హెరిటేజ్ దోపిడీ కోసమే హడావుడి కేబినెట్ 

15 Mar, 2026 09:52 IST

తాడేపల్లి: ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన భేటీ అయిన మంత్రిమండలి... కేవలం ఆయన సొంత సంస్థ 'హెరిటేజ్'కు లబ్ధి చేకూర్చడానికేనని  వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి మండిపడ్డారు. శనివారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వ తీరును ఎండగట్టారు. రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే కేబినెట్ సమావేశానికి ఏకంగా ఆరుగురు మంత్రులు హాజరుకాకపోవడం ఆశ్చర్యకరమని కారుమూరి అన్నారు. "ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కేబినెట్ మీటింగ్‌కు వచ్చే తీరిక లేదని ఆక్షేపించారు. హైదరాబాద్‌లో టిఫిన్ చేసి, గన్నవరానికి ప్రత్యేక విమానంలో వచ్చి, ఇక్కడ పనులు చూసుకుని స్నాక్స్ సమయానికి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోతున్నారని, ప్రజల సమస్యల కంటే షూటింగులు, ప్రయాణాలే ఆయనకు ముఖ్యం" అని ఎద్దేవా చేశారు. హోంమంత్రి అనితతో సహా కీలక మంత్రులు లేకపోయినా కేవలం హెరిటేజ్ కోసమే కేబినెట్  సమావేశం నిర్వహించారని తేల్చి చెప్పారు. ఏపీ ప్రజలకు రంజాన్ తోఫా, సంక్రాంతి కానుక లేకపోయినా.. హెరిటేజ్‌కు మాత్రం వందల కోట్ల రాయితీలు ఉన్నాయని కారుమూరి ధ్వజమెత్తారు.రాష్ట్ర సంపదను బినామీలకు, సొంత కంపెనీలకు దోచిపెడుతున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ల తీరును ప్రజలు గమనిస్తున్నారని, త్వరలోనే వారికి బుద్ధి చెబుతారని కారుమూరి వెంకటరెడ్డి హెచ్చరించారు. ఈ సందర్బంగా ఇంకా ఏమన్నారంటే... 

6గురు మంత్రులు రాకపోయినా హడావుడిగా కేబినెట్...

ఏపీ కేబినెట్ ఆంధ్రప్రదేశ్ లో బేటీ అయితే... ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాత్రం తెలంగాణా రాష్ట్రరాజధాని హైదరాబాద్ లోని మాదాపూర్ లో ఉన్నారు. సాధారణంగా పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లో టిఫిన్న చేసి బేగంపేట విమానాశ్రయం చేరుకుని ప్రత్యేక విమానంలో గన్నవరంలో దిగి.. అక్కడ నుంచి ప్రత్యేక హెలీకాప్టర్ లో మంగళగిరి వస్తారు. ఇక్కడ సమావేశాలు, ఇతర కార్యక్రమాలు చూసుకుని భోజనం అనంతరం మరలా సాయంత్రం స్నాక్స్ సమయానికి మరలా హైదారబాద్ వెళ్లిపోతారు. కానీ డిప్యూటీ సీఎం గారు హాజరు కాలేదంటే ఆయనకి... నిన్నటి కేబినెట్ మీటింగ్ కు కూడా వచ్చే తీరిక లేనట్టుంది. వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయస్.జగన్ తిట్టడానికి ముందువరుసలో ఉండే... మరో కీలకమైన శాఖ హోం మంత్రి వంగలపూడి అనిత కూడా కేబినెట్ మీటింగ్ కు హాజరు కాలేదు.
ఇక పరిశ్రమలశాఖ మంత్రి టీ జీ భరత్, నాదేండ్ల మనోహర్ తో మొత్తం ఆరుగురు మంత్రులు రాకపోయినా.. ఆగమేఘాల మీద కేబినెట్ మీటింగ్ ఎందుకు నిర్వహించారు?.  

హెరిటేజ్ కు వందల కోట్ల రాయితీ కోసమే కేబినెట్...

