పండగలోనూ ప్రజల్లో తీవ్ర నిరుత్సాహం

19 Jan, 2026 10:08 IST

విశాఖపట్నం: కూటమి పాలనలో రైతులు, ఉద్యోగులు, విద్యార్ధులు సహా అన్ని వర్గాల ప్రజల్లోనూ సంక్రాంతి సందడి లేకుండా పోయిందని.. పండగ పూట కూడా రాష్ట్ర ప్రజలకు నిరుత్సాహమే మిగిలిందని శాసనమండలి విపక్షనేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. విశాఖపట్నంలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ...  పండగ ముందే మద్యం ధరలు పెంచిన చంద్రబాబు, భూములు విలువను పెంచుతూ రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచడాన్ని తప్పుబట్టారు. మరోవైపు చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని... మునుపెన్నడూ లేని విధంగా వందలాది కుటుంబాల గ్రామబహిష్కరణే దీనికి నిదర్శమని తేల్చి చెప్పారు. వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్త సాల్మన్ ది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనన్న ఆయన దీనిపై ఏం సమాధానం చెబుతారని ప్రభుత్వాన్ని నిలదీశారు. కూటమి పాలనలో వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో పడిందని, గ్రామాల్లో రైతులకు నేటికీ యూరియా అందుబాటులో లేకపోవడమే దీనికి నిదర్శనమన్నారు. విద్యార్ధులకూ  బాబు పాలనలో న్యాయం జరగడం లేదని.. 18 నెలలుగా ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లించకుండా.. 8 త్రైమాసికాలుగా రూ.5,600 కోట్ల  బకాయిలు  పెట్టడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. వైయ‌స్ఆర్‌సీపీ హయాంలో చేసుకున్న ఒప్పందాలకే కూటమి ప్రభుత్వం శంకుస్థాపన చేస్తుందని తేల్చి చెప్పిన బొత్స సత్యనారాయణ గ్రీన్ కో ప్రాజెక్టు అందులో భాగమేనని స్పష్టం చేశారు. ఈ సందర్బంగా ఇంకా ఏమన్నారంటే... 

● ఏ వర్గానికీ జరగని న్యాయం - కనిపించని పండగ సంబరం..

కూటమి పాలనలో రైతులు, రైతుకూలీలు, పేదవాళ్లు, ఉద్యోగులు, విద్యార్ధులు సహా ఏ వర్గమూ సంతోషంగా లేదు. పండగపూడ ఉండాల్సిన ఆనందం వారి కళ్లల్లోనూ, కార్యక్రమాల్లోనూ కనిపించకపోవడం దురదృష్టం. ప్రభుత్వ పెద్దలు వాళ్ల ఇళ్లు సుఖంగా ఉంటే చాలు ఎవరెలా పోయినా ఫర్వాలేదు అన్నట్టు వ్యవహరించారు. మద్యం గురించి గొప్పగా చెప్పిన చంద్రబాబు నాయుడు పండగ ముందే బాటిల్ పై రూ.10 పెంచారు. పోనీలే వ్యసనపరుల మీద భారం వేశాడు కదా అనుకునేలోపే.. రాష్ట్ర ఆదాయం కోసం భూముల విలువ కూడా పెంచేశారు. రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే షాక్ కొట్టేలా భూముల విలువ పెంచారు. రైతులు పండిన పంటను అమ్ముకుందామనుకుంటే కొనే నాధుడే లేకుండా పోయాడు. గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బంది పెడుతున్నారు. దాని గురించి ఆలోచించే సమయం కూడా ప్రభుత్వంలో ఎవరికీ లేకుండా పోయింది. నేటికీ రాష్ట్రంలో యూరియా కొరత తీవ్రంగానే ఉంది.. నేటికీ రూ.270 ఖరీదు చేసే యూరియా బస్తా మార్కెట్ లో రూ.600 పలుకుతోంది. నేను చెప్పింది వాస్తవం కాదని.. నా మాటలను ఎవరైనా ప్రభుత్వం తరపున నుంచి ఖండిస్తారేమోనని చూస్తే.. ఎవ్వరూ నోరు మెదపడం లేదు. కారణం ఇవన్నీ వాస్తవాలు. 
విద్యార్ధుల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు చెల్లించక నేటికి 8 త్రైమాసికాలు గడిచిపోయాయి. ఒక క్వార్టర్ కి రూ.700 కోట్లు చొప్పున రూ.5600 కోట్లు బకాయిలు పెండింగ్ లో పెట్టిన ప్రభుత్వం విద్యార్ధుల జీవితాలతో చెలగాటమాడుతోంది. విద్యార్ధుల పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారవుతోంది. దాదాపు రెండు నెలలుగా ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు కూడా వారి సిబ్బందికి జీతాలు కూడా ఇవ్వలేదు. ఆరోగ్యశ్రీ పూర్తిగా అటకెక్కిపోయింది. ఇంత దారుణంగా ఉన్న తమ అనుకూల ప్రచారసాధనాల్లో ఆహా ఓహో అని  ప్రచారం చేసుకుంటున్నారు. 

