విశాఖ స్టీల్, భోగాపురం ఎయిర్ పోర్టు విషయంలో చంద్రబాబు పచ్చి అబద్దాలు
తాడేపల్లి: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఉన్నతాధికారుల సమావేశంలో సీఎం చంద్రబాబు పచ్చి అబద్దాలు చెబుతున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... 18 నెలల పాలనలో తాను చేసిందేమీ లేక ఇంకా వైయస్ఆర్‌సీపీని, వైయస్.జగన్ ని దూషిస్తూ బురద జల్లడం బాబుకి పరిపాటిగా మారిందని ఆక్షేపించారు. కనీసం భూసేకరణ, కోర్టు కేసులు కూడా పరిష్కరించలేని చంద్రబాబు ఎయిర్ నిర్మాణ ఘనత, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై బాబు క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నాడని మండిపడ్డారు. భోగాపురం ఎయిర్ పోర్ట్ పేరుతో 15 వేల ఎకరాలు భూదోపిడీకి ప్లాన్ చేసిన చంద్రబాబు... ప్రజా ఉద్యమంతో తోక ముడిచి 5వేల ఎకరాలకే పరిమితమైన విషయాన్ని గుర్చుచేశారు. అయితే వైయస్.జగన్ హయాంలో ఎయిర్ పోర్టు, ఏరోసిటీ నిర్మాణం కోసం కేవలం 2703 ఎకరాలు మాత్రమే సేకరించి... విమానాశ్రయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారని స్పష్టం చేశారు. ఇక పెట్టుబడులు విషయంలోనూ బాబు పచ్చి అబద్దాలు చెప్పడాన్ని ఆయన తీవ్రంగా ఆక్షేపించారు. 2014-19 మధ్య కేవలం రూ.50 వేల కోట్ల పెట్టుబడులతో... 84,333 వేల ఉద్యోగాలు కల్పిస్తే.. వైయస్.జగన్ హాయంలో రూ.69,799 కోట్ల పెట్టుబడులతో 90,230 ఉద్యోగాలు కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు. మరోవైపు అప్పులు విషయంలోనూ చంద్రబాబు ప్రభుత్వం సిగ్గు లేకుండా ప్రవర్తిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం ఏడాదిన్నరలో రూ.3.02 లక్షల కోట్లు అప్పు చేసిన కూటమి ప్రభుత్వం.. వైయస్.జగన్ ఐదేళ్లలో చేసిన అప్పులో 90 శాతం 18 నెలల్లోనే చేశారని తేల్చి చెప్పారు. ఇప్పుడు రాష్ట్రం శ్రీలంక కావడం లేదా అని కూటమి నేతలను, ఎల్లో మీడియాను సూటిగా ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఇంకా ఏమన్నారంటే...
● చంద్రబాబు- క్రెడిట్ చోరీ...
వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమావేశమైనప్పుడు సుదీర్ఘ ఉపన్యాలివ్వడం చంద్రబాబుకు అలవాడు. 18 నెలల్లో కూటమి ప్రభుత్వం చేసిన అంశాలు, ఉన్నతాధికారులకు ఇవ్వాల్సిన సందేశం కన్నా మాజీ ముఖ్యమంత్రి వైయస్.జగన్ ను దూషించడానికి, గత ప్రభుత్వంపై బురదజల్లే కార్యక్రమం చేస్తూ పచ్చి అబద్దాలను వల్లె వేశారు. ఈ సమావేశంలో ఉన్నతాధికారులకు ఒక దిశా నిర్దేశం చూపించే కార్యక్రమం ఏమీ కనిపించలేదు. భోగాపురం విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేస్తానని చెబుతూ... ఈ ఘనత అంతా నాదే అనేలా క్రెడిట్ చోరీకి ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఇదే భోగాపురం విమానాశ్రయం పేరుతో భూ దోపిడీ చేయడానికి ఏకంగా 15 వేల ఎకరాలు కావాలన్నాడు. దీంతో ప్రజలు తిరగబడి ఉద్యమాలు చేయడం మొదలుపెట్టేసరికి 5 వేలు ఎకరాలు చాలని మాట మార్చాడు. అదే సమయంలో వైయస్ఆర్‌సీపీ కూడా అంత భూమి అవసరం లేదని చెబుతూ ప్రజల పోరాటంలో గొంతు కలిపింది.
● ఎయిర్ పోర్టుకి అన్ని అనుమతులతో వైయస్.జగన్ శ్రీకారం..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అతి తక్కువ భూమిలోనే ఏరో సిటీ, ఎయిర్ పోర్ట్ రెండింటినీ కలిపి 2703 ఎకరాల్లో అద్భుతమైన అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించాలని తలపెట్టింది. కరోనా ఉన్నప్పటికీ 2023 మే 3వ తేదీన వైయస్.జగన్ భూమిపూజ చేశారు. అయితే చంద్రబాబు మాత్రం తానే ఎయిర్ పోర్ట్ కట్టానని చెబుతుంటే ఆయన పత్రికలు, టీవీలు అదే నిజమని ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు.