అంత హఠాత్తుగా కేబినెట్ మీటింగ్ నిర్ణయించాల్సిన అంశాలేంటి, ప్రజలు ఎదుర్కొంటున్న గ్యాస్ ఇబ్బందుల మీద నిర్వహించారేమోనని అంతా ఎదురుచూస్తే... తమ సొంత సంస్ద హెరిటేజ్ కు వందల కోట్ల రాయితీలివ్వడం కోసమే కేబినెట్ మీటింగ్ నిర్వహించారు. కేబినెట్ మీటింగ్ సారాంశం ఏమిటంటే... హెరిటేజ్ కు ఉగాది కానుక ఇవ్వడానికే నిర్వహించినట్లు స్పష్టమవుతోంది. ఏపీ ప్రజలకు రంజాన్ తోఫా లేదు, సంక్రాంతి కానుక లేదు, రోజూ బాదుడే బాదుడు తప్ప మరొక్కటి లేదు. కానీ హెరిటేజ్ కు మాత్రం ఉగాది కానుకలివ్వడానికే ఈ కేబినెట్ మీటింగ్. అలా అని హెరిటేజ్ రాష్ట్ర ప్రజలకు పెద్ద ఎత్తున ఉద్యోగాలిచ్చిన దాఖలాలు కూడా లేవు. 
18-02-2026న జరిగిన 15వ ఎస్ ఐ పీ బీ సమావేశంలో అజెండా నెంబరు 19లో హెరిటేజ్ పుడ్స్ లిమిటెడ్ కు తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కాశీపెంట గ్రామంలో ప్రస్తుతం ఉన్న హెరిటేజ్ పుడ్స్ లిమిటెడ్ కు ప్రస్తుతం ఉన్న మిల్క్ ప్రాసెసింగ్ టెక్నాలజీ అప్ గ్రేడేషన్ కు ప్రత్యేక ప్రోత్సాహకాలు మంజూరుకు ఆమోదం తెలిపారు. ఇందులో భాగంగా రూ.209 కోట్లు పెట్టుబడి హెరిటేజ్ పెడుతూ 35 మందికి ప్రత్యక్ష ఉపాధి కల్పిస్తే... అందుకు గానూ ఏపీ  ప్రభుత్వం హెరిటేజ్ కు రూ.1  యూనిట్ కరెంటు రాయితీ కల్పించడంతో పాటు, ఐదేళ్ల పాటు స్టేట్ జీఎస్టీని మినహాయిస్తుంది. అంటే దాదాపు  కేవలం 35 ఉద్యోగాలివ్వడం కోసం ప్రభుత్వం రూ.100 కోట్ల రాయితీ అందిస్తూ భారీ దోపిడీకి పాల్పడుతోంది. 

గతంలో రూ.24 కోట్ల ప్రజాధనం హెరిటేజ్ కు దోపిడీ...

ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో తన రాజకీయ జీవితంలో తాను అధికారంలో ఉండగా గానీ, గత ప్రభుత్వాల హయాంలో గానీ ఏనాడూ తాను ప్రత్యక్షంగానూ, పరోక్షంగా హెరిటేజ్ కోసం రాయితీలు తీసుకోలేదని పచ్చి అబద్దాలు మాట్లాడాడు. నిజం చెప్పడం తన జీవితంలో చంద్రబాబుకు  ఏనాడూ అలవాటు లేదు. మరి ఇప్పుడు దీనిపై చంద్రబాబు ఏం సమాధానం చెప్తారు? మరోవైపు ఈ అంశం కేబినెట్ లో చర్చకు వచ్చినప్పుడు సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి లోకేష్ బయటకు వెళ్ళిపోయారని చెబుతున్నారు. అంటే ముఖ్యమంత్రి ఆమోదం లేకుండానే మిగిలిన మంత్రులే ఈ నిర్ణయం తీసుకున్నారా? హెరిటేజ్ అంశం చర్చకు వచ్చినప్పుడు చంద్రబాబు, లోకేష్ లు సిగ్గుపడ్డారా? లేదా నవ్వుతారని అనిపించిందా? అసలు సీఎం లేకుండానే మంత్రులే నిర్ణయం తీసుకున్నారా? గతంలో కూడా చంద్రబాబు హెరిటేజ్ కు 2014-19 మధ్యలో దాదాపు రూ.24 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి చెల్లించారు. స్వయంగా హెరిటేజ్ సంస్థే ఒక నోట్ ను 11-06-2020లో విడుదల చేస్తూ... ప్రభుత్వానికి తాము రూ.44 కోట్ల విలువైన మజ్జిగ సరఫరా చేసినట్లు వచ్చిన వార్తలు ఆశ్చర్యం కలిగించాయని.. వాస్తవానికి 2015-16, 2019-20 లలో రాష్ట్రంలోని కొన్ని దేవాలయాలకు రూ.1.49 కోట్ల విలువైన మజ్జిగ సరఫరా చేశామని చెప్పడంతోపాటు ఆహార పౌరసరఫరాల కార్పొరేషన్ కు కూడా 2014-15, 2015-16లో రూ.21.19 కోట్ల విలువైన నెయ్యిని కడప, కర్నూలు,అనంతపురం, నెల్లూరు, చిత్తూరు, కృష్ణా, శ్రీకాకుళం జిల్లాలకు సరఫరా చేశామని చెప్పారు. అంటే చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ ప్రభుత్వ సొమ్మును తన సొంత సంస్థ హెరిటేజ్ కు అప్పనంగా దోచిపెడుతున్న మాట పచ్చి నిజం. గతంలో ఇదే తరహా దోపిడీకి పాల్పడ్డ బాబు, ఇప్పుడూ కూడా అదే దోపిడీకి తెరలేపాడు. 

