సింహాచలంలో భక్తుల మరణాలు ప్రభుత్వ హత్యలే

1 May, 2025 17:31 IST

విశాఖపట్నం: సింహాచలం చందనోత్సవంలో జరిగిన ఏడుగురు భక్తుల మరణాలు ప్రభుత్వ హత్యలేనని శానసమండలి ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. విశాఖపట్నం క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఈ దుర్ఘటనపై ప్రభుత్వం తక్షణం జ్యుడీషియల్ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. హైలెవల్ కమిటీ పేరుతో ఉత్సవాల ఏర్పాట్లపై సమీక్షించిన అయిదుగురు మంత్రులు నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం వల్లే ఈ సంఘటన చోటుచేసుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తుల మరణాలకు ఈ మంత్రులే బాధ్యత వహించాలని అన్నారు. 
ఇంకా ఆయనేమన్నారంటే...

సింహాచలం చందనోత్సవం నాడు లక్షలాధి మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. పలు రాష్ట్రాల నుంచి భక్తులు సింహాచలంకు తరలివస్తుంటారు. ప్రతిఏటా ప్రభుత్వం భక్తుల రద్దీ దృష్ట్యా ముందస్తుగా అన్ని ఏర్పాట్లను చేస్తుంటుంది. జిల్లా కలెక్టర్‌తో పాటు వివిధ శాఖల సమన్వయంతో అన్ని వసతులు, భద్రత కల్పిస్తుంటారు. ప్రతిఏటా భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. నిన్న జరిగిన దుర్ఘటన చాలా బాధాకరం. ఏడుగురు దుర్మరణం పాలవ్వడానికి ప్రభుత్వ వైఫల్యమే కారణం. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్లే ఈ సంఘటన జరిగింది. ప్రచార ఆర్భాటంపై చూపించే శ్రద్ద, భక్తుల భద్రతపై చూపించలేదు. బాధ్యతలను పక్కకుపెట్టి, వీఐపీల సేవకే అధికారులు పరిమితం అయ్యారు. భక్తులు ఎంతమంది వస్తారు, ఏర్పాట్లు ఎలా చేయాలి, భక్తుల రద్దీని ఎలా క్రమబద్దీకరించాలి, గతంలో చేసిన ఏర్పాట్ల కన్నా మెరుగైన చర్యలు చేపట్టాలనే ఆలోచనే చేయలేదు. ఏడుగురు చనిపోయిన దుర్ఘటన జరిగిన విషయం తెలియగానే మాజీ సీఎం, వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ హుటాహుటిన విశాఖకకు వచ్చి, బాధిత కుటుంబాలను, క్షతగాత్రులను పరామర్శించారు. పార్టీ పరంగా రెండు లక్షల రూపాయలు పరిహారంగా అందించారు. బాధిత కుటుంబాలు కోరుతున్నట్లుగా వారికి ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. ఈ సంఘటనపై సీఎం, డిప్యూటీ సీఎం వంటి బాధ్యత గల స్థానాల్లో ఉన్న వారు స్పందించలేదు. కానీ ప్రతిపక్ష నేతగా వైయస్ జగన్ బాధ్యతతో వ్యవహరించారు. బాధిత కుటుంబాలను పరామర్శించి ఆత్మస్థైర్యం కల్పించారు. 

హైలెవల్ కమిటీ అంటూ వచ్చిన మంత్రులు ఏం చేశారు? 

గత వారం రోజుల కిందట అయిదుగురు మంత్రులు విశాఖకు వచ్చి సింహాచలం చందనోత్సవంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సింహాచలం క్షేత్రంలోనే వారు మీడియాతో మాట్లాడారు. సింహాచలంలో ఎన్నడూ చేయని విధంగా అయిదుగురు మంత్రులం ఏర్పాట్లపై సమీక్ష జరిపాం, భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నిర్ణయాలు చేస్తున్నాం, చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో ఉత్సవాన్ని నిర్వహిస్తున్నామని ప్రకటించారు. కానీ ఉత్సవంలో ఏం జరిగిందని చూస్తే, చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా విషాదాన్ని మిగిల్చింది. వారి నిర్లక్ష్యానికి ఫలితం ఏడుగురి దుర్మరణం. దీనికి మంత్రులే పూర్తి బాధ్యత వహించాలి. ఏనాడు సింహాచల క్షేత్రంలో ఇటువంటి దారుణం జరగలేదు. చిన్నచిన్న ఘటనలు మినహా ఇలా మరణాలు చోటుచేసుకోలేదు.

