ప్రభుత్వ అణచివేతపై కాపుల కన్నెర్ర

7 Feb, 2026 22:38 IST

గుంటూరు: వంగవీటి రంగా హత్య నుంచి అంబటి రాంబాబుపై దాడి వరకూ కాపు నేతల్ని టీడీపీ ప్రభుత్వాలు టార్గెట్ చేస్తూనే ఉన్నాయని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఆరోపించారు. లడ్డూ నెయ్యి  వ్యవహారంలో కొవ్వు ఆరోపణలు చేసి దొరికిపోయిన ప్రభుత్వ పెద్దలు.. ప్రశ్నించిన అంబటి రాంబాబు ఇంటిపై దాడులకు దిగారని తెలిపారు. అంబటి రాంబాబుపై, ఆయన కుటుంబ సభ్యులపై జరిగిన దాడిని రాష్ట్రంలోని కాపులంతా ఖండిస్తున్నారని అన్నారు. వచ్చేది వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వమేనని, వడ్డీతో కలిపి తిరిగి చెల్లించడం ఖాయమని గుడివాడ అమర్నాథ్, కరణం ధర్మశ్రీ తెలిపారు.  

కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ.. 

వైయ‌స్ఆర్‌సీపీలోని కాపు నేతలంతా అంబటి రాంబాబు కుటుంబానికి అండగా ఉండాలని నిర్ణయించాం. కూటమి ప్రభుత్వం చేస్తున్న ఆగడాలపై సమిష్టిగా పోరాటం చేయాలని నిర్ణయించాం. ప్రశ్నించడానికి వచ్చానని చెప్పిన పవన్ కళ్యాణ్ .. లడ్డూ కల్తీ అయిందని పేర్లు కూడా లేకుండా పోస్టర్లు వేసి భక్తుల మనోభావాలను దెబ్బతీశారు. సిట్ ఇచ్చిన రిపోర్ట్ పై కూటమి ప్రభుత్వానికి నమ్మకం లేదు. ఈ రిపోర్ట్ లో మీ అబద్ధాలు తేటతెల్లమయ్యాయి. అందుకే ప్రజల్లో మనుగడ ఉండదని భయపడే అంబటిపై  ఈ దాష్టికానికి ఒడిగట్టారు. అన్ని జిల్లాల్లో కాపుల్ని అణగదొక్కాలని టీడీపీ ఎప్పటి నుంచో కుట్రలు చేస్తోంది. గతంలో జరిగిన వంగవీటి రంగా హత్య నుంచి ఇప్పుడు అంబటి రాంబాబుపై చేసిన దొంగకేసులు పెట్టి జైల్లో వేసి తీరు వరకూ అందరూ చూస్తున్నారు. గుంటూరులో పెమ్మసాని, ధూళిపాళ్ల నరేంద్ర, లోకేష్ వంటి వారు కాపులపై సాగిస్తున్న అణచివేతపై కాపులు కన్నెర్ర చేస్తున్నారు. భవిష్యత్తులో మిమ్మల్ని ఎక్కడ పెట్టాలో, ఎక్కడ కొట్టాలో కాపులు నిర్ణయించుకుంటారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కాపుసోదరులంతా అంబటి రాంబాబుకు అండగా ఉండాలని నిర్ణయించారు.


గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. 

అంబటిపై, ఆయన ఇంటిపై జరిగిన దాడిని వైయ‌స్ఆర్‌సీపీ తరఫున ఖండిస్తున్నాం. వారి కుటుంబ సభ్యులకు సంఘీభావం తెలిపేందుకు ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నుంచి వైయ‌స్ఆర్‌సీపీ నేతలు, కాపు సామాజిక వర్గ పెద్దలు ఇక్కడికి వచ్చాం. అంబటిపై దాడి ఘటనలో రెచ్చగొట్టింది వారే, తిట్టిందీ వారే, ఇంటిమీదికి వచ్చింది వాళ్లే,  ఇల్లు తగులబెట్టాలని చూసిందీ వాళ్లే, పార్టీ కార్యాలయం ధ్వంసం చేసిందీ వాళ్లే, రాంబాబు గారిని హత్య  చేసేందుకు ప్రయత్నించిందీ వాళ్లే. చివరికి రాంబాబు గారు జైలు జీవితం అనుభవిస్తున్నారు. ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకే ఆయన జైలుకు వెళ్లారు. ఈ ప్రభుత్వం చేస్తున్న మోసాలు, కుట్రలు, కుతంత్రాల్ని గత 20 మాసాలుగా ప్రశ్నిస్తున్నందుకే అంబటిపై కక్ష గట్టారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని నిలబెట్టుకోలేని కూటమి ప్రభుత్వం నెయ్యి కల్తీ పేరుతో రాజకీయంగా కుట్ర చేసి లబ్ది పొందాలని చేసిన ప్రయత్నంలో భాగంగా ఈ దాడి జరిగింది. కర్మ రుచి చూపించినప్పుడు అందరి పాపాలూ బయటపడతాయి. 

