నారంటే..:

● 22ఏలో చేర్చింది మా ప్ర‌భుత్వం కాదు

తాడేపల్లి లోని సర్వే నంబర్లు 223, 226 సీ2లో 10.4 ఎకరాల భూమి రెవెన్యూ రికార్డుల్లో స్పష్టంగా నమోదై ఉంది. ఈ భూమిని తమ ప్రభుత్వం 22ఏలో చేర్చలేదు, అది  2015లో ఆర్‌సీ నంబర్ 2207/2015 సీ5 ద్వారా నమోదు అయ్యింది. అనంతరం 26 మే 2016న ఈ భూమి అధికారికంగా నోటిఫై అయ్యిందని, గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో ఉన్న రికార్డులు కూడా దీనిని నిర్ధారిస్తున్నాయి. మంగ‌ళ‌గిరి-తాడేప‌ల్లి మున్సిపాలిటీ రికార్డుల్లో కూడా ఇదే వివరాలు ఉన్నాయి.

● ఇప్ప‌టి వ‌ర‌కు ఆ భూమిలో ఏ పంట వేయ‌లేదు

తాను తాడేపల్లిలో పుట్టి పెరిగిన వ్యక్తిని, చిన్నప్పటి నుంచి ఆ భూమి రైల్వే స్థలంగానే ఉంది. ఆ ప్రాంతంలో ఎప్పుడూ వ్యవసాయం జరగలేదు. ఏ పంట సాగు చేయ‌లేదు. గతంలో ఆ భూమిని రైల్వే శాఖ మద్రాస్‌కు చెందిన ఈఐడీ ప్యారీ సంస్థకు లీజుకు ఇచ్చింది, అక్కడ ఎరువుల కర్మాగారం అనేక సంవత్సరాలు నడిచింది.  ఆ సంస్థ మూతపడిన తర్వాత అక్కడి యంత్రాంగాన్ని పారిశ్రామికవేత్తలు కొనుగోలు చేసినప్పటికీ ఆ భూమి మాత్రం రైల్వే పరిధిలోనే కొనసాగుతోంది.

● ఆయ‌న రైతే కాదు

ఎవరో ఇచ్చిన తప్పుడు సమాచారం ఆధారంగా తమ పార్టీపై చంద్ర‌బాబు ఆరోపణలు చేయడం తగదు. ఆ భూమి అది వ్య‌వ‌సాయ భూమి కాదు,  చంద్ర‌బాబుకు ఫిర్యాదు చేసిన ఆ ప్రైవేట్ వ్య‌క్తి అస‌లు రైతే కాదు..ఆయ‌న ఓ పారిశ్రామికవేత్త‌. రైతు పేరుతో ప్రచారం చేయడం ప్రజలను మోసం చేయడమే. ముఖ్యమంత్రి ప్రభుత్వ యంత్రాంగం ద్వారా రికార్డులను పరిశీలించి వాస్తవాలను తెలుసుకోవాలి.

● చేతులెత్తి న‌మ‌స్క‌రిస్తున్నా..

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు రెండు చేతులెత్తి న‌మ‌స్క‌రిస్తున్నాను. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. రైతులకు పంట నష్టపరిహారం, సబ్సిడీలు అందడం లేదు. ఎరువులు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ అందక చదువులు మధ్యలోనే ఆగిపోతున్నాయి. మహిళలు, వెనుకబడిన వర్గాలకు ఇచ్చిన హామీలు అమలు చేయ‌డం లేదు. రాష్ట్రంలో చిన్న వ్యాపారులు, సామాన్య ప్రజలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అనుకూల మీడియా ఉంద‌ని ప‌దేప‌దే అబ‌ద్ధాలు చెబితే న‌మ్మే రోజులు కావు. ప్ర‌తి ఒక్క‌రి చేతుల్లో సెల్‌ఫోన్ ఉంది. ప్ర‌పంచంలో ఏ మూల ఏం జ‌రుగుతుందో క్ష‌ణాల్లో తెలిసిపోతుంది. చంద్ర‌బాబు బుర‌ద‌ జల్లే రాజకీయాలు మానుకుని ప్రజల సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలి.  

● అప్పుల‌పై శ్వేత‌ప‌త్రం విడుద‌ల చేయాలి

వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఐదేళ్లలో రూ.3.27 లక్షల కోట్ల అప్పు తీసుకుని సంక్షేమ పథకాలు అమలు చేసింది. ప్రస్తుత ప్రభుత్వం 20 నెలల్లోనే రూ.3.31 లక్షల కోట్ల అప్పు తీసుకుంది. ఈ అప్పుల వినియోగంపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి.  తాడేపల్లిలోని రైల్వే భూమిని ఇతరులకు కేటాయించే ప్రయత్నాలు జరుగుతున్నాయేమోనని కూడా వేమారెడ్డి అనుమానం వ్యక్తం చేశారు.