వాస్తవానికి ఎయిర్ పోర్టు నిర్మాణానికి అనేక అడ్డంకులను తొలగించాం. విమానాశ్రయ నిర్మాణానికి అడ్డంకిగా కోర్టుల్లో ఉన్న 130 కేసులను పరిష్కరించాం. 3 గ్రామాల్లో 400 కుటుంబాలను తరలించి రూ.960 కోట్ల భూసేకరణ జరిపించాం. విశాఖపట్నం నుంచి భోగాపురం విమానాశ్రయం వెళ్లడానికి 77 మీటర్లు వెడల్పుతో కనెక్టివిటీ రోడ్డు నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేశాం. అప్పటి కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి గడ్కరినీ కూడా ఒప్పించాం. ఇదే విషయాన్ని తన మీడియా సమావేశంలో వైయస్.జగన్ స్పష్టం చేశారు. అయినా కూడా భోగాపురం ఎయిర్ పోర్టుని తానే కట్టానని చంద్రబాబు చెబుతున్నాడు. ప్రజలు వాస్తవాలను అర్ధం చేసుకుంటున్నారు.
● స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు బాబు సహకారం..
విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడుతూ రూ.12వేల కోట్లతో ప్లాంట్ ను కాపాడుకున్నామని చెబుతున్నాడు. ఆ రూ.12 వేల కోట్లు స్టీల్ ప్లాంట్ ను ధారాదత్తం చేయడానికే వాడుతున్నారు తప్ప కాపాడ్డానికి కాదన్న విషయం ప్రజలు గమనించాలి. దాదాపు రెండు దఫాలుగా 1590 మంది రెగ్యులర్ ఉద్యోగులను వీఆర్ఎస్ ద్వారా ఇంటికి పంపించారు. ఈ రూ.12వేల కోట్లతో స్టీల్ ప్లాంట్ కున్న బాకీలు తీర్చివేసి.. దాన్ని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ విధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ను నెమ్మదిగా ప్రైవేటీకరణ చేస్తూ దశలవారీగా దీన్ని అమ్మాలని ప్రయత్నాన్ని కేంద్ర ప్రభుత్వం చేస్తుంటే.. దానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరిస్తోంది. కానీ రూ.12వేల కోట్లతో స్టీల్ ప్లాంట్ ను ఆదుకున్నామని చంద్రబాబు చెప్పడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.
● పెట్టుబడుల విషయంలోనూ పచ్చి అబద్దాలు..
ఇక పెట్టుబడుల విషయంలో పచ్చి అబద్దాలు చెబుతున్నారు. దేశంలో వచ్చిన మొత్తం పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే వచ్చాయని కోతలు కోస్తున్నారు. 2014-19 మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు హయాంలో రాష్ట్రంలో భారీ, అతిభారీ పరిశ్రమలుకు సంబంధించిన పెట్టుబడులు రూ.50,708 కోట్లు వచ్చాయి. దాని ద్వారా 84,333 ఉద్యోగాలు వచ్చాయి. 2019-2024 మధ్య వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో రెండేళ్లు కోవిడ్ వంటి విషమపరిస్థితి ఉన్నప్పటికీ... రూ. 69,799 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 90230 ఉద్యోగాలు కల్పించడం జరిగింది. ఎవరిది గొప్ప ప్రభుత్వం? ఈ రెండు విషయాలు సమాచారహక్కు చట్టం ద్వారా బయటపడ్డాయి. ఇంత గొప్పగా 2019-24 మద్య వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలన చేస్తే... చంద్రబాబుకు ఆయన అనుకూల మీడియా డబ్బాలు కొట్టడం మాత్రం ఆఫడం లేదు. సోషియా ఎకనమిక్ సర్వే ద్వారా 2019-24 వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం హయాంలో ఎంఎస్ఎంఈ రంగంలో 5 ఏళ్లలో 32,79,770 ఉద్యోగాలు తీసుకొస్తే... ఇదే సర్వే ద్వారా చంద్రబాబు హయాంలో చూస్తే 9.05 లక్షల ఉద్యోగాలు మాత్రమే వచ్చాయి. ఇవి సోషియో ఎకనామిక్ సర్వే ద్వారా వెలువడ్డ పచ్చి వాస్తవాలు.
● చంద్రబాబు 18 నెలల పాలనలో బాదుడే బాదుడు
మా ప్రభుత్వం వచ్చి కరెంటు ఛార్జీలు పెరగవు, అధిక భారం ఉండదని పదే,పదే చెప్పిన చంద్రబాబు తాను అధికారంలోకి వచ్చిన తర్వాత అంతా బాదుడే బాదుడు. 18 నెలల్లో కరెంటు ఛార్జీల రూపంలో రూ.20,135 కోట్లు ప్రజల మీద భారం వేశాడు. హెచ్ ఓ డీ ల విషయంలో చాలా గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేశారు. ఎన్నికల హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు. వైయస్.జగన్ అప్పు చేస్తే రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని, దివాళా తీస్తుందని గగ్గోలు పెట్టారు.