రోజులన్నీ ఒకేలా ఉండవు

లడ్డూ నెయ్యిలో జంతుకొవ్వు,పందికొవ్వు, చేపనూనె కలిసిందని తప్పుడు ప్రచారం చేసి, దర్యాప్తు తర్వాత సిట్, ల్యాబ్ లు అవేవీ కలవలేదని రిపోర్టులు ఇచ్చాక వైయ‌స్ఆర్‌సీపీపై లేని పోని ప్రచారం చేసి రాష్ట్రవ్యాప్తంగా ఫ్లెక్సీలు పెట్టారు. 24 గంటల్లో వాటిని తీయకపోతే మేమే తొలగించాల్సి వస్తుందని రాంబాబు హెచ్చరించారు. తిరుమల శ్రీవారి సన్నిధికి వెళ్లి ఈ ప్రభుత్వానికి బుద్దిరావాలి, వారి పాపాలు తెలుసుకోవాలని కార్యక్రమాలు ఏర్పాటు చేస్తే హాజరై తిరిగి వస్తున్న అంబటి రాంబాబుపై దాడి చేసేందుకు టీడీపీ నాయకులు ఎదురుచూస్తే పోలీసులు అడ్డుకున్నారు. లాఠీలు పట్టుకునే అధికారం పోలీసులకు కాకుండా టీడీపీ నేతలకు ఈ రెడ్ బుక్ రాజ్యాంగమే ఇచ్చింది. అంబటిపై దాడి చేసి గాయపర్చాలని, హతమార్చాలని వచ్చి, మహిళలు సైతం దుర్భాషలాడుతూ ఆయన తల్లిపై నానా మాటలూ అంటుంటే ఎవరున్నా స్పందిస్తారు. ఆ మాట అన్నందుకు కేసు పెట్టాలంటే పెట్టాలి కానీ ఇంటిపైకి వచ్చి దాడి చేసి మహిళలు, కుటుంబ సభ్యులపై దాడి చేసి ఇంటికి నిప్పుపెట్టి హత్య చేయాలని చూశారు. ఆ రోజు గడిచిపోవచ్చు. కానీ రోజులన్నీ ఒకేలా ఉండవు. 

అప్పుడు వంగవీటి రంగా.. ఇప్పుడు అంబటి..

జగన్మోహన్ రెడ్డి గారు అంబటి రాంబాబు గారి నివాసానికి వచ్చినప్పుడు కుటుంబంతో పాటు పార్టీ శ్రేణులకు కూడా భరోసా ఇచ్చి ప్రభుత్వానికి హెచ్చరికలు చేసి వెళ్లారు. అయినా ఇవాళ కొత్తగా అంబటి రాంబాబుపై 17వ కేసు పెట్టారు. మీరు అమ్మల్ని, భార్యల్ని తిడుతుంటే నోర్మూసుకుని కూర్చోవాలా ?, పొరబాటు జరిగిందని చెప్పినా వాటి కుటుంబంపై దాడులు చేస్తారా ?, ఇది రాష్ట్ర ప్రేరేపిత ఉగ్రవాదం. కిరాయి మూకలు ఇళ్లపై దాడులు చేస్తుంటే, ప్రభుత్వం దాన్ని వెనుక నుంచి మద్దతిస్తుంటే మేం ఊరుకే కూర్చోవాలా ?, ఎంత మంది వచ్చి చంపాలని చూసినా అంబటి రాంబాబు ఎక్కడా తలవంచలేదు. అందుకే అంబటి ఓ టైగర్ ని జగన్మోహన్ రెడ్డి చెప్పారు. టీడీపీని కాపులు ప్రశ్నించకూడదు, ఉంటే తమ చెప్పు కింద ఉండాలని అనుకుంటారు. వంగవీటి రంగాను చంపినప్పుడే ఇదే మొదలైంది, 2016లో ముద్రగడ పద్మనాభాన్ని హతమార్చాలని చూసినప్పటి నుంచీ, ఈ జనవరిలో అంబటి రాంబాబును హతమార్చాలని చూసినప్పటి నుంచి ఇదే జరుగుతోంది. వంగవీటి రంగాను చంపిన నెత్తుటి మరకలు ఇంకా అలాగే ఉన్నాయి,  మీపైన కాపులకు కోపం ఉంది, మీ పాపాన్ని ఈ సామాజిక వర్గం ఎప్పటికీ మర్చిపోదు.  ఈసారి వచ్చేది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే. మీరు చేసిన పాపాలకు వడ్డీతో సహా తిరిగి చెల్లించడం ఖాయం.

