హైబ్రిడ్ రాజకీయాలే చంద్రబాబు అసలు అజెండా

29 May, 2026 20:51 IST

తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌లో బయటకు బీజేపీతో పొత్తు కొనసాగిస్తూనే, లోపల కాంగ్రెస్‌తో హాట్‌లైన్ రాజకీయాలు నడపడం చంద్రబాబు అసలు అజెండా అని గుంటూరు జిల్లా వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. నిన్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి చేత ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరింపజేయడం టీడీపీ–కాంగ్రెస్ మధ్య ఉన్న అంతర్గత సంబంధాలకు నిదర్శనమని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారని చెప్పుకునే చంద్రబాబు.. ఇప్పుడు అదే కాంగ్రెస్ నాయకులతో రాజకీయ ప్రయోజనాల కోసం చేతులు కలుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. “బయట బీజేపీ, లోపల కాంగ్రెస్” అనే ద్వంద్వ వైఖరితో చంద్రబాబు హైబ్రిడ్ రాజకీయాలు చేస్తున్నారని తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. తీవ్రస్థాయిలో విమర్శించారు. మ‌హానాడులో చంద్ర‌బాబు కంటే లోకేష్‌నే ఎక్కువ‌గా పొగిడారని, అయితే ఆ పార్టీని మ‌రో మూడేళ్ల‌లో తుదముట్టించే దిశ‌గా లోకేష్ రాజ‌కీయాలు చేస్తున్నార‌ని అందుకు మెగా డీఎస్సీలో జ‌రిగిన అక్ర‌మాలే నిద‌ర్శ‌న‌మ‌న్నారు.
ప్రెస్‌మీట్‌లో అంబ‌టి రాంబాబు ఏమ‌న్నారంటే.. 

- బీజేపీతో పొత్తు..కాంగ్రెస్‌ తో హాట్‌లైన్ సంబంధాలు

తెలుగు రాష్ట్రాలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు చేస్తున్న రాజకీయాలు చూసి దేశ ప్రజలే నివ్వెరపోతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో చంద్ర‌బాబు బయటకు బీజేపీతో పొత్తు పెట్టుకుంటారు.. కానీ మనసులో మాత్రం కాంగ్రెస్‌తోనే ఉంటారు. మోసం ముసుగులో రాజకీయాలు చేయడం చంద్రబాబు నైజం. ప్రస్తుతం బహిరంగంగా భారతీయ జనతా పార్టీతో కలిసి ఉన్నట్టు కనిపించినా, తెరవెనుక కాంగ్రెస్‌తో హాట్‌లైన్ సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఇదంతా చంద్రబాబు గేమ్‌ప్లాన్‌. తన అవసరాల కోసం బీజేపీని వాడుకుంటున్నారు.

- టీడీపీ జెండాల‌తో రేవంత్‌రెడ్డికి స్వాగ‌త‌మా?

నిన్న హైద‌రాబాద్‌లో జరిగిన సంఘటన చాలా విచిత్రంగా అనిపించింది.  హైదరాబాద్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ఒక‌ప్ప‌టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్య‌మంత్రి స్వ‌ర్గీయ ఎన్టీ రామారావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారని చంద్రబాబు ప్రతి సందర్భంలో చెబుతుంటారు. మహానాడులో కూడా అదే విషయాన్ని గొప్పగా చెప్పారు. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి చేత అదే ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరింపజేసి, టీడీపీ జెండాలతో స్వాగతం పలకడం చూస్తుంటే.. టీడీపీ–కాంగ్రెస్ మధ్య ఉన్న అనుబంధం స్పష్టంగా కనిపిస్తోంది. చంద్రబాబు తెరవెనుక కాంగ్రెస్‌తో నిరంతరం హాట్‌లైన్‌లో మాట్లాడుతూనే ఉంటారు.   

- టీడీపీ, కాంగ్రెస్ పార్టీల‌కు సిగ్గు, ల‌జ్జ ఉన్నాయా?

ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు చంద్రబాబు బీ టీమ్‌గా పనిచేస్తుంటే.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి టీడీపీ బీ టీమ్‌గా మారింది. ఇవేం రాజకీయాలు? ఈ రెండు పార్టీలకు సిగ్గు, లజ్జ ఉన్నాయా? ఎన్టీఆర్ అంటే చంద్రబాబుకు తప్ప అందరికీ గౌరవమే ఉంది. కానీ ఆ మహానేత పేరును ఉపయోగించుకుంటూ అనైతిక రాజకీయాలు చేయడం మాత్రం చంద్రబాబు ప్రత్యేకత. అవసరం వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్‌తో హాట్‌లైన్ సంబంధాలు కొనసాగించడం ఆయనకు అలవాటైపోయింది.  చంద్రబాబు ఎప్పుడు ఏ పార్టీతో కలుస్తాడో, ఎవరికి వెన్నుపోటు పొడుస్తాడో, ఎవరిని వదిలేస్తాడో  చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం. కాంగ్రెస్‌, జనసేన, సీపీఎం, సీపీఐ, బీజేపీ సహా అన్ని పార్టీలతో కలిసి నడిచారు. ఆయన కలవనిది ఒక్క వైయ‌స్ఆర్‌సీపీతో మాత్రమే.

- హైబ్రిడ్ మ‌హానాడు కాదు..హైబ్రిడ్ రాజ‌కీయాలు

రెండు రోజులుగా టీడీపీ నిర్వ‌హించిన‌ మహానాడును ‘హైబ్రిడ్ మహానాడు’ అంటున్నారు. కానీ అసలు హైబ్రిడ్ రాజకీయాలు చేస్తున్నది చంద్రబాబే అని చెప్పడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణలు అవసరం లేదు. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి నిన్న మాట్లాడుతూ.. ఇందిరాగాంధీ, ఎన్టీఆర్ ఆశయాలతో కాంగ్రెస్ పార్టీ నడుస్తోందని వ్యాఖ్యానించారు. కానీ చంద్రబాబు ఆశయాలతో కాంగ్రెస్ నడుస్తోందని మాత్రం చెప్పలేదు. ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు.

- డబ్బులు, చీరలు ఇచ్చి తరలించాల్సిన దౌర్భాగ్యం ఏంటి?

టీడీపీ మహానాడు రెండు రోజుల పాటు అద్భుతంగా జరిగిందని ఈనాడు, ఆంధ్రజ్యోతిలో బ్యానర్ కథనాలు రాయించుకున్నారు. నిజంగా మహానాడు విజయవంతమైతే ప్రజలే మాట్లాడుకుంటారు. ఇలా ఫ్రంట్‌ పేజీల్లో ప్రచారం చేసుకోవాల్సిన అవసరం ఉండదు. కానీ ఇప్పుడు పరిస్థితి ఏమిటంటే.. మహానాడుకు పిలిపించుకొని చీర‌లు, డబ్బులు ఇస్తామని మోసం చేశారని మహిళలు శాపనార్థాలు పెడుతున్నారు. రెండేళ్ల పాలన తర్వాత మహానాడుకు మహిళలకు డబ్బులు, చీరలు ఇచ్చి తరలించాల్సిన దౌర్భాగ్య పరిస్థితి టీడీపీకి వచ్చిందంటే.. మీ పార్టీ గ్రాఫ్ ఎంతగా పడిపోయిందో మీరే ఆలోచించుకోవాలి. రెండేళ్ల పాలనలో సాధించిన అభివృద్ధి గురించి మహానాడులో చెబుతారని ప్రజలు భావించారు. కానీ ఇచ్చిన హామీల్లో చాలా వరకు అమలు చేయకపోవడంతో చెప్పుకునేందుకు ఏమీ లేకుండా పోయింది. ఆడబిడ్డ నిధి లేదు, నిరుద్యోగ భృతి లేదు. సూపర్ సిక్స్ హామీల్లో సగం కూడా అమలు కాలేదు. ప్రజలను మోసం చేసిన ప్రభుత్వంగా ఈ కూటమి ప్రభుత్వం నిలిచిపోతుంది.

- లోకేష్‌ను పొగ‌డ‌టం ఏంటో?
మహానాడుకు వచ్చిన వక్తలు చంద్రబాబును పక్కనపెట్టి నారా లోకేష్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. వీరుడు, సూరుడు అంటూ ఆకాశానికి ఎత్తేశారు. చంద్రబాబును పొగిడితే దానికో అర్థం ఉంటుంది. కానీ లోకేష్‌ను పొగడడం వెనుక మాత్రం ఆయన దృష్టిలో పడాలనే ఆత్రుత స్పష్టంగా కనిపించింది. టీడీపీ సీనియర్ నేతలు సైతం సిగ్గు లేకుండా లేనిపోని పొగడ్తలు కురిపించడం దౌర్భాగ్యకరం. మెగా డీఎస్సీ పేరుతో నిరుద్యోగులను లోకేష్ మోసం చేశారు. స్పోర్ట్స్ కోటాలో 410 మందికి ఉద్యోగాలు ఇచ్చామని చెబుతున్నారు. కానీ ఆ పోస్టులన్నీ డబ్బులకు అమ్ముకున్నారనే ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. నిరుద్యోగ భృతి ఇవ్వకపోతే ఇవ్వలేదు.. కనీసం ఉద్యోగాల విషయంలోనైనా న్యాయం చేయాల్సింది పోయి, మెగా డీఎస్సీ పేరుతో అవకతవకలు చేసి స్పోర్ట్స్ కోటా పోస్టులను లక్షల రూపాయలకు అమ్ముకోవడం చాలా దుర్మార్గమైన విషయం.

- మొద్ద‌బ్బాయి ముఖ్య‌మంత్రా?

నిన్న మహానాడులో ఒక నేత మాట్లాడుతూ.. ‘రామన్న రూపుదిద్దిన పార్టీ, చంద్రన్న తీర్చిదిద్దిన పార్టీ’ అని చెప్పారు. ఇప్పుడు లోకేష్ తుది మెరుగులు దిద్దుతున్నాడని పొగిడారు. కానీ అసలు నిజం ఏమిటంటే.. మరో మూడేళ్లలో టీడీపీని తుదముట్టించే దిశగా లోకేష్ పనిచేస్తున్నాడు. అది గమనించకుండా ‘మా పచ్చ సైన్యం’ అంటూ పిచ్చి నాయకుడిలా ఆయనను పొగడుతున్నారు. మొద్దబ్బాయి లోకేష్‌ను ముఖ్యమంత్రిని చేయాలని చంద్రబాబు ప్రయత్నిస్తుండటంపై టీడీపీ సీనియర్ నేతలకే తీవ్ర అసంతృప్తి ఉంది.

- అత్యంత అనైతిక రాజకీయవేత్త  చంద్రబాబే!

ప్రతి రోజు టీడీపీ నేతలు వైయ‌స్ఆర్‌సీపీని ఒక విధ్వంసకర రాజకీయ పార్టీగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ తండ్రి–కొడుకుల రాజకీయ చరిత్ర ఏంటో ప్రజలకు బాగా తెలుసు. ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు ‘రంగులు వేసుకునే వ్యక్తికి పార్టీ ఎందుకు?’ అని విమర్శించిన వాళ్లే ఆ తర్వాత టీడీపీలో చేరారు. మరి ఎన్టీఆర్ టీడీపీ స్థాపించినప్పుడు నారా చంద్రబాబు ఏ పార్టీలో ఉన్నారు? అప్పట్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, మంత్రిగా ఉన్నారు. ఇందిరాగాంధీ ఆదేశిస్తే ఎన్టీఆర్‌పై పోటీ చేసి ఓడిస్తానని ప్రగల్భాలు పలికారు. కానీ ఆ ఎన్నికల్లో చంద్రబాబు తుక్కుతుక్కుగా ఓడిపోయారు. ఆ వెంటనే కాంగ్రెస్‌కు వెన్నుపోటు పొడిచి, దొడ్డిదారిన ఎన్టీఆర్ పంచన చేరారు.
దగ్గుపాటి వెంకటేశ్వరరావు, హరికృష్ణ మొదటి నుంచి ఎన్టీఆర్ వెంట ఉన్నారు. కానీ వారినే చంద్రబాబు పక్కన పెట్టేశారు.  తర్వాత దగ్గుపాటి పురంధేశ్వరి కాంగ్రెస్ పార్టీలో చేరగా, ఆ త‌రువాత దగ్గుపాటి వెంకటేశ్వరరావు వైయ‌స్ఆర్‌సీపీలో చేరారు. ప్రపంచంలోనే అత్యంత అనైతిక రాజకీయవేత్త ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబే. తన సొంత తమ్ముడు రామ్మూర్తి నాయుడు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నా ఆయన్నే సస్పెండ్ చేసిన వ్యక్తి చంద్రబాబు.

