గాంధీజీ ఆశయ సాధన కోసం ముందుకెళ్దాం

30 Jan, 2026 14:23 IST

అనంతపురం  : బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం జాతిపిత మహాత్మాగాంధీ చూపిన బాటలో.. ఆయన ఆశయ సాధన కోసం అందరూ కలిసికట్టుగా ముందుకెళ్దామని వైయ‌స్‌ఆర్‌సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం వైయ‌స్‌ఆర్‌సీపీ జిల్లా కార్యాలయంలో గాంధీజీ 78వ వర్ధంతి సందర్భంగా శింగనమల సమన్వయకర్త శైలజానాథ్, ఎమ్మెల్సీ మంగమ్మ, జెడ్పి చైర్‌పర్సన్‌ గిరిజమ్మ, మేయర్‌ వసీం, ఇతర ప్రజాప్రతినిధులు, వైయ‌స్‌ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా అనంత మాట్లాడుతూ శాంతి, సత్యం, అహింసను ఆయుధాలుగా చేసుకుని మన దేశ స్వాతంత్య్ర ఉద్యమానికి నాయకత్వం వహించిన మహనీయుడు గాంధీజీ అని కొనియాడారు. గాంధీజీ స్ఫూర్తితో ఆ రోజు దేశమంతా ఏకతాటిపైకి వచ్చి ఉద్యమంలో భాగస్వాములయ్యారన్నారు. స్వాతంత్య్రం వచ్చాక గాంధీజీ ఏనాడూ పదవులను ఆశించలేదని చెప్పారు. ఈ రోజు కేంద్రంలో అధికారంలో ఉన్న ఏన్డీయే ప్రభుత్వం గాంధీ పేరును కూడా చరిత్ర నుంచి తీసేయాలని చూడడం దుర్మార్గమన్నారు. స్వాతంత్య్ర ఉద్యమంలో ప్రధాని మోదీ ప్రాతినిథ్యం వహిస్తున్న పార్టీ గానీ ఆర్గనైజేషన్లు గానీ ఆనాడు చొరవ చూపలేదన్నారు. కానీ చరిత్రను మాత్రం వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి గాంధీజీ పేరు తొలగించడం దుర్మార్గమని..ఇది తల్లిపాలు తాగి రొమ్ముగుద్దినట్టేనని అన్నారు. గాంధీజీ నేటి తరానికే కాదు భవిష్యత్‌ తరాలకు కూడా మార్గదర్శకులన్నారు. మహాత్ముడు కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేసిన ఘనత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందని అన్నారు. సచివాలయ వ్యవస్థను తెచ్చి ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు అందించామని గుర్తు చేశారు. జాతి సమగ్రతను, ఐక్యతను నిలబెట్టడానికి తన జీవితాన్ని అర్పించిన మహాత్మా గాంధీ ఈ దేశ పురోగమనానికి ఎప్పుడూ ఓ దిక్సూచిగా నిలుస్తారని కొనియాడారు.