సభ్యసమాజం తలదించుకునేలా పట్టాభి వ్యాఖ్యలు
గుంటూరు: కుట్ర ప్రకారం ముఖ్యమంత్రిని టీడీపీ నేతలు దూషిస్తున్నారని, టీడీపీ నేత పట్టాభి వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత ధ్వజమెత్తారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. వైయస్ జగన్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని.. వాటిని చూసి ఓర్వలేని చంద్రబాబు.. కుట్ర ప్రకారం ప్రభుత్వంపై విషప్రచారం చేయిస్తున్నారని, ముఖ్యమంత్రిపై దూషణలు చేయిస్తున్నారని మండిపడ్డారు. కోవిడ్ సమయంలో సీఎం వైయస్ జగన్ తీసుకున్న నిర్ణయాలకు ప్రశంసలు వచ్చాయని గుర్తుచేశారు. డ్రగ్స్ విషయంలో టీడీపీ ఆరోపణలు పూర్తిగా నిరాధారమని, అసత్యాలను వండివార్చి టీడీపీ నేతలు ప్రకటనలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. గంజాయి, డ్రగ్స్‌పై ప్రభుత్వం ఉక్కుపాదం మోపిందన్నారు. టీడీపీ నేత నక్కా ఆనందబాబు తప్పుడు ప్రకటనలపై నోటీసులిచ్చామని, పదేపదే బురద జల్లి రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు ప్రకటనలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విధానపరంగా ప్రశ్నించకుండా.. కుట్రలు చేస్తున్నారని, పట్టాభి వ్యాఖ్యలను సభ్య సమాజం హర్షించదన్నారు. చంద్రబాబు ఫిర్యాదుపై డీజీపీ స్పందించలేదనడం అవాస్తవమన్నారు.