విశాఖలో బాబు బంధువులు రూ.5వేల కోట్ల భూదోపిడీ....

వాస్తవానికి డెయిరీలకు ఇవ్వాలనుకుంటే చంద్రబాబు ప్రభుత్వం ప్రభుత్వ డెయిరీలకు చేయూతనివ్వాల్సింది పోయి.. తన సొంత సంస్థకు కట్టబెట్టారు. కేవలం 35 మందికి ఉద్యోగాలిస్తే.. రూ.100 కోట్ల రాయితీలు ఎలా ఇస్తారు? ఇటీవలే చంద్రబాబు ప్రభుత్వం రూ.5వేల కోట్ల విలువైన ఖరీదైన భూములను విశాఖ రుషికొండ వద్ద తన బంధువు, ఎంపీ భరత్ కు చెందిన గీతం విద్యాసంస్థలు కబ్జా చేస్తే.. వారికే ఆ భూములను కట్టబెట్టారు. ఇదే పని సామాన్యులు చేస్తే వారిని తక్షణమే అరెస్టు చేస్తారు. వాస్తవానికి వైయస్.జగన్ హయాంలో గీతం విద్యాసంస్థలు కబ్జా చేసిన భూములను స్వాధీనం చేసుకుంటే.. చంద్రబాబు అధికారంలోకి రాగానే కబ్జా చేస్తే తిరిగి వారికే కట్టబెట్టారు. 

టిక్కెట్ రేట్ల పెంపుపై తప్ప- ప్రజా సమస్యల పట్టని పవన్ కళ్యాణ్ 

ఇక కేబినెట్ మీటింగ్ కు పవన్ కళ్యాణ్ రాకపోయినా ఆయన సినిమా  ప్రమోషన్ లో బాగంగా టిక్కెట్లు అధిక ధరలకు అమ్ముకోవడానికి మాత్రం అనుమతిలిచ్చారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఇంతవరకు కాపునేస్తం 2024లో ఎందుకు ఇవ్వలేదు అని కానీ, 2025లో కూడా ఎందుకు ఇవ్వలేదని కానీ, విద్యార్ధులకు ఫీజు రీయింబర్స్ మెంట్ ఎందుకు చెల్లించడం లేదని కానీ అడగడం లేదు. పైగా తన మేనిఫెస్టోలో షణ్ముఖ వ్యూహం పేరుతో ప్రతి నియోజకవర్గంలో 500 మంది చొప్పున ఎంపిక చేసి ఏడాదికి రూ.10 లక్షల చొప్పున ఇస్తామని హామీ ఇచ్చారు. ఒక్కరికి కనీసం రూ.10 ఇచ్చిన పాపాన పోలేదు. దాని గురించి మాత్రం మాట్లాడడు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత హరిహరవీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ ఈ మూడు సినిమాలకు టిక్కెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతులు మీద  ఉన్న శ్రద్ధ.. రాష్ట్ర ప్రజల సమస్యల మీద మాత్రం లేదు.  రాష్ట్రంలో హాస్టళ్ల నిర్వహణ అత్యంత అధ్వాన్నంగా ఉంది. ఉడికీ ఉడకని అన్నంలో పసుపు కలిపి పులిహోర అని వడ్డిస్తున్నారు. సిగ్గుపడాల్సిన దుస్థితి. ఆ పథకానికి మరలా డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అని పెట్టి ఆమెను అవమానించారు. 
తన శాఖ అధికారులపై అధికార పార్టీ ఎమ్మెల్యే దాడిచేసినా ఉప ముఖ్యమంత్రి స్పందించకపోవడం దారుణం. కేవలం రాష్ట్ర సంపదను వాటాలు వేసుకుని పంచుకుంటూ.. రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చి నాశనం చేస్తున్నారు. ఉన్న సంపదను ఉల్పా లాంటి వాళ్లకి, తమ బినామీలకు 99 పైసలకే దోచిపెడుతున్న విషయాన్ని రాష్ట్ర ప్రజలు గమనించాలని వెంకటరెడ్డి విజ్ఞప్తి చేస్తున్నాను. 

అనంతరం పాత్రికేయుల ప్రశ్నలకు బదులిస్తూ...

గిరిజనులకు డోలీ మోత లేని రోజు, వారికి ఇంటింటికీ వైయస్.జగన్ హయాంలో ఇచ్చినట్లు రేషన్ అందిన నాడు, వారికి పూర్తి సంక్షేమ ఫలాలు అందిన నాడు ఆవిర్భావ దినోత్సవాన్ని గిరిజనుల మధ్య చేసుకుని ఉంటే బాగుండేది. ఇవాళ గిరిజనులు రేషన్ కోసం 40 కిలోమీటర్లు వెళ్లాల్సిన దుస్థితి వచ్చింది. దీనికి పవన్ కళ్యాణ్ ఏం సమాధానం చెప్తారు? టీడీపీకి బీ పార్టీ లాంటి జనసేన గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు.