సింహాచలం దుర్ఘటనకు మంత్రుల కమిటీదే బాధ్యత

భీమిలి : సింహాచలం ఆలయంలో గోడ కూలి భక్తులు చెందిన దుర్ఘటనకు మంత్రుల కమిటీ బాధ్యత వహించాలని వైయస్ఆర్‌సీపీ భీమిలి ఇన్‌చార్జ్ మజ్జి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సింహాచలం ఘటనపై మాట్లాడిన మాటలను ఆయన తీవ్రంగా ఖండించారు. శనివారం మజ్జి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ..సింహాచలం చందనోత్సవంలో గోడ కూలి భక్తులు మృతి చెందిన ఘటన అందరినీ బాధించిందన్నారు. చందనోత్సవం తేదీని ముందుగానే పండితులు ప్రకటిస్తారని, భక్తుల రాక మేరకు చందనోత్సవ ఏర్పాట్లు చేస్తారని తెలిపారు. సింహాచలం చరిత్రలో ఎన్నడూ ఇలాంటి ఘటన జరగలేదని తెలిపారు. గోడ కూలిన సంఘటన జరిగిన వెంటనే మాజీ సీఎం వైయస్ జగన్ విశాఖకు వచ్చి బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చారని చెప్పారు. గోడ కూలిన ఘటన జరిగిన తరువాత వైయస్ఆర్‌సీపీ బృందం సంఘటనా స్థలాన్ని పరిశీలిందన్నారు. సింహాచలం గోడ కూలిన ఘటనలో మరణాలు ప్రభుత్వ హత్యలేనని ఆక్షేపించారు. కూలిన గోడ కట్టడం ప్లాన్ లో లేదని కాంట్రాక్టర్ స్వయంగా కమిటీకి చెప్పారని, మంత్రుల కమిటీ సింహాచలం కొండ మీదకి వచ్చే నాటికి గోడ నిర్మాణం లేదని, ఈ దుర్ఘటనకు మంత్రుల కమిటీ బాధ్యత వహించాలన్నారు. ఎల్జీ పొలిమర్స్ ఘటనలో మృతుల కుటుంబాలకు వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం రూ. కోటి నష్ట పరిహారం ఇచ్చిందని గుర్తు చేశారు. ప్రసాద్ స్కీం లో సింహాచలం దేవస్థానానికి రూ. 54 కోట్లు మంజూరు చేశారని, ఆ నిధులను గత ఏడాది నవంబర్ నాటికి 25 శాతం పనులు అయ్యాయని కేంద్రం ప్రకటించిందని చెప్పారు.ప్రసాద్ స్కీం నిధులు కూడా వైయస్ఆర్‌సీపీ హయాంలోనే తెచ్చామన్నారు. సింహాచలం ఘటనకు ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలని మజ్జి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.