రాష్ట్రంలో దళితులకు రక్షణ లేదు

19 Jan, 2026 17:39 IST

తాడేపల్లి:  రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని, టీడీపీకి, కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే ప్రాణాలు తీస్తామన్న తరహాలో పాలన సాగుతోందని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్‌రావు ఆక్షేపించారు. రాష్ట్రంలో అంబేడ్కర్‌ రాజ్యాంగం కాకుండా, రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలు చేస్తున్నారని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన జూపూడి ప్రభాకర్‌రావు ధ్వజమెత్తారు.
ప్రెస్‌మీట్‌లో జూపూడి ప్రభాకర్‌రావు ఏం మాట్లాడారంటే..:

పార్టీని, అధినేతను అభిమానించడం తప్పా?:
    ఒక పార్టీని, ఆ పార్టీ అధినాయకుడిని ప్రేమించడం తప్పా? అదేమైనా నేరమా? మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి అకాల మరణం తర్వాత ప్రజల కష్టాల నుంచి పుట్టిన ఉద్యమ పార్టీ వైయ‌స్ఆర్‌సీపీ. ఎంతో ప్రజాదరణ పొందిన ఆ పార్టీని, అధినేతను ప్రేమించడం తప్పు ఎలా అవుతుంది?. జగన్‌గారి పాలనలో రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమం వైపు పరుగులు తీసింది. అందుకే 2024 ఎన్నికల్లో కూడా ప్రజలు మా పార్టీకి ఓటేశారు. పార్టీకి 11 స్థానాలు మాత్రమే వచ్చినా, 41 శాతం ఓటింగ్‌ రావడం ప్రజల విశ్వాసానికి నిదర్శనం. మరి అలాంటి నాయకుడిపై అభిమానంతో ఓటేస్తే ఊరి నుంచి బహిష్కరిస్తారా?. ఎంత దారుణం?.

వైయస్‌ జగన్‌కు ఓటేస్తే చంపేస్తారా?!:
    భార్య అనారోగ్యంతో ఉందని తెలుసుకుని సొంత ఊరు పల్నాడు జిల్లా, గురజాల నియోజకవర్గం పిన్నెల్లికి వచ్చిన మంద సాల్మన్‌ను ఇనుప రాడ్లతో కొట్టి చంపడం ఏ సంస్కృతి? వైయస్‌ జగన్‌ను ప్రేమిస్తే, ఆయనకు ఓటు వేస్తే చంపేస్తారా?! అంటే, రాష్ట్రంలో 1.2 కోట్ల మంది దళితులకు అంబేద్కర్‌ ఇచ్చిన రాజ్యాంగం ప్రకారం ఓటు హక్కు లేదా?. ఆ ఓటు హక్కు  వినియోగించి జగన్‌గారికి ఓటు వేస్తే చంపేస్తామన్న హెచ్చరికగానే మంద సాల్మన్‌ను బలిగొన్నారు. కులాంతర వివాహాల పేరుతో జరిగిన పరువు హత్యలు చూశాం. కానీ ఒక పార్టీని ప్రేమించి ఓటు వేస్తే కూడా చంపుతామన్న పాలనను ఎప్పుడైనా చూశామా?.
అహంకారాన్ని నెత్తికెక్కించుకున్న వారిని దళిత ఉద్యమాల ద్వారా కింద పడేసిన చరిత్రను మరిచిపోవద్దు. 

చంపే అధికారం ఎవరిచ్చారు?:
    దళితులారా ఒక్కసారి ఆలోచన చేయండి. ‘మాకు తప్ప, మీకు ఇష్టమైన నాయకుడికి, పార్టీకి ఓటు వేస్తే చంపేస్తాం’ అన్న హుకుం రాష్ట్రంలో జారీ అవుతోంది. ఆ దిశలోనే పల్నాడు జిల్లా, గురజాల నియోజకవర్గం పిన్నెల్లిలో దళితుడైన మంద సాల్మన్‌ను దారుణంగా హత్య చేశారు. అది కచ్చితంగా ప్రభుత్వ హత్య. అలా చంపే హక్కు ఈ ప్రభుత్వానికి ఎవరిచ్చారు?. అందుకే కూటమి ప్రభుత్వంపై ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టాలి. ఈ హత్యపై సీబీఐ దర్యాప్తు కోరుతూ, డీజీపీకి వినతిపత్రం ఇవ్వడానికి వెళ్లిన మా పార్టీ నాయకులకు అనుమతి ఇవ్వలేదు. చివరకు ఆఫీస్‌లోకి కూడా అనుమతించలేదు. మా నాయకులు ధర్నా చేయడంతో, చివరకు అనుమతించారు. కానీ, డీజీపీ మాత్రం కలవలేదు. అంటే దళితులపై దాడులు జరుగుతుంటే ఈ ప్రభుత్వం పట్టించుకోదా?

ఇదేం న్యాయం?:
    ప్రాణభయంతో ఎక్కడో తలదాచుకుంటున్న తన భర్త, 102 డిగ్రీల జ్వరంతో బాధ పడుతున్న తనను చూడటానికి వస్తే, ఊరి శివారులో కాపు కాసి ఇనుప రాడ్లతో కొట్టి చంపారని సాల్మన్‌ భార్య చెప్పారు. వాస్తవం ఇలా ఉంటే, ఘటన తర్వాత సాల్మన్‌ భార్య స్పష్టంగా ఫిర్యాదు చేసినా, హంతకులపై కాకుండా, సాల్మన్‌పైనే కేసు నమోదు చేయడం అత్యంత హేయం. ఇలాంటివే రేపు మనకూ జరగొచ్చు. కాబట్టి రాష్ట్రంలోని దళితులంతా ఒక్కసారి ఆలోచించండి. కూటమి ప్రభుత్వ తీరును ఎండగట్టండి. తగిన బుద్ధి చెప్పండి. ఈ విషయంలో న్యాయవ్యవస్థ కూడా జోక్యం చేసుకోవాలని, సాల్మన్‌ హత్యకు సంబంధించి, ప్రభుత్వంపై కేసు నమోదు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం.

మీడియా ