వరద ప్రభావిత ప్రాంతాల్లో కాకాణి పర్యటన
నెల్లూరు జిల్లా : దిత్వా తుఫాను ప్రభావంతో నెల్లూరు జిల్లాలో మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సర్వేపల్లి నియోజకవర్గంలో ఏర్పడిన వరద పరిస్థితులను పరిశీలించేందుకు మాజీ మంత్రి, ఉమ్మడి నెల్లూరు జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డా. కాకాణి గోవర్ధన్ రెడ్డి విస్తృతంగా పర్యటించారు. వర్షాల వల్ల జలమయమైన పలు గ్రామాలు, కాలనీలు, రహదారులు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా చూసి తెలుసుకున్నారు. వరద నీటితో మునిగిపోయిన విజయవాడ–చెన్నై జాతీయ రహదారి పరిస్థితిని పరిశీలించారు.
లోతట్టు కాలనీల్లో పర్యటించి ప్రజలను కాకాణి పరామర్శించారు. ఇళ్లలోకి నీళ్లు చేరిపోవడంతో వంట చేసుకోలేక ఇబ్బంది పడుతున్న కుటుంబాలకు కాకాణి భోజన సదుపాయాలను అందించారు. మాజీ జెడ్పిటిసీ సభ్యులు మందల వెంకటశేషయ్య ఆధ్వర్యంలో వెంకటాచలం, ఇందిరమ్మ కాలనీ, జగనన్న కాలనీల్లో ఏర్పాటు చేసిన భోజన కేంద్రాలను పరిశీలించారు. అవసరమైన ప్రతి చోటా భోజనం సిద్ధంగా ఉంచారు. ఎవరూ ఆకలితో ఉండకూడదు. తెల్లవారుజామున 5 గంటల నుండి వైయస్ఆర్‌సీపీ శ్రేణులతో కలిసి పర్యటిస్తున్నప్పటికీ, ప్రభుత్వ అధికారులు ఎక్కడా కనబడకపోవడం ప్రజల్లో అసంతృప్తి కలిగించింది. మధ్యాహ్నం 11 గంటలకు పరిశీలనకు వచ్చిన కొంతమంది మండలాధికారులు ప్రజల సమస్యలను పట్టించుకోకుండా త్వరగా వెళ్లిపోవడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాకాణి మాట్లాడుతూ..“అధికారంలో ఉన్నా లేకున్నా ఎప్పుడూ మా వెంటే నిలిచాం.
మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో లోతట్టు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ముందస్తు హెచ్చరికలు ఉన్నా, అధికారులు, కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ప్రజలు భారీస్థాయిలో ఇబ్బందులు పడుతున్నారు.ఇళ్ల చుట్టూ నీరు చేరడంతో వ్యాధులు వ్యాప్తి చెందే ప్రమాదం, విషసర్పాలు ఇళ్లలోకి రావడం వల్ల ప్రజలు భయాందోళనలో ఉన్నారు.నెల్లూరు జిల్లాకు మంత్రులు ఉన్నారో, లేరో కూడా తెలియని పరిస్థితి. జిల్లా అనాధలా మారింది. వైయస్ జగన్‌మోహన్ రెడ్డి పాలనలో ప్రతి వర్షానికీ ముందస్తు చర్యలు తీసుకొని ప్రజలకు భరోసా ఇచ్చారు. సర్వేపల్లి ప్రజల ఓట్లతో గెలిచిన సోమిరెడ్డి ప్రజల సమస్యలు కాకుండా తన అవినీతి గురించి మాత్రమే ఆలోచించాలి. వైయస్ జగన్ పై విమర్శలు, ఫోటోలకు పోజులు తప్ప ప్రజల సమస్యలు పరిష్కరించే బాధ్యత సోమిరెడ్డికి లేదు. వైయస్ఆర్‌సీపీ ప్రజా ప్రతినిధులపై కక్ష తీర్చుకోవడం వల్ల గ్రామాల్లో సమస్యలను చూసే నాధుడు కూడా లేడు. వైయస్ జగన్ ప్రభుత్వం నిర్మించిన జగనన్న కాలనీల్లో ఇప్పుడు కూటమి ప్రభుత్వం గృహప్రవేశాలు చేసుకుంటూ ప్రచారం చేసుకోవడాన్ని ప్రజలు హాస్యాస్పదంగా చూస్తున్నారు.
“చంద్రబాబు ప్రభుత్వం ప్రచార ఆర్భాటం తప్ప, ప్రజల సమస్యల పరిష్కారం మాత్రం శూన్యం. వైయస్ఆర్‌సీపీ శ్రేణులు అవసరమైన చోట భోజనం, వసతి, సహాయాన్ని అందిస్తున్నాయి. మా ప్రభుత్వంలో గ్రామాల్లో నిర్మించిన సిమెంట్ రోడ్లు, సైడు కాలువల వల్ల భారీ వర్షాల్లో కూడా చుక్క నీరు నిలబడడం లేదు. సర్వేపల్లి ప్రజలు నా కుటుంబ సభ్యుల్లాంటి వారు. గెలుపోటములతో సంబంధం లేకుండా, అధికారంలో ఉన్నా లేకున్నా, వారి కష్టాల్లో నిలబడడం నా ధర్మం” అని కాకాణి స్పష్టం చేశారు.