5 ఏళ్లలో వైయస్.జగన్ చేసిన అప్పు ఎంత? కేవలం 18 నెలల్లో చంద్రబాబు చేసిన అప్పెంత? అసలు నీకు సిగ్గుందా చంద్రబాబూ? వైయస్.జగన్ హయాంలో ఐదేళ్లు చేసిన అప్పులో 90 శాతం అప్పును చంద్రబాబు కేవలం 18 నెలల్లోనే చేశాడు. అయినా కూడా ఒక్క పథకాన్ని సక్రమంగా అమలు చేయడం లేదు, ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని పూర్తిగా నిర్వహించకుండానే ఏకంగా రూ.3,02,303.7 కోట్ల అప్పును కేవలం 18 నెలల్లోనే చేశాడు. ఇంకా మూడేళ్లలో ఎంత అప్పు చేస్తారో తెలియదు. సంవత్సరం ఆరు మాసాల్లోనే ఇంత ఘోరమైన అప్పు చేసిన.. మీరు వైయస్.జగన్ ను విమర్శించడం దుర్మార్గమని అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్.జగన్ అప్పు చేస్తే రాష్ట్రం శ్రీలంక అవుతుందన్న వాళ్లంతా.. ఏడాదిన్నరలోనే అంతకంటే ఎక్కువ చంద్రబాబు అప్పు చేస్తే ఏపీ అమెరికా అవుతుందా? అని నిలదీశారు. దీనికి ఎందుకు సమాధానం చెప్పరని మండిపడ్డారు.
● పాత్రికేయల ప్రశ్నలకు బదులిస్తూ...
రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అవార్డు ఎవరిచ్చారో తెలియదు కానీ.. అవార్డు రావడం సంతోషం. కానీ ఆయన దగ్గర ఇంకా చాలా ఆర్ట్స్ ఉన్నాయి. రాజకీయాలు, సినిమాల్లో కూడా నటించగల సామర్ధ్యం కలిగిన వ్యక్తి పవన్ కళ్యాణ్. సినిమాల కంటే రాజకీయాల్లోనే ఇంకా బాగా నటిస్తున్నాడు. చంద్రబాబును అనవసరంగా పొగడ్డం, వైయస్.జగన్ ను అనవసరంగా తిట్టడం అనే ఆర్ట్ చాలా గొప్పది.
వైయస్.జగన్ బెంగుళూరులో కూర్చుని కుట్రలు చేస్తున్నాడన్న టీడీపీ నేతల ఆరోపణలపై..
వైయస్.జగన్ బెంగుళూరులో కూర్చోని కుట్రలు చేయాల్సిన అవసరం లేదని కొట్టిపారేశారు. ప్రతిపక్షపార్టీగా ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేకవిధానాలపై విమర్శలు చేస్తామే తప్ప.. కుట్రలు చేయాల్సిన అవసరం లేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు పూర్తిగా హైదరాబాద్ లోనే ఉన్నారు. కానీ వైయస్.జగన్ ప్రతి వారం వచ్చి ప్రజలతో మమేకమవుతున్నారు. అనేక చోట్ల పరామర్శలకు వెళ్తున్నారు. అయినా కడుపుమంటతో టీడీపీ నేతలు... విమర్శలు చేయడం అలవాటుగా మారింది. కానీ ఇవాల్టికి చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ అద్దె ఇళ్లలో ఉంటున్నారు. అది కూడా నదీగర్భంలో ఉన్న ఇంటిలో ఉన్నారు.
నేను బహిరంగంగా ప్రజల సమక్షంలో డ్యాన్స్ వేశాను.. కానీ పవన్ కళ్యాణ్ ఎక్కడబడితే అక్కడే డాన్స్ వేస్తున్నారు. మీ నెత్తికెక్కి డాన్స్ వేయాల్సిన అవసరం మాకు లేదు. ఆయన గ్రామాల్లోకి వెళ్లి తెలుసుకుంటే మీ జనసేన కార్యకర్తల నెత్తిమీద టీడీపీ కార్యకర్తలు డాన్స్ వేస్తున్నారు అది చూసుకొండి పవన్ కళ్యాణ్ గారూ?
టీటీడీలో జరుగుతున్న కుట్ర అంతా చంద్రబాబు, ఆరోపణలు చేస్తున్న బిజేపీ వారే చేస్తున్నారు. చంద్రబాబు ఇప్పటికీ దైవాన్ని అడ్డంపెట్టుకుని తుచ్చమైన రాజకీయాలు చేస్తున్నారు. కేవలం వైయస్.జగన్ మీద వ్యతిరేకత కలిగించడానికి అత్యంత నీచంగా మతాన్ని సైతం ఉపయోగించుకుంటున్నారు. దీన్ని శ్రీ వేంకటేశ్వరస్వామి అస్సలు క్షమించడు అని అంబటి రాంబాబు బదులిచ్చారు.