సవీంద్ర రెడ్డి అక్రమ అరెస్టుతో పోలీసులు అడ్డంగా దొరికిపోయారు
గుంటూరు: పోలీసులను అడ్డం పెట్టుకుని కూటమి పాలన చేస్తున్న అరాచకాలకు నిదర్శనంగా సవీంద్రరెడ్డి అక్రమ అరెస్టు కేసును చూడొచ్చని వైయస్ఆర్‌సీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్‌రెడ్డి అన్నారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ... సవీంద్ర రెడ్డి కేసులో కోర్టు ముందు బుకాయించబోయి సీసీటీవీ ఫుటేజ్, జియో లొకేషన్ ఆధారంగా పోలీసులు అడ్డంగా దొరికిపోయారని మనోహర్ రెడ్డి వివరించారు. సోషల్ మీడియా యాక్టివీస్ట్ సవీంద్ర రెడ్డి కేసు నుంచైనా పోలీసులు గుణపాఠం నేర్చుకుని తీరుమార్చుకోకపోతే భవిష్యత్తులో తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. పోలీసులతో ఇలాంటి దుర్మార్గాలను చేయించి వారిని బలిచేస్తున్న రాష్ట్ర హోంమంత్రి, డీజీపీ తక్షణమే రాజీనామా చేయాలని వైయస్ఆర్‌సీపీ లీగల్ సెల్ తరఫున మనోహర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే...
● పోలీసులు ఇకనైనా తీరు మార్చుకోవాలి
పోలీసులు సవీంద్రని కోర్టు ఎదుట హాజరుపరిచినప్పుడు వారు ఏవిధంగా తనని ఇబ్బందులకు గురిచేసిందీ సవీంద్రారెడ్డి న్యాయస్థానంకు వివరించారు. దీనిపై న్యాయస్థానం సీసీ టీవీ ఫుటేజీలు, జియో లొకేషన్ వివరాలను సమర్పించాలని పోలీసులను కోరింది. పోలీసుల వ్యవహారంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, సవీంద్రరెడ్డి అరెస్ట్ వ్యవహారాన్ని సీబీఐకి అప్పగిస్తూ సీబీఐ ఏపీ జాయింట్ డైరెక్టర్‌కి న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. కేసును అక్టోబర్ 13వ తేదీకి కేసును వాయిదా వేస్తూ ఆరోజు ప్రాథమిక విచారణ నివేదికను సమర్పించాలని ఆదేశించింది. సవీంద్రరెడ్డి కేసులో పోలీసులు అడ్డంగా దొరికిపోయారు. ఆయన్ను అరెస్టు చేసి కూడా చేయలేదని బుకాయించి కోర్టు ముందు బుక్కయ్యారు. సీసీటీవీ ఫుటేజ్, జియో లొకేషన్ ల ఆధారాలను చూసి కేసులో ఏదో జరిగిందని కోర్టు నిర్ధారణకు వచ్చింది. పోలీసుల పాత్రను నిర్ధారించేందుకు ఈ కేసును సీబీఐకి అప్పగించింది. కూటమి నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్న పోలీసులు ఇప్పటికైనా తమ విధానాలను మార్చుకోకపోతే భవిష్యత్తులో తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నాం.
● నేరం చేస్తే పోలీసులైనా తప్పించుకోలేరు
వైఫల్యాలను ప్రశ్నిస్తే ప్రభుత్వం తట్టుకోలేకపోతోంది. కూటమి నాయకుల ఆదేశాలతో హైకోర్టు, సుప్రీంకోర్టు నిబంధనలను ఉల్లంఘించి మరీ పోలీసులు వైయస్ఆర్‌సీపీ నాయకులు, వైయస్ఆర్‌సీపీ సానుభూతిపరులపై అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారు. నేరస్తులను పట్టుకుని చట్టం ముందు నిలబెట్టాల్సిన పోలీసులే నేరాలకు పాల్పడుతూ అడ్డంగా దొరికిపోయి కూడా న్యాయస్థానం ముందు బుకాయిస్తున్నారు. అలాంటి వారు ఎప్పటికైనా చట్టానికి దొరుకుతారని చెప్పడానికి ఈ సవీంద్ర రెడ్డి కేసే ఉదాహరణ. సవీంద్రరెడ్డి మాదిరిగానే మధ్యతరగతి కుటుంబానికి చెందిన మరో సోషల్ మీడియా యాక్టివిస్ట్ తారక్ ప్రతాప్‌రెడ్డిని కూడా పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు. ఎలాంటి అసభ్యకరమైన, అశ్లీలమైన పోస్టులు పెట్టకపోయినా యూరియా కొరతపై ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకుగాను అతడిని అరెస్ట్ చేసి టెర్రరిస్టులు, కాంట్రాక్టు కిల్లర్స్ మీద పెట్టే కేసులు నమోదు చేశారు.