వ్యవసాయ రంగంలో ఏపీ అగ్రస్థానం

11 Mar, 2022 12:50 IST

అమరావతి: దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం వ్యవసాయం అగ్రస్థానంలో ఉందని  కేంద్ర ప్రభుత్వం రెండేళ్లకు ఒకసారి ప్రకటించే గుడ్‌ గవర్నెన్స్‌ సూచి వెల్లడించినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. అలాగే  వ్యవసాయ రంగంలో ఏపీ ముందజలో ఉందని స్కోచ్‌ గవర్నెన్స్‌ అవార్డు ఇచ్చిందని పేర్కొన్నారు. వ్యవసాయం వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా నమ్మి పని చేస్తున్న సీఎం వైయస్‌ జగన్‌ కలలు వాస్తవ రూపం దాల్చుతున్నాయన్నారు. వైయస్‌ జగన్‌ నాయకత్వంలో ఈ దేశంలోనే వ్యవసాయ రంగం ఎన్నో విజయగాధలను నమోదు చేస్తోందని ఉద్ఘాటించారు. 2022–2023 వార్షిక వ్యవసాయ బడ్జెట్‌ను శుక్రవారం కురసాల కన్నబాబు శాసన సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కన్నబాబు ఏమన్నారంటే..ఆయన మాటల్లోనే..

2022–2023వ సంవత్సరం వ్యవసాయ బడ్జెట్‌ను సభలో ప్రవేశపెడుతున్నా. ప్రజల కడుపు నింపడానికి నిరంతరం కష్టపడుతున్న రైతులకు ఈ సభ తరుఫున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు.  పాలకుడు ప్రజారంజకుడైతే ప్రకృతి హర్షిస్తుంది..కరుణిస్తుంది.. వర్షిస్తుంది. ఏపీలో పాలన జగన్మోహనమైంది. అందుకే రైతన్న హర్షించేలా వర్షాలు కురుస్తున్నాయి. పంటలు కళకళలాడుతున్నాయి. 

దేశంలో వ్యవసాయ రంగంలో మన రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని కేంద్ర ప్రభుత్వం రెండేళ్లకు ఒకసారి ప్రకటించే గుడ్‌ గవర్నెన్స్‌ సూచి ఈ విషయాన్ని వెల్లడించింది. ఇది కాకుండా ఏపీ వ్యవసాయ రంగంలో ముందజలో ఉందని స్కోచ్‌ గవర్నెన్స్‌ అవార్డు ఇచ్చింది. 

కోవిడ్‌ కష్టకాలంలోనే కాదు..ఆరుగాలం రైతుల వెన్నంటి ఉండి సాయం అందించడం వల్లే ఇది సాధ్యమైంది. విత్తనం నుంచి పంట విక్రయం వరకు అన్నదాతకు అండగా నిలవాలన్న సీఎం వైయస్‌ జగన్‌ సంకల్పం సత్ఫలితాలు ఇస్తుంది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మొక్కుబడిగా కాకుండా మొక్కవోని దీక్షతో పని చేయడం వల్లే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయి.

కరోనా సమయంలో ఎన్ని కష్టాలు వచ్చినా రైతులకు చేస్తామన్న సాయాన్ని, అమలు చేస్తామన్న పథకాలను ఆపలేదు. ఆలస్యం చేయలేదు. రైతుకు సాయం చేసే విషయంలో రెండో ఆలోచన లేదని, మాటల ముఖ్యమంత్రి కాదు చేతల సీఎం అని నిరూపించుకున్న సీఎం వైయస్‌ జగన్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నా..
రైతులు మన నుంచి కోరుకునేది గౌరవం, ఉత్తమ  సేవలే కానీ, జాలి కాదని మన సీఎం వైయస్‌ జగన్‌ చెబుతుంటారు. రైతు గౌరవాన్ని పెంచే విధంగా వివిధ పథకాలు, కార్యక్రమాలతో వారికి వెన్నుదన్నుగా నిలుస్తున్నాం. వ్యవసాయ రంగంలో జాతీయ అభివృద్ధి రేటు కన్నా మన రాష్ట్ర వృద్ధి రేటు అధికమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. 

