ఖమ్మంలో వైయ‌స్‌ జగన్‌ అభిమానులను పరామర్శించిన కారుమూరు వెంకట్‌ రెడ్డి

13 Jan, 2026 11:38 IST

ఖమ్మం:  తెలంగాణ రాష్ట్రం ఖమ్మం పట్టణంలో వైయ‌స్ఆర్‌సీపీ అధినేత‌, ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అభిమానులను వైయ‌స్ఆర్‌సీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార ప్రతినిధి కారుమూరు వెంకట్‌ రెడ్డి పరామర్శించారు. వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించినందుకు వైయ‌స్ జ‌గ‌న్‌ అభిమానులపై పోలీసులు కేసులు నమోదు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. గత డిసెంబర్‌ 21న ఖమ్మంలో వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి జన్మదినం సందర్భంగా ర్యాలీ, రక్తదాన శిబిరం, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించినందుకు గాను 11 మంది వైయ‌స్ఆర్‌ అభిమానులపై పోలీసులు అక్రమంగా కేసులు నమోదు చేశారని వెంకట్‌ రెడ్డి ఆరోపించారు. ఈ వేడుకలకు నిధులు ఎక్కడి నుంచి వచ్చాయన్న పేరుతో, ఇతర పార్టీల నుంచి సహాయం అందిందా అంటూ కార్యకర్తలను పోలీసులు విచారించారని, అందులో 8 మందిని రిమాండ్‌కు తరలించి 13 రోజుల పాటు జైలులో ఉంచారని తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణలోని ఒక మంత్రి, అతని కుమారుడు పరోక్షంగా తెలుగుదేశం పార్టీకి మద్దతుగా వ్యవహరిస్తూ వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలను వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఒక ర్యాలీ టీడీపీ కార్యాలయం ముందు నుంచి వెళ్లడమే నేరమా అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా వైయ‌స్‌ జగన్‌ అభిమానులపై ఇలాగే తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని, కోడిని లేదా మేకను కోసినా కేసులు పెడుతున్న పరిస్థితి నెలకొందని విమర్శించారు. అయినప్పటికీ, ఎన్ని కేసులు పెట్టినా వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు భయపడబోవని స్పష్టం చేశారు. వచ్చే ఏడాది ఖమ్మంలో ఇంకా ఘనంగా వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహిస్తామని, ప్రజాస్వామ్య హక్కులను అణచివేయలేరని వెంకట్‌ రెడ్డి స్పష్టం చేశారు. త్వరలోనే ఈ కేసుల బాధితులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని వ్యక్తిగతంగా కలవబోతున్నారని ఆయన తెలిపారు.