కేవీబీపురం సర్పంచ్ గిరి అరెస్ట్

17 Jan, 2026 11:55 IST

చిత్తూరు జిల్లా:  వైయ‌స్ఆర్‌సీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పుట్టిన రోజు సంద‌ర్భంగా మేక‌కు న‌రికారంటూ కేవీబీపురం స‌ర్పంచ్ గిరిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో గిరితో పాటు మురళీ (భాష), శ్రీధర్‌ను కూడా అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. వీరిని కేవీబీపురం పోలీసులు అరెస్ట్ చేసి పుత్తూరుకు తరలించారు.  రాజ‌కీయ క‌క్ష‌తో టీడీపీ నేత‌లు ఫిర్యాదు చేయ‌డంతో పోలీసులు స‌ర్పంచ్‌ను అరెస్టు చేయ‌డం ప‌ట్ల వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు ఆందోళ‌న చేప‌ట్టారు.  సర్పంచ్ గిరి అరెస్టును నిరసిస్తూ పెద్ద సంఖ్యలో వైయ‌స్ఆర్‌సీపీ నేతలు, కార్యకర్తలు పోలీస్ స్టేషన్‌కు చేరుకోవడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అరెస్ట్‌కు వ్యతిరేకంగా సర్పంచ్ గిరి భార్య, పిల్లలు, తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. తమ కుటుంబ సభ్యుడిపై తప్పుడు కేసులు బనాయించారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు అదనపు బలగాలను మోహరించారు. 

ఈ సందర్భంగా వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ నేతలు మాట్లాడుతూ, అక్రమ కేసులతో వైయ‌స్ జ‌గ‌న‌న్న సైనికులను భయపెట్టలేరని స్పష్టం చేశారు. వైయ‌స్ఆర్‌సీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టి అక్రమ అరెస్టులకు పాల్పడడం రోజురోజుకీ మితిమీరుతోందని తీవ్రంగా విమర్శించారు. “ఒక మేకను నరికిన కేసుకే రిమాండ్ అయితే, బయట వందల మేకలు, పోటేళ్లను నరికే వారిని జీవిత ఖైదుకు పంపుతారా?” అని ప్రశ్నిస్తూ, ఇది పూర్తిగా రాజకీయ కక్ష సాధింపు చర్యగా పేర్కొన్నారు. తప్పుడు కేసులు పెట్టించిన నాయకులు త్వరలోనే జైలుకు వెళ్లే రోజులు లెక్కపెట్టుకోవాలని హెచ్చరించారు. తప్పుడు కేసులకు న్యాయస్థానాల్లో తప్పకుండా చెంపపెట్టే తీర్పు వస్తుందని వైయ‌స్ఆర్‌సీపీ నేతలు ధీమా వ్యక్తం చేశారు. “ఈసారి ఎవ్వరినీ మర్చిపోం… అందరికీ రిటర్న్ గిఫ్ట్ తప్పదు” అని హెచ్చరిస్తూ, టీడీపీ నేతల తప్పులు, అవినీతి వ్యవహారాలను ప్రజల ముందు ఉంచి లెక్కలు అడుగుతామని ప్రకటించారు. పోలీసులు తప్పుడు కేసులను ప్రోత్సహించకుండా చట్టబద్ధంగా వ్యవహరించాలని వైసీపీ నాయకులు డిమాండ్ చేశారు.