● మా పాలనలో ఒప్పందాలకే ప్రారంభోత్సవాలు...

గ్రీన్ కో కంపెనీ ప్రాజెక్టు కాకినాడలో శంకుస్థాపన చేస్తున్నట్టు మీడియాలో చూశాం. వాస్తవానికి గతంలో వైయస్.జగన్ హయాంలో జరిగిన ఒప్పందం మేరకే ఈ ప్రాజెక్టు ఏపీలో ఏర్పాటవుతోంది. గ్రీన్ కో కంపెనీకి అభినందనలు. అయితే ఈ నేపధ్యంలో కొన్ని రాజకీయ వ్యాఖ్యానాలు చూశాను. గత ప్రభుత్వంలో పారిశ్రామిక వేత్తలను బెదరగొట్టామని చెబుతున్నారు. ఇటీవలే వాస్తవమేంటో ఆదానీ, వారి కుమారుడు ఇద్దరూ చెప్పారు. గ్రీన్ కో ప్రాజెక్టు శంకుస్ధాపనలో ఈ కంపెనీ ప్రతినిధులను అడిగితే ఎవరు ఏం చేశారో చెబుతారు. ఎవరు పారిశ్రామిక వేత్తలను వెళ్లగొడుతున్నారు? ఈ రెండు సంవత్సరాల కాలంలో ఎవరైనా పరిశ్రమలు పెట్టడానికి ముందుకు వస్తే.. వాటి బై ప్రొడక్ట్స్ తమకే ఇవ్వాలని లేకపోతే ముందుకు వెళ్లనిచ్చేది లేదని ఎమ్మెల్యేలు గిరిగీస్తున్న సందర్భాలు అనేకం. స్వయంగా జిందాల్ లాంటి సంస్థలు  ఏపీలో పెట్టుబడులు పెడతామంటే వారిని ఏపీకి రానివ్వకుండా ఎవరు అడ్డుపడ్డారు? మా హయాంలో లులూ లాంటి దౌర్భాగ్య కంపెనీలు అంగీకరించలేదు, ఇప్పుడు కూడా స్పష్టం చేస్తున్నాం.  రియల్ ఎస్టేట్ కంపెనీలకు కోట్లాది రూపాయలు ఖరీదు చేసే భూములను అప్పనంగా కట్టబెడితే చూస్తూ ఊరుకునేది లేదు. దానికి వ్యతిరేకంగా ప్రత్యక్ష పోరాటం చేస్తాం. బహిరంగంగానే మేం స్పష్టం చేస్తున్నాం. ఈ రెండేళ్లలో రైతు కోసం, వారి ప్రయోజనాల కోసం ఏం చేశామో అధికార పార్టీ నేతలు చెప్పగలరా? 

● రెండేళ్ల గ్రామ బహిష్కరణా? రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా?

