కరోనా కంటే ’ఎల్లో’ వైరస్ మరింత డేంజర్
తాడేపల్లి : చైనాలో కరోనా వైరస్ ఉంటే, ఆంధ్రప్రదేశ్లో ఎల్లో వైరస్ విజృంభించిందని మంత్రి కొడాలి నాని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ పథకాలపై ఎల్లో మీడియా చేస్తున్న విష ప్రచారాన్ని ఆయన తూర్పారబట్టారు. తాడేపల్లిలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం కొడాలి నాని మీడియాతో మాట్లాడారు. అమ్మ ఒడి పథకం ద్వారా 44 లక్షల మంది తల్లులకు లబ్ధి చేకూరిందని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన 7 నెలల్లోనే సంక్షేమ పథకాలతో కోటిమందికిపైగా ప్రజలకు లబ్ధి చేకూరిందన్నారు. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ కన్నా ‘ఎల్లో’ వైరస్ మరింత ప్రమాదకరమైనదని ఆయన విమర్శించారు.
చంద్రబాబు ప్రభుత్వంలో 39 లక్షల మందికి ఇచ్చే పెన్షన్లను.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 54 లక్షల మందికి పెంచారని మంత్రి కొడాలి నాని తెలిపారు. తమ ప్రభుత్వం రూ.1000 పెన్షన్ను రూ.2,250కి పెంచిందని గుర్తుచేశారు. పెన్షన్ల కోసం గంటల తరబడి క్యూలైన్లలో నిలబడాల్సిన అవసరం లేకుండా వాలంటీర్లతో ఇంటి వద్దనే అందచేస్తున్నామని పేర్కొన్నారు. అలాగే పెన్షన్లపై ప్రతిపక్ష నేత చంద్రబాబు చేసిన విమర్శలను ఆయన తిప్పికొట్టారు. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం కోసం సీఎం వైఎస్ జగన్ కృషి చేస్తున్నారన్నారు. గ్రామ సచివాలయాల్లో లక్షల మందికి ఉద్యోగాలు కల్పించారని వెల్లడించారు.
చంద్రబాబు నాయుడే పెద్ద 420..
చంద్రబాబు, రామోజీరావు, రాధాకృష్ణ పేర్లు ఉంటేనే వృద్ధాప్య పెన్షన్లు ఇచ్చినట్లా అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే వనరులను దోచుకోవచ్చని, ప్రభుత్వ పథకాలపై ఎల్లో మీడియా విష ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడే పెద్ద 420 అని మంత్రి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారన్న విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు.
కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదు..
బీజేపీతో చెట్టాపట్టాలు వేసుకుని తిరిగే నేతలు తమపై విమర్శలు చేస్తున్నారని.. బడ్జెట్లో రాష్ట్రానికి నిధులు కేటాయించకపోవడంపై కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదని కొడాలి నాని మండిపడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తేలేదని ప్రచారం చేస్తున్నారని అన్నారు. వైఎస్ జగన్ అద్భుతంగా పరిపాలిస్తే తిరిగి సినిమాల్లోకి వెళతానని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చెప్పిన మాటలను ఈ సందర్భంగా నాని గుర్తుచేశారు. ఇప్పుడు చెప్పిన మాట ప్రకారమే సినిమాలు చేసుకుంటున్నారని.. పవన్ చర్యలతో సీఎం వైఎస్ జగన్ అద్భుతంగా పరిపాలిస్తున్ననేది స్పష్టం అయిందని అని కొడాలి నాని పేర్కొన్నారు.
జేసీ నోటిని అదుపులో పెట్టుకో..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని లూటీ చేసిన వ్యక్తి జేసీ దివాకర్ రెడ్డి అని మంత్రి కొడాలి నాని విమర్శించారు. చంద్రబాబు నాయుడు బూట్లు నాకి 500 ఎకరాల సున్నపు క్వారీలను తీసుకున్నారని ఆరోపించారు. పర్మిట్లు కట్టకుండా దివాకర్ ట్రావెల్స్ బస్సులు నడిపారని, ఓవర్ స్పీడ్తో ప్రజల ప్రాణాలు తీశారని చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయనే జేసీ బస్సులను సీజ్ చేశారని, గనులను వెనక్కి తీసుకున్నారన్నారు. జేసీ నోటిని అదుపులో పెట్టుకుని మాట్లాడాలని మంత్రి హితవు పలికారు.
చంద్రబాబు హయాంలో రూ. 5వేల కోట్ల ఇసుక మాఫియా జరిగిందని మంత్రి విమర్శించారు. అభివృద్ధి, పాలనా వికేంద్రీకరణ జరగాలని ముఖ్యమంత్రి జగన్ ప్రయత్నిస్తే మండలిలో బాబు అడ్డుకునే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. సీఎం జగన్ చేయగలిగిందే చెప్తున్నారని ప్రజలు నమ్ముతున్నారన్నారని అన్నారు. చంద్రబాబు కుట్రల వల్ల సీఎం వైఎస్ జగన్ ప్రతిష్టను దెబ్బ తీయలేరన్నారు. టీడీపీ ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడికి మతి భ్రమించిందని.. నాలుగేళ్లు బీజేపీతో కలిసి తిరిగి ప్యాకేజీ కోసం హోదాను గాలికి వదిలేశారని చెప్పారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని మంత్రి కొడాలి నాని అభిప్రాయపడ్డారు.