- లోకేష్‌కు పోటీగా వ‌స్తాడ‌ని జూనియ‌ర్ ఎన్టీఆర్‌ను తొక్కేశారు

వైయ‌స్ రాజశేఖరరెడ్డికి వ్య‌తిరేకంగా ప్రచారం చేయించేందుకు జూనియర్ ఎన్టీఆర్‌ను రాష్ట్రమంతా తిప్పారు. ప్రచార సమయంలో ఆయన ప్రమాదానికి గురై గాయపడ్డారు. జూనియర్ ఎన్టీఆర్‌కు పెద్ద ఎన్టీఆర్ పోలికలు ఉండటంతో ఎక్కడ లోకేష్‌కు పోటీగా మారతారోనని ఆయన్ను కూడా రాజకీయంగా తొక్కేశారు. ఇంత మందికి వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు నైతికత గురించి మాట్లాడే హక్కు లేదు. అలాంటి వ్యక్తి మమ్మల్ని ‘గొడ్డలి పార్టీ’ అంటున్నారు. అధికారం కోసం ఏ గడ్డి అయినా కరిచే వ్యక్తులు చంద్రబాబును మించిన వారు ఈ దేశంలో ఉండరు.
మైక్ ఉందని, చెప్పిందే రాసే మీడియా ఉందని చంద్రబాబు మమ్మల్ని లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఉదయం నుంచి రెండు పత్రికలు, మూడు టీవీల్లో ‘గొడ్డలి పార్టీ’ అంటూ ప్రచారం చేస్తున్నారు. వైయస్ జగన్‌పై ప్రతిరోజూ బురద జల్లుతూ వైయ‌స్ఆర్‌సీపీని  ప్రజల్లో వ్యతిరేకత కలిగించేలా చేయాలని కుట్రలు చేస్తున్నా ప్రజలు నమ్మడం లేదు. చంద్రబాబు రాజకీయ జీవిత చరిత్ర మొత్తం రాష్ట్ర ప్రజలకు తెలుసు. ప్రధాని న‌రేంద్ర‌మోదీని, ఆయన కుటుంబాన్ని గతంలో ఏమన్నావో కూడా ప్రజలు మర్చిపోలేదు చంద్రబాబు. అలాంటి వ్యక్తి ఇవాళ సిగ్గు లేకుండా వంగి వంగి దండాలు పెడుతున్నారు. బలహీనంగా ఉంటే కాళ్లు పట్టుకోవడం, అవకాశం దొరికితే వెన్నుపోటు పొడవడం చంద్రబాబు రాజకీయ స్వభావం. అలాంటి వ్యక్తి మమ్మల్ని విమర్శించడం విడ్డూరం. ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. 

- జూన్ 4 నుంచి రాష్ట్ర‌వ్యాప్తంగా నిర‌స‌న‌లు 

కూటమి ప్రభుత్వ రెండేళ్ల వెన్నుపోటు రాజకీయాలకు వ్యతిరేకంగా జూన్‌ 4వ తేదీ నుంచి వైయ‌స్ఆర్‌సీపీ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టబోతోంది. ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టే కార్యక్రమాలను రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తాం. కానీ మేము నిరసనలు ప్రకటించగానే వాటిని డైవర్ట్ చేయడానికి సిట్ పేరుతో హడావిడి చేయడం, నోటీసులు ఇవ్వడం, విచారణల పేరుతో వేధించడం ఈ ప్రభుత్వానికి పరిపాటిగా మారింది. వైయస్ జగన్ గారి పొలిటికల్ అసిస్టెంట్ కే. నాగేశ్వర్‌రెడ్డి (కేఎన్‌ఆర్‌)కు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చి విచారణకు రావాలని పిలిచారు. లోపల అధికారులు ఒక కథ తయారు చేస్తే.. బయట ఈనాడు, ఆంధ్రజ్యోతి మరో కథ రాసి ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నాయి. మా పార్టీ నాయకుడు శివశంకర్‌కు కూడా నోటీసులు ఇచ్చారు. కథనాలు రాసి భయపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ సిట్, ఎల్లో మీడియా కథనాలకు వైయ‌స్ఆర్‌సీపీ భయపడే ప్రసక్తే లేదు.

