మూలపేటలో పోర్టు నిర్మాణం చరిత్రాత్మక ఘట్టం
శ్రీకాకుళం: 75 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో ఉత్తరాంధ్ర ప్రాంతంలో అత్యంత వెనుకబడిన శ్రీకాకుళం జిల్లాలో చరిత్రాత్మకమైన ఘట్టానికి సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డి నాంది పలికారని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. రూ.4,362 కోట్లతో చరిత్రలో గుర్తుండిపోయే విధంగా మూలపేట గ్రీన్ఫీల్డ్ పోర్టుకు సీఎం వైయస్ జగన్ శంకుస్థాపన చేశారన్నారు. దాదాపు 30 నెలల్లో పూర్తిచేయబోతున్న ఈ పోర్టు ద్వారా ఈ ప్రాంతంలో దాదాపు 50 వేల నుంచి 75 వేల మంది స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయన్నారు.
మూలపేట పోర్టు నిర్మాణం, బుడగట్లపాలెంలో ఫిషింగ్ హార్బర్, వంశధార లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు సీఎం చేతుల మీదుగా శంకుస్థాపన అనంతరం నౌపడ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి గుడివాడ అమర్నాథ్ పాల్గొని మాట్లాడారు. రాష్ట్రానికి సహజసిద్ధంగా ఉన్న సముద్రతీరాన్ని ఏ విధంగా వినియోగించుకోవాలి, తద్వారా వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని ఏ రకంగా అభివృద్ధి చేయాలి, ప్రాంత ప్రజలకు ఏ విధంగా ఉపాధి కల్పించాలనే ఆలోచన ముఖ్యమంత్రి వైయస్ జగన్ మాత్రమే చేశారన్నారు. 2019లో ఆంధ్రప్రదేశ్ మ్యారిటైమ్ బోర్డును స్థాపించి ఆ బోర్డు ద్వారా దాదాపు 16 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి రామాయపట్నం పోర్టు, బందరు పోర్టు, మూలపేట పోర్టు, మరో 9 ఫిషింగ్ హార్బర్లు నిర్మిస్తున్నారని చెప్పారు.
ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెంలో దాదాపు రూ.350 కోట్లతో ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి ముఖ్యమంత్రి వైయస్ జగన్ శంకుస్థాపన చేశారన్నారు. ఇది చరిత్రలో చరిత్రాత్మకమైన ఘట్టంగా తప్పకుండా గుర్తుండిపోతుందన్నారు. రానున్న కాలంలో ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజల కోసం ముఖ్యమంత్రి వైయస్ జగన్ సహకారంతో మరిన్ని మంచి కార్యక్రమాలు చేపడుతామని మంత్రి గుడివాడ అమర్ తెలిపారు.