వెలగపూడి ఘటన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం
గుంటూరు: వెలగపూడి ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. తుళ్లూరు మండలం వెలగపూడిలో ఆర్చ్ వ్యవహారంలో రెండు వర్గాల మధ్య తలెత్తిన వివాదంలో పలువురికి గాయాలు కాగా, మరియమ్మ అనే మహిళ మృతిచెందింది. విషయం తెలుసుకున్న హోంమంత్రి సుచరిత, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యేలు శ్రీదేవి, మేరుగ నాగార్జున వెలగపూడి చేరుకుని బాధితులను పరామర్శించారు.
ఈ సందర్భంగా హోంమంత్రి సుచరిత మీడియాతో మాట్లాడుతూ.. దళిత సోదరుల మధ్య ఏర్పడిన మనస్పర్దల కారణంగా జరిగిన ఘర్షణలో మహిళ మృతిచెందడం చాలా బాధాకరమన్నారు. గొడవకు కారణాలను పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయిస్తామని, బాధ్యులపై సీరియస్ యాక్షన్ తీసుకుంటామన్నారు. ఈ విషయం తెలుసుకున్న సీఎం వైయస్ జగన్ వెంటనే వారి కుటుంబాన్ని పరామర్శించమని ఆదేశించడంతో పాటు, తక్షణసాయంగా రూ.10 లక్షల సాయం ఇవ్వమని చెప్పారన్నారు. గాయపడిన వారిని కూడా పరామర్శించి సాయం అందిస్తామన్నారు. చనిపోయిన మహిళకు ముగ్గురు కుమారులు ఉన్నారని, వారి కుటుంబానికి ఉద్యోగం కావాలని కోరారు. బాధిత కుటుంబాన్ని సీఎం దగ్గరకు తీసుకెళ్తామన్నారు.
తుళ్లూరు ప్రాంతంలోని పోలీస్ అధికారులపై కూడా ప్రజలు ఫిర్యాదు చేస్తున్నారని, వారిపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు. తప్పు చేస్తే ఎవరినీ వదలకూడదని సీఎం వైయస్ జగన్ పలు సందర్భాల్లో చెప్పారని, పోలీస్ డిపార్టుమెంట్లో తప్పు చేసినా వారిని సస్పెండ్ చేసి వారిపై కేసు నమోదు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయన్నారు. గ్రామంలో సాధారణ పరిస్థితి వచ్చే వరకు పోలీస్ పికెటింగ్ ఉంటుందని, 144 సెక్షన్ అమల్లో ఉంటుందని చెప్పారు. మళ్లీ సాధారణ పరిస్థితులు వచ్చే వరకు గ్రామంలో ఒక పీస్ కమిటీని ఏర్పాటు చేస్తున్నామన్నారు. అందరూ ఐక్యభావంతో మెలగాలి. మనస్పర్దలు పెట్టుకొని గొడవలకు దిగకూడదని విజ్ఞప్తి చేశారు.