అంబటి కుమార్తె మౌనిక మాట్లాడుతూ.. 

కేంద్రమంత్రి పెమ్మసాని ఆదేశాలతో, గళ్లా మాధవి పర్యవేక్షణలో, పోలీసుల సాయంతోనే అంబటి రాంబాబు గారి మీద హత్యాయత్నం జరిగింది. దీన్ని పార్టీలకతీతంగా అందరూ ఖండిస్తుంటే గళ్లా మాధవి ప్రెస్ మీట్ పెట్టి మళ్లీ బెదిరింపులకు దిగారు. మేము మళ్లీ వస్తాం, మీ ఇంటికి పరామర్శకు వచ్చే వాళ్లు ఆస్తులు అమ్ముకోవాలని హెచ్చరిస్తున్నారు. ఓవైపు సారీ అడగడానికి వచ్చామని, మరోవైపు దాడి చేస్తామని హెచ్చరికలు చేయడం దేనికి సంకేతం. గళ్లా మాధవి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు, మీకు ఇంత అహంకారం పనికి రాదు, మీరు అంత పవర్ ఫుల్ అనుకుంటున్నారా, వ్యవస్థలకు లోబడి పనిచేయాలన్న  ఇంగితం లేదా అని ప్రశ్నిస్తున్నాం. విదేశాల్లో చదువుకుని వచ్చి ఇక్కడి బురద రాజకీయాలను ప్రక్షాళన చేస్తారని అనుకుంటే, వాటిని ఇంకా భ్రష్ణు పట్టించేలా ఆయన విధానాలు ఉన్నాయి. మా ఆఫీసుకు నిప్పు పెడితే పక్కనే ఉన్న ఇళ్లు అంటుకుంటాయన్న ఇంగితం కూడా మీకు లేదా ?, కక్షతో మీ కళ్లు మూసుకుపోయాయా ?, మీ పిల్లలకు ఏం మెసేజ్ ఇస్తున్నారని అంబటి రాంబాబును అడుగుతున్న గళ్లా మాధవి.. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోమని, వ్యవస్థల్ని కంట్రోల్ చేయమని, అవతలి వాళ్లు తప్పుచేస్తే మీరు అంతకన్నా పెద్ద తప్పు చేయమని మీ పిల్లలకు మెసేజ్ ఇస్తున్నారా, ఇళ్లపైకి కర్రలు రాళ్లతో వచ్చి దాడులు చేయమని ఏ చట్టం చెప్పిందని అడుగుతున్నాం. రెడ్ బుక్ ను లెక్కచేయనని చెప్పిన అంబటి రాంబాబు.. తనతో ఓ తప్పు జరిగితే వచ్చి సారీ చెప్పారు. ఈ వ్యత్యాసం అందరూ గమనించాలి. అంబటి రాంబాబు ఇంటిని రెండు వేల మంది చుట్టుముట్టినా లోపల కూర్చుని రాళ్లు రువ్వుతున్నా, కత్తులు దూస్తున్నా, గునపాలు గోడల్లో దిగుతున్నా ధైర్యంగా ఉన్నారు. వ్యవస్థపై ఉన్న  నమ్మకమే ఆయనకు ఈ ధైర్యం ఇచ్చింది. ఆ వ్యవస్థల్ని నిర్వీర్యం చేసి ఇళ్లపైకి వచ్చి ఆడవాళ్లపైన దాడి చేస్తారా? పవన్ కళ్యాణ్ తల్లిని తిట్టిన వాళ్లు ఆయన్ను వాటేసుకోవచ్చు కానీ.. డిప్యూటీ సీఎంగా లా అండ్ ఆర్డర్ ను కాపాడమని ఆయన్ను మేం అడగకూడదా ?