2020–2021లో జాతీయ స్థాయిలో 7.5 శాతం నమోదు కాగా, రాష్ట్రం 10.39 శాతం వృద్ధి రేటును సాధించింది. 2021–2022లో జాతీయ స్థాయిలో వృద్ధి రేటు 9.8 శాతం నమోదు కాగా, రాష్ట్ర వృద్ధిరేటు 14.5 శాతం సాధించింది.  

మన ప్రభుత్వం వచ్చిన ఈ 33 నెలల కాలంలో రైతు పక్షపాతి సీఎం వైయస్‌ జగన్‌ పాలనలో చిరునవ్వుతో  వ్యవసాయ, ఇతర అనుబంధ రంగాల కోసం సుమారు రూ.1.10 లక్షల కోట్లు ఖర్చు చేశాం. రైతు భరోసా, పీఎం కిసాన్‌ నిధి కోసం రూ.20,117.08 కోట్లు ఖర్చు చేసినట్లు మంత్రి కన్నబాబు సభలో వివరించారు. వ్యవసాయ రంగానికి వైయస్‌ జగన్‌ ప్రభుత్వం కేటాయించిన నిధుల వివరాలను మంత్రి సభలో వెల్లడించారు. 

వ్య‌వ‌సాయ బ‌డ్జెట్ వివరాలు ఇలా..

నీటి పారుదల రంగానికి రూ.11,450.94 కోట్లు
వైయస్‌ఆర్‌ రైతు భరోసా–పీఎం కిసాన్‌ పథకం కోసం రూ.3,900 కోట్లు
వ్యవసాయం విద్యుత్‌ సబ్సిడీ కోసం రూ.5000 కోట్లు
ప్రకృతి విపత్తుల సహాయ నిధి రూ.2000 కోట్లు
వైయస్‌ఆర్‌ ఉచిత పంటల బీమా పథకం కోసం రూ.1,802 కోట్లు
పశు సంవర్థక శాఖకు రూ.1,027.82 కోట్లు
వైయస్‌ఆర్‌ సున్నావడ్డీ పంట రుణాల కోసం రూ.500 కోట్లు
మత్స్యశాఖ అభివృద్ధి కోసం రూ.337.23 కోట్లు
వెంకటేశ్వర పశు వైద్య విశ్వ విద్యాలయానికి రూ.122.50 కోట్లు
మార్కెట్‌ యార్డుల్లో నాడు–నేడు, మార్కెటింగ్‌ శాఖ అభివృద్ధికి రూ.614.23 కోట్లు
సహకార శాఖలకు రూ.248.45 కోట్లు
ఆహార శుద్ధి విభాగానికి రూ.146.41 కోట్లు
ఉద్యాన శాఖకు రూ.554 కోట్లు
ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ వర్సిటీకి రూ.421.15 కోట్లు
వైయస్‌ఆర్‌ ఉద్యాన విశ్వ విద్యాలయానికి రూ.59.91 కోట్లు
వైయస్‌ఆర్‌ జలకళ కోసం రూ.50 కోట్లు
వ్యవసాయంలో ఆధునిక సాంకేతికత కోసం రూ.200 కోట్లు
రైతుల ఎక్స్‌గ్రేషియా కోసం రూ.20 కోట్లు
రైతు భరోసా కేంద్రాల బలోపేతానికి రూ.18 కోట్లు
సమగ్ర వ్యవసాయ పరీక్షా కేంద్రాలకు రూ.50 కోట్లు
విత్తన రాయితీ కోసం రూ.200 కోట్లు
పట్టు పరిశ్రమకు రూ.98.99 కోట్లు
26 జిల్లాల్లో వైయస్‌ఆర్‌ రైతు భవన్‌ నిర్మాణాలకు రూ.52 కోట్లు