వైయస్ఆర్‌సీపీ హయాంలోనే విజయవాడ అభివృద్ధి
విజయవాడ: విజయవాడ నగరపాలక సంస్థలో ఐదేళ్ల పదవీకాలాన్ని విజయవంతంగా పూర్తి చేసిన వైయస్ఆర్‌సీపీ కార్పొరేటర్లకు అభినందన సభ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యేలు వెలంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ, విజయవాడలో జరిగిన అభివృద్ధి అంతా వైయస్ఆర్‌సీపీహయాంలోనే సాధ్యమైందన్నారు. నగరంలోని మూడు నియోజకవర్గాల్లో ఎన్నడూ లేనంత అభివృద్ధి జరిగిందని తెలిపారు. కొంతమంది ప్రలోభాలకు లోనై పార్టీలు మారినా, మిగిలిన వారు ధైర్యంగా పార్టీతోనే నిలబడి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెంట నడిచారని కొనియాడారు.
కార్పొరేటర్లు ఐదేళ్ల పాటు ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తూ అండగా నిలిచారని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యేలా కష్టపడాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ప్రశ్నించేందుకు వైయస్ఆర్‌సీపీ సీనియర్ మాజీ కార్పొరేటర్లతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తామని తెలిపారు.
మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ, వైయస్ఆర్‌సీపీ కార్పొరేటర్లు ఐదేళ్ల పాటు ప్రజలకు సేవ చేసి అభినందనీయంగా నిలిచారని చెప్పారు. నగరంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి వైయస్ఆర్‌సీపీ హయాంలోనే పూర్తిస్థాయిలో జరిగిందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వంలో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయని, ప్రభుత్వ దృష్టి అమరావతి మీద మాత్రమే ఉందని విమర్శించారు.
మాజీ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ, విజయవాడ నగరాభివృద్ధికి కార్పొరేటర్లు విశేష కృషి చేశారని ప్రశంసించారు. ప్రజల తరఫున వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం నగరాభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్పొరేటర్లు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.