'ఉచిత పంటల బీమా' ని పునరుద్ధరించాలి
తాడేపల్లి: కూటమి ప్రభుత్వం ఆపేసిన ఉచిత పంటల బీమా పథకాన్ని తక్షణం పునరుద్ధరించాలని, లేదంటే రైతుల ఆగ్రహాన్నికి గురికావాల్సి ఉంటుందని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు హెచ్చరించారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం కొలువుదీరిన నాలుగు నెలల్లో ఏ ఒక్కరోజూ రైతుల బాగోగులు పట్టించుకున్న పాపానపోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సూపర్ సిక్స్ లో భాగంగా రైతులకు ఏటా ఇస్తామన్న రూ. 20 వేలు ఇవ్వకపోగా, గత ఐదేళ్లుగా అమలు జరుగుతున్న ఉచిత పంటల బీమా పథకాన్ని అటకెక్కించారని ఆరోపించారు.
2023-2024 సీజన్‌కి గాను ఈ ఏడాది జూన్‌లో రైతుల తరఫున రూ. 930 కోట్లు చెల్లించకుండా ఎగ్గొట్టిన కారణంగా వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు అందాల్సిన రూ. 1,385 కోట్లు పరిహారం అందకుండా ఆగిపోయింది. గత ఐదేళ్ల వైయస్ఆర్‌సీపీ పాలనలో రైతుల తరఫున రూ. 3,022.26 కోట్లను ప్రీమియం రూపంలో బీమా కంపెనీలకు చెల్లించడం జరిగిందని కారుమూరి గుర్తుచేశారు. గడిచిన ఐదేళ్లలో 5.2 ఎకరాలకు బీమా అందించామని, సగటున ఏడాదికి 40.5 లక్షల మంది రైతులకు ఐదేళ్లలో 2.04 కోట్ల మందికి బీమా కవరేజ్ కల్పించినట్టు చెప్పారు. 2014-2019 మధ్య ఉచిత పంటల బీమా పథకం కింద చంద్రబాబు ప్రభుత్వం రూ. 3411.2 కోట్లు మాత్రమే ఇవ్వగా, గడిచిన ఐదేళ్ల వైయస్ జగన్ పాలనలో 54.55 లక్షల మంది రైతులకు రూ. 7802 కోట్ల మేర బీమా పరిహారం నేరుగా వారి ఖాతాల్లోనే జమ చేశామని వివరించారు.
ధాన్యం కొనుగోళ్లలో దళారులదే రాజ్యం
ఏటా రైతుకు రైతు భరోసా పథకం ద్వారా పెట్టుబడి కోసం రూ. 13,500 అందించడమే కాకుండా ఏ సీజన్‌లో పంట నష్టం జరిగిందో మరుసటి సీజన్‌లోనే బాధిత రైతులకు పంటల బీమా పరిహారం అందేదని మాజీ మంత్రి కారుమూరి చెప్పారు. కానీ గతంలో 2014-19 మధ్య చంద్రబాబు ప్రభుత్వంలో పరిహారం కోసం బీమా కంపెనీల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సి వచ్చేదని, ఇప్పుడు మళ్లీ అవే పరిస్థితులు కల్పించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దివంగత వైఎస్సార్, వైఎస్ జగన్ పాలనలో వ్యవసాయాన్ని పండగ చేస్తే, చంద్రబాబు మాత్రం వ్యవసాయం దేనికి దండగ అనేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఆర్బీకే సెంటర్ల ద్వారా విత్తనం నుంచి విక్రయం వరకు రైతుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం అండగా నిలిస్తే, కూటమి ప్రభుత్వం ఆర్బీకే సెంటర్లను పూర్తిగా నిర్వీర్యం చేసేసిందని, పంటల కొనుగోళ్లలోనూ దళారులదే రాజ్యంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. తాను పౌరసరఫరాల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు పాడైపోయిన బియ్యాన్ని కూడా మద్దతు ధరకు కొనిపిస్తే, నేడు రంగు మారింది, ముక్కలైందని కారణం చూపించి బస్తాకు రూ. 200 నుంచి 300 వరకు తగ్గించి రైతుల కష్టాన్ని దోచుకుంటున్నారని చెప్పారు. కూటమి పాలనలో రైతు ఆవేదన అరణ్య రోదనే అయిందన్నారు. ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేయడంతోపాటు రైతులు పండించిన పంట దళారులపాలు కాకుండా పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని కారుమూరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
పోలవరం ఎత్తు తగ్గితే రైతులకు నష్టం
ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తారనే వార్తలపై కారుమూరి స్పందించారు. పోలవరం ఎత్తు ఒక్క అంగుళం తగ్గించినా ఊరుకునేది లేదని, చంద్రబాబు మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు. ఎత్తు తగ్గితే కాలువల్లో నీళ్లు లేక రైతుల పాలిట ఉరేనన్న మాజీ మంత్రి, డెల్టా రైతుల పక్షాన నిలబడి వైఎస్సార్సీపీ తరఫున పోరాటం చేస్తుందని తెలిపారు. వైఎస్సార్ కుటుంబ ఆస్తుల వివాదం గురించి మాట్లాడుతూ విజయమ్మ గారి లేఖకు వైఎస్సార్సీపీ తరఫున సమాధానం కూడా ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు. గోరుముద్ద ద్వారా అందిస్తున్న మధ్యాహ్న భోజనం సరిగా లేకపోవడంతో ప్రభుత్వ బడుల పిల్లలందరూ ఇంటి నుంచి క్యారేజీలు తీసుకెళ్తున్నారని, కనీసం బాత్రూమ్‌లు శుభ్రంగా ఉంచడం లేదని పిల్లలు తనకు చెప్పిన విషయాన్ని కారుమూరి మీడియాతో పంచుకున్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ స్పందించి గోరుముద్ద, పిల్లల మరుగుదొడ్ల విషయంలో శ్రద్ధ తీసుకుని సమస్యను పరిష్కరించాలని కోరారు.