కూటమి తాలిబన్లను తరమి కొట్టే రోజులు దగ్గర పడ్డాయి
తిరుపతి: కూటమి ప్రభుత్వ పాలన తాలిబన్ల పాలనను తలపిస్తోందని మండిపడ్డారు కోడూరు మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు. రాష్ట్రంలో సూపర్ సిక్స్‌పై దృష్టి పెట్టకుండా సూపర్ మ్యాజిక్ చేసి మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కూటమి నాయకులు దళితులనే టార్గెట్ చేసి దాడులు చేయడం హేయమైన చర్యగా పేర్కొన్నారు. ఈ కూటమి తాలిబన్లను తరమి కొట్టే రోజులు దగ్గర పడ్డాయని అన్నారు. కూటమి దాడులకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి దాడులకు దిగితే తట్టుకోలేరని హెచ్చరించారు. వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి బౌన్స్ బ్యాక్ అయి వస్తారని చెప్పారు.
ఎంపీ మిధున్ రెడ్డిపై రాళ్ళ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు రాజ్యసభ సభ్యులు గొల్ల బాబారావు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వ హయాంలో దాడులు హత్యలు పెరిగిపోయాయని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి దాడులు సమంజసం కాదని, దాడులు జరుగుతుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని మండిపడ్డారు. వైయస్ఆర్ సీపీ నేతలపై దాడులను ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఈ దాడులు చేస్తున్న వారికి సరైన సమయంలో ప్రజలు బుద్ధి చెబుతారని తెలిపారు.
ఎంపీ మిథున్ రెడ్డి పై టీడీపీ రాళ్లదాడిని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తీవ్రంగా ఖండించారు. ఏపీ ప్రజలకు టీడీపీ నేతలు కొత్త విధానాలను పరిచయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్ఆర్ సీపీ నేతలు ఎక్కడా తిరగకూడదా ...టీడీపీ నేతలే ..కార్యకర్తలే తిరగాలా అని ప్రశ్నించారు. ఎంపీ మిథున్ రెడ్డి పై టీడీపీ మూకల దాడి హేయమైన చర్యగా పేర్కొన్నారు. రాష్ట్రాన్ని బిహార్‌గా మార్చేశారని, ప్రజల అవసరాలను పక్కన పెట్టి ఇతర రాజకీయ పార్టీల నాయకుల పై దాడులు చేస్తున్నారని విమర్శించారు.
‘దాడులు , హత్యలు, మానభంగాలతో ఏపీ అట్టుడికిపోతోంది. పట్టపగలే హత్యలు చేస్తున్నారు. ఏపీలో పోలీస్ వ్యవస్థ ఏమైపోయింది? ఎంపీ మిథున్ రెడ్డిని ముట్టడించి దాడి చేయాల్సిన అవసరం ఏముంది? వైయస్ఆర్ సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి దౌర్జన్యాలు ఏనాడైనా జరిగాయా?
తక్షణం గవర్నర్ జోక్యం చేసుకోవాలి. కేంద్రహోంశాఖ ఏపీలో శాంతి భద్రతల పై స్పందించాలి. 40 రోజుల నుంచి రాష్ట్రంలో దాడులతో రెచ్చిపోతున్నారు. సీఎం, డిప్యూటీ సీఎం, హోంమంత్రి ఏమైపోయారు...ఎందుకు స్పందించడం లేదు. పోలీసు యంత్రాంగం నిర్లిప్తంగా ఉంది. ప్రజా ప్రతినిధులకు గన్ మెన్లను విత్ డ్రా చేసి శాంతిభద్రతలకు మీరే విఘాతం కలిగిస్తున్నారు. చంద్రబాబు గడచిన 40 రోజుల్లో జరిగిన సంఘటనలను కూడా కలిపి శ్వేత పత్రం విడుదల చేయాలి. పక్షంలో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన దాడుల పై మేమే శ్వేతపత్రం విడుదల చేస్తాం అని పేర్కొన్నారు ’