చంద్రబాబు గారూ, అసలు రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా? గడిచిన ఐదేళ్లలో ఏ గ్రామంలోనైనా రెండేళ్లు పాటు 100 నుంచి 200 కుటుంబాలను గ్రామ బహిష్కరణ చేసిన సందర్భాలు ఎప్పుడైనా ఉన్నాయా? ఊరులోకి వస్తే వాళ్ళను హత్య చేస్తారా? అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? చనిపోయన వ్యక్తి అంతిమ సంస్కారానికి కూడా హాజరు కానివ్వకుండా మృతులు బంధువులను అడ్డగిస్తారా? అందుకు ఆధార్ కార్డు చూపించాలా? అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యయుత పాలన ఉందా? పెద్ద పెద్ద మాటలు చెప్పే పవన్ కళ్యాణ్ గారికి ఇవేమీ కనిపించడం లేదా? ఎన్నికలకు ఏడాది ముందు మీరు ఎప్పుడెప్పుడు, ఏమేం మాట్లాడారో మీరోసారి రీకాల్ చేసుకుని అప్పుడు మాట్లాడండి. వాస్తవ పరిస్ధితులు మీకే అర్ధం అవుతాయి. పల్నాడు జిల్లాలో వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్త సాల్మన్ హత్య అత్యంత దారుణం. రెండేళ్ల తర్వాత గ్రామంలోకి వచ్చిన వ్యక్తిని రాళ్లతో కొట్టి చంపుతారా? ఇదేమి అన్యాయం? అసలు రాష్ట్రంలో వ్యవస్థలున్నాయా? సాల్మన్ హత్య  ఘటనపై ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు? 

ఒకవైపు దేశ ప్రధాని నరేంద్రమోదీగారు ప్రజాస్వామ్యానికి భారతదేశం తల్లి లాంటిదని చెబుతున్నారు. రాష్ట్రంలో పరిస్ధితులు చూస్తుంటే.. ప్రజాస్వామ్యం అంటే ఇదేనా? అనిపిస్తుంది. ప్రధాని నరేంద్ర మోదీ కూటమి పాలన ఏపీలో ఎలా ఉందో ఒక్కసారి చూడాలి.  రాష్ట్రంలో జరుగుతున్న గ్రామ బహిష్కరణలపై కూడా స్పందించాలి.  వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్త సాల్మన్ హత్య అత్యంత దారుణం, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. పల్నాడులో శాంతిభద్రతల పరిరక్షణలో పోలీస్ వ్యవస్థ పూర్తిగా వైఫల్యం చెందింది.  
చంద్రబాబు గారూ గుర్తుపెట్టుకొండి. ప్రతి రాత్రి తర్వాత కచ్చితంగా పగలు వస్తుంది. ఈ తరహా పాలనతో రాబోయే తరాలకు ఏం సందేశం ఇవ్వదల్చుకున్నారు. ఇదేమి పరిపాలన? ఏ రకమైన పరిపాలనిస్తామని ప్రజలతో ఓట్లు వేయించుకున్నారు. రెండేళ్లలో మీరిచ్చిన హామీలను ఏమేరకు అమలు చేశారు? 
విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు, సామాన్యులు ఇలా ఏ వర్గానికీ, ఎక్కడా మేలు చెయ్యడం లేదు. రైతులకు గిట్టుబాటు ధరలేదు. విద్యార్ధులకు ఫీజు రీయింబర్స్ మెంట్ లేదు. నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు. పేదలకు ఆరోగ్యశ్రీ లేదు. ఏ వర్గానికీ కూటమి పాలనలో మేలు జరగడం లేదు. 

సంక్రాంతి మూడు రోజులు ఎక్కడ చూసినా కోడిపందాలు కోసమే. కేవలం పందేలను మాత్రమే చూపించారు తప్ప.. మరో వార్త లేదు. ఇది ఏ రకమైన సంస్కృతి? గతంలో ఎప్పుడూ ఇంత దారుణంగా చూడలేదు. మిగతా సాంస్కృతిక కార్యక్రమాలు ఎందుకు చూపించలేదు? రాష్ట్రంలో పరిస్థితులు  రోజురోజుకీ దిగజారిపోయి, విలువలు నశిస్తున్నాయని ఆక్షేపించారు.  ప్రజల కనీస అవసరాలను తీర్చడంలో ప్రభుత్వం విఫలమవుతోందని బొత్స  సత్యనారాయణ మండిపడ్డారు. ఇది బాధ్యత లేని ప్రభుత్వమని ఇలాంటి ప్రభుత్వం ఉన్నా, ఊడినా ఒక్కటేనని బొత్స సత్యనారాయణ తేల్చి చెప్పారు.