కళ్యాణదుర్గంలో వైయస్ఆర్‌సీపీ నేతలపై అక్రమ కేసులు
అనంతపురం జిల్లా: కళ్యాణదుర్గంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై పోలీసులు అక్రమ కేసులు నమోదు చేశారు. కక్షసాధింపు చర్యల్లో భాగంగా వైయస్ఆర్‌సీపీ కళ్యాణదుర్గం సమన్వయకర్త, మాజీ ఎంపీ తలారి రంగయ్య సహా మొత్తం 32 మంది నేతలపై కేసులు నమోదు చేయడం వివాదాస్పదమైంది.
మార్చి 30న కళ్యాణదుర్గం పట్టణంలో వైయస్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ) స్వచ్ఛంద సంస్థకు ఎఫ్సీఆర్ఏ అనుమతులు లభించిన సందర్భంగా పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నాయి. ఈ ర్యాలీకి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు హాజరై విజయవంతం చేయడంతో రాజకీయ వేడి మరింత పెరిగింది. ఈ నేపథ్యంలోనే వైయస్ఆర్‌సీపీ నేతలపై పోలీసులు కేసులు నమోదు చేయడం వెనుక కక్షసాధింపు చర్యలున్నాయి. ముఖ్యంగా టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ఆదేశాలతోనే పోలీసులు ఈ కేసులు పెట్టారు. మాజీ ఎంపీ తలారి రంగయ్యతో పాటు పలువురు స్థానిక నాయకులను కేసుల్లో చేర్చడం పట్ల పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రజాస్వామ్య హక్కులైన ర్యాలీలు నిర్వహించినందుకే కేసులు నమోదు చేయడం అన్యాయమని వారు మండిపడుతున్నారు. కళ్యాణదుర్గం పోలీసుల వ్యవహార శైలిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.