- నాడు చంద్ర‌బాబు పీఏను స‌ప్త స‌ముద్రాలు దాటించారు

కేఎన్‌ఆర్‌పై అంతుంది, ఇంతుంది అంటూ కథనాలు రాస్తున్నారు. మరి చంద్రబాబుకు వేల కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయి? రామోజీరావు పచ్చళ్లు అమ్ముకునే స్థితి నుంచి ఇన్ని ఆస్తులు ఎలా సంపాదించారు? ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ సైకిల్ తొక్కేవాడని చెప్పుకునేవారు.. ఇవాళ ఆయనకు ఎన్ని ఆస్తులు ఉన్నాయి? మాపై పడే ఈ కక్షసాధింపు రాజకీయాలు మానుకోవాలి. చంద్రబాబు పీఏ శ్రీనివాస్‌పై రూ.2 వేల కోట్ల అవినీతి కేసు నమోదైతే ఆయన్ను సప్త సముద్రాలు దాటించారు. ఇప్పుడు మళ్లీ రాష్ట్రానికి తీసుకొచ్చారు. మరి మీ పీఏపై కేసు పెట్టారని కేఎన్‌ఆర్‌పై కక్షసాధింపు చర్యలు ఎందుకు? మేము ఎవరినీ పారిపోనివ్వలేదు. ఇక్కడే ఉంటాం.. కేసులను ధైర్యంగా ఎదుర్కొంటాం.

- మమ్మల్ని భయపెట్టలేరు

కూట‌మి పాల‌నకు రెండేళ్లు పూర్తయ్యాయి.. ఇంకా రెండేళ్లే మీ సమయం. మూడో ఏడాదికే ఎన్నికలు వస్తాయి. ఎన్డీఏ కూటమిలో ఉన్నామనే అహంకారంతో అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. కానీ చంద్రబాబును ఎన్డీఏ కూడా పూర్తిగా నమ్మడం లేదనే చర్చ ప్రజల్లో ఉంది. సిట్, ఎల్లో మీడియాతో దుర్మార్గ రాజకీయాలు చేసినా ఫలితం ఉండదు. మానసికంగా ఇబ్బంది పెట్టవచ్చు.. కానీ మమ్మల్ని భయపెట్టలేరు. చంద్రబాబుకు ఇదే చివరి అధికారం. ఆ ప్రభుత్వాన్ని భూస్థాపితం చేసేందుకు ఆయన కుమారుడు లోకేష్ మరింత వేగంగా ప్రయత్నిస్తున్నాడు. వైయ‌స్ఆర్‌సీపీని పాతాళంలోకి తొక్కే శక్తి చంద్రబాబుకు లేదు. రాబోయే రోజుల్లో వైయ‌స్ఆర్‌సీపీ మళ్లీ అధికారంలోకి వస్తుంది. దానిని ఎవరూ అడ్డుకోలేరు. మెగా డీఎస్సీ అక్రమాలపై ఈ ప్రభుత్వం ఎందుకు విచారణ జరపడం లేదు? స్పోర్ట్స్ కోటా పోస్టులను అమ్ముకుని క్యాష్ చేసుకున్నది లోకేష్ కాదా?

జనవరి 31న నా ఇంటిపై దాడి జరిగింది. ఇప్పటివరకు ఒక్కరినీ అరెస్టు చేయలేదు. నేను చంద్రబాబును విమర్శించానని జైలుకు పంపించారు. నాకు వైయస్ జగన్ అండగా ఉన్నారు. కాపు సామాజికవర్గం అండగా ఉంది. నా ఇంటిపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని ఇప్పటికే దీక్ష చేశాను. త్వరలోనే దాడి జరిగిన నా ఇంటి నుంచి డీజీపీ కార్యాలయం వరకు 29 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తాను. వారిపై చర్యలు తీసుకునే వరకు వివిధ రూపాల్లో నిరసనలు కొనసాగిస్తాను” అని అంబటి రాంబాబు పేర్కొన్నారు.