చంద్రబాబు బాధ్యతారహితంగా మాట్లాడారు 

ఇక సీఎం చంద్రబాబు బాధ్యతారహితంగా మాట్లాడారు. సింహాచలంలో భారీ వర్షం కురవడం వల్లే గోడ కూలిందని తమ నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు. వాతావరణశాఖలో ఎంత వర్షం కురిసిందో లెక్కలు ఉంటాయి, దానిని బయటపెట్టాలి. సంఘటన జరిగినప్పుడు భారీగా గాలులు వీచాయి, కొంత వర్షం కురిసింది. దీనిని అడ్డం పెట్టుకుని సీఎం, డిప్యూటీ సీఎంలు భారీ వర్షాలు కురిసాయంటూ తప్పించుకునే ప్రయత్నం చేశారు. దీనిపై కొద్దిగానైనా బాధగా అనిపించడం లేదా? ఇటువంటి ఘటన ప్రభుత్వానికి తలవంపులు, సిగ్గుపడే అంశం కాదా? ఇటీవలే తిరుపతిలో ఎనిమిది మంది క్యూలైన్లలో చనిపోయారు. నిన్న సింహాచలంలో ఏడుగురు చనిపోతే చీమకుట్టినట్లైనా వారికి లేదు. ముగ్గురితో అధికారుల కమిటీ వేశారు, ఎందుకు దీనిపై జ్యుడీషియల్ ఎంక్వయిరీ వేయలేదు? మంత్రుల సమీక్ష ఏం జరిగిందో, హైలెవల్ కమిటీ ఏ సూచనలు చేసిందో బయటకు వచ్చేది. ప్రభుత్వంలో పనిచేసే అధికారులతో కమిటీ వేస్తే ఏం ఒరుగుతుంది. సంఘటనా స్థలాన్ని వైయస్ఆర్‌సీపీ ప్రతినిధి బృందంగా పరిశీలించాం. అక్కడ నిర్మించిన గోడకు వినియోగించిన సిమెంట్ చూస్తే కనీసం దానిలో కొంచెమైనా నాణ్యత లేదు. మీడియా మిత్రులు కూడా దీనిని చూశారు. ఇంత నాసిరకంగా వారం రోజుల్లో గోడ నిర్మిస్తారా? దీనికి ఎవరు ఆదేశాలిచ్చారు. చందనోత్సవం తేదీని ఈరోజే ప్రకటించారా? హైలెవల్ కమిటీ అంటూ వెళ్ళిన అయిదుగురు మంత్రులకు ఇలా చేయకూడదని తెలియదా? ఈ గోడను ఎవరి కాలంలో కట్టారో, వైయస్ఆర్‌సీపీ హయాంలో కట్టారో చూస్తామంటూ బాధ్యత గల స్థానాల్లో ఉన్న వారు మాట్లాడుతున్నారు. 

దేవాదాయశాఖకు పూర్తిస్థాయి కమిషనరే లేరు

సమీక్షా సమావేశం అనంతరం క్యూలైన్లు, ఆహార పంపిణీ, మంచినీటి వసతి, బస్సులు ఎక్కడి వరకు వస్తాయి, భక్తులు ఎలా దర్శనం కోసం వెడుతున్నారనే అంశాలను ఈ హైలెవల్ కమిటీ లోని మంత్రులు పరిశీలించిందా? దీనికి ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. కూటమి ప్రభుత్వం హిందు ధర్మపరిరక్షణ, దేవాలయాల పునరుద్దరణ అంటూ మాట్లాడుతోంది. కనీసం రాష్ట్రంలో దేవాదాయశాఖకు పూర్తిస్థాయి కమిషనర్ లేరు. ప్రమోటీకి ఇన్‌చార్జీ బాధ్యతలు అప్పగించి బాధ్యత లేకుండా మొత్తం శాఖనే నిర్వీర్యం చేశారు. కొందరు అధికారులపైన కూటమిలోని ప్రభుత్వ పెద్దలకు ఉన్న మమకారంకు భక్తుల ప్రాణాలను ఫణంగా పెడతారా? ఎప్పుడైనా ఇంతకాలం రాష్ట్రంలో ఒక ఐఎఎస్ స్థాయి అధికారి ఉండాల్సిన దేవాదాయశాఖ కమిషనర్ స్థానంలో ప్రమోటీలతో ఇన్‌చార్జీలుగా నడిపించారా? సోషల్ మీడియాలో ఒక వీడియోలో వైరల్ అవుటోంది. దానిలో హైలెవల్ కమిటీ అర్జెంట్‌గా గోడ కట్టమన్నారు, నేను నాలుగు రోజుల్లో గోడను నిర్మించలేను అని చెప్పినా వినకుండా అర్జంట్‌గా గోడ కట్టాల్సిందేనంటూ ఒత్తిడి చేశారని కాంట్రాక్టర్ చెబుతున్నారు. ఏదేనా నిర్మాణం చేయాలంటే దానికి టెండర్ ప్రక్రియ ఉంటుంది. నిర్మాణానికి డిజైన్ ఉంటుంది. ప్రభుత్వ విభాగాల నుంచి అనుమతులు ఉండాలి. అటువంటివి ఏమీ లేకుండా అంత హడావుడిగా గోడ నిర్మించమని ఆదేశించింది ఎవరు? దీని వెనుక ఉన్న పెద్దలు ఎవరు? ఇవ్వన్నీ బయటకు రావాలంటే జ్యుడీషియల్ విచారణ నిర్వహించాలి. 

ఆలయాన్ని సంప్రోక్షణ చేయాలనే ఆలోచనే చేయడం లేదు

సింహాచల క్షేత్రంలో ఏడుగురు భక్తులు చనిపోతే ఈ శాఖకు, హైలెవల్ కమిటీలోని మంత్రులకు ఆ ప్రాంతాన్ని శుద్ది చేయాలి, సంప్రోక్షణ నిర్వహించాలనే ఆలోచన ఇప్పటి వరకు రాలేదు. ఈ ఘటనపై కనీసం సమీక్షించుకున్నారా? కనీసం ఆచార, సంప్రదాయాలను కూడా పాటించే తీరిక లేదా? సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తానన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు కూడా ఇటువంటి ఆలోచన ఎందుకు రాలేదు? పవన్ కళ్యాణ్ కేవలం తన పార్టీకి చెందిన వారికి మాత్రమే సంతాపం ప్రకటించారు. ఏడగురు భక్తులు చనిపోతే కేవలం ఇద్దరు తన పార్టీ వారికే డిప్యూటీ సీఎం, జనసేన నేత పవన్ కళ్యాణ్ సంతాపం చెప్పడం ఎంత వరకు సమంజసం.గతంలో రామతీర్థంలో రాముడి తల నరికిన ఘటనలో ఆవేశంతో మాట్లాడిన ధర్మకర్తలు ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారు? సీఎం, డిప్యూటీసీఎం సంఘటనా స్థలానికి రారు. ప్రతిపక్షనేతగా వైయస్ జగన్‌ గారు స్పందించి వచ్చి మాట్లాడితే దానిని ఎగతాళి చేస్తున్నారు. దీనికి సిగ్గుపడాలి. కూటమి ప్రభుత్వం చేయని పని, ప్రతిపక్ష నేతగా వైయస్ జగన్ చేశారు. ఇదేనా దేవాలయాలు, భక్తుల పట్ల వారికి ఉన్న శ్రద్దా? అని బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఈ మీడియా సమావేశంలో విశాఖ పార్టీ అధ్యక్షుడు కెకె రాజు, ఎమ్మెల్సీలు వరుదు కళ్యాణి, కుంభా రవిబాబులు పాల్గొన్నారు.