కూటమి పాలనలో దాడులు పెరిగాయి
చిత్తూరు జిల్లా: ఎస్.ఆర్.పురం మండలం కొత్తపల్లిమిట్టలో జీడి నెల్లూరు నియోజకవర్గ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కృపాలక్ష్మీ అధ్యక్షతన బూత్ కమిటీలు, నాయకులతో కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి హాజరై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కృపాలక్ష్మీ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాదిన్నర కాలంలో మహిళలు, ఎస్సీ, ఎస్టీలపై దాడులు పెరిగిపోయాయని ఆరోపించారు. ప్రజలకు కొత్త పెన్షన్లు అందడం లేదని, సంక్షేమ కార్యక్రమాలు పూర్తిగా నిలిచిపోయాయని విమర్శించారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని, ప్రభుత్వ యంత్రాంగం ఈ విషయాల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అన్నారు. జీడి నెల్లూరు నియోజకవర్గంలో ఇసుక, గ్రావెల్ దోపిడీలు విస్తృతంగా జరుగుతున్నాయని, కూటమి నేతలు ఇందులో ప్రమేయం ఉన్నారని ఆరోపించారు.
ఇకపై పార్టీ బలోపేతం కోసం ప్రతి బూత్ స్థాయిలో కార్యకర్తలు మరింత చురుకుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డిను మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకునే వరకు ప్రతి కార్యకర్త కష్టపడి పని చేయాలని సూచించారు. సమావేశంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.