దిశా చట్టానికి నాలుగు జాతీయ స్థాయి అవార్డులు
అమరావతి: ఆంధ్ర్రప్రదేశ్‌లో రూపొందించిన దిశా చట్టానికి జాతీయ స్థాయిలో నాలుగు అవార్డులు వచ్చాయని హోం మంత్రి మేకతోటి సుచరిత పేర్కొన్నారు. దిశా చట్టంపై గురువారం శాసన సభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి సుచరిత మాట్లాడుతూ..దిశా బిల్లు మహిళలు, చిన్నారులపై జరిగే ప్రత్యేక నేరాల పట్ల, 2019, 13.12న ఏపీ అసెంబ్లీ ఆమోదించింది. అలాగే 16.12.2019న మండలిలో కూడా ఆమోదం పొందింది. గవర్నర్ నుంచి 2.01.2020న రాష్ట్రపతికి పంపించారు.ఇందులో కొన్ని మార్పులు చేస్తూ గత బిల్లును రద్దు చేసి సవరణలతో కొత్త బిల్లు ప్రవేశపెడుతున్నాం. మహిళలు, చిన్నారులపై జరుగుతున్న దాడులపై ఈ దిశా చట్టం తీసుకువచ్చాం. ఇందులో దర్యాప్తు 7 రోజుల్లో పూర్తి చేయాలి. విచారణ 14 రోజుల్లో జరిపించాలి. 21 రోజుల్లో శిక్షలు ఖరారు చేయాలని ఈ చట్టంలో పొందుపరిచాం. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 18 దిశా పోలీసు స్టేషన్లు ఏర్పాటు చేశాం. విచారణ వేగంగా జరిగేందుకు డీఎస్‌పీ స్థాయి అధికారిని ఏర్పాటు చేశాం. దిశా యాప్‌ను కూడా 8 ఫిబ్రవరి 2020న ఆవిష్కరించాం. ఇప్పటి వరకు రాష్ట్రంలో 12 లక్షల మంది యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు. గత 8 నెలల్లో 98380 మంది ఎస్ఎంఎస్ ద్వారా రిక్వేస్టులు పెట్టుకున్నారు. ఈ దిశా యాప్ ద్వారా వచ్చిన కేసుల్లో 390 కేసులకు ఏడు రోజుల్లోనే చార్జ్‌షిట్ ఫైల్ చేశాం. అలాగే త్వరితగతిన విచారణ పూర్తి చేసేందుకు ఫోరెన్సిక్ ల్యాబ్‌లను పెంపొందించుకునేందుకు తిరుపతి, విశాఖ, మంగళగిరిలో మూడు ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తున్నాం. ఇందుకు సంబంధించి ఉద్యోగుల నోటిఫికేషన్ కూడా ఇచ్చాం. త్వరిగతిన విచారణ చేసేందుకు 11 ప్రత్యేక న్యాయస్థానాలను ఏర్పాటు చేసే విధంగా అడుగులు వేస్తున్నాం. ప్రత్యేకంగా 713 స్టేషన్లలో ఉమెన్ హెల్ప్‌లైన్ డెస్క్‌లు కూడా ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి దిశా స్టేషన్‌లో ఒక ఎస్ఐ స్థాయి అధికారిని నియమించాం. కౌన్సిలింగ్ ఇచ్చేందుకు ఏర్పాటు చేశాం. దిశా చట్టానికి జాతీయ స్థాయిలో నాలుగు అవార్డులు కూడా వచ్చాయి. దిశా ఇన్వేస్టిగేషన్ వెహికిల్‌కు అవార్డు వచ్చింది. దిశా చట్టం చేసిన తరువాత కేసులను త్వరితగతిన విచారణ జరిపిస్తున్నాం. మూడు కేసుల్లో ఉరి శిక్ష కూడా ఖరారు అయ్యింది. ఒక కేసు ఏడేళ్లుగా నెల్లూరు జిల్లా, చిత్తూరు జిల్లాలో ఐదు నెలల్లోనే శిక్ష విధించారు. 29 మందికి జీవిత ఖైదు కూడా విధించారు. ఈ చట్టం సత్ఫలితాలు ఇస్తుందని తెలియజేస్తున్నాను. సవరణలను సభ అమోదించాలనిమంత్రి సుచరిత కోరారు.