చంద్రబాబును పక్కరాష్ట్రానికే పరిమితం చేద్దాం
నెల్లూరు: కోవిడ్–19 సాకు చూపి ఏ సంక్షేమ పథకాన్ని ఆపలేదని, అన్ని పనులు చెప్పిన సమయానికి చేసి ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి గ్రేట్ లీడర్ అనిపించుకుంటున్నారని ఇరిగేషన్ శాఖ మంత్రి డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. మేనిఫెస్టోలో 90 శాతం హామీలు 18 నెలల పాలనలోనే అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిదన్నారు. నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనలకు హాజరైన అనంతరం బహిరంగ సభలో మంత్రి అనిల్ కుమార్‌యాదవ్ మాట్లాడుతూ.. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అన్ని పనులు జరిగిపోతున్నాయని, ప్రజల ఇంటి ముందే పాలన సాగుతోందన్నారు.
తిరుపతి ఉప ఎన్నిక ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పనితీరుకు.. గత ప్రభుత్వ అరాచకాలకు మధ్య జరుగుతున్న ఎన్నికగా చెప్పవచ్చన్నారు. తిరుపతి ఎంపీ ఉప ఎన్నికలో 3 లక్షల మెజారిటీతో గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నాయకుడిగా తనకి ఇక్కడ పనిలేకనే.. బాబు పక్క రాష్ట్రంలో ఉండి పోయాడని, తిరుపతి ఎన్నికల్లో గట్టి బుద్ధిచెప్పి చంద్రబాబును ఆ రాష్ట్రానికే పరిమితం చేద్దామన్నారు. లోకేష్ ట్రాక్టర్‌ని ఉప్పుటేరులో పడేసినట్టే.. టీడీపీని కూడా సముద్రంలో ముంచడం ఖాయమన్నారు.