ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ

18 May, 2026 14:04 IST

మార్కాపురం జిల్లా: రాష్ట్రంలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను నిరసిస్తూ యర్రగొండపాలెంలో వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. యర్రగొండపాలెం ఎమ్మెల్యే, వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా భారీ ర్యాలీగా తరలివచ్చిన వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని పెరిగిన ఇంధన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా తాటిపర్తి చంద్రశేఖర్ మాట్లాడుతూ.. “పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో ప్రజలపై తీవ్ర భారం పడుతోంది. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలతో ఇబ్బందులు పడుతున్న సామాన్యులకు ఈ ధరల పెంపు మరింత కష్టాలను తెచ్చిపెడుతోంది” అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పెరిగిన ఇంధన ధరలను తగ్గించాలని డిమాండ్ చేసిన ఆయన.. ప్రజల సమస్యలపై వైయ‌స్ఆర్‌సీపీ ఎల్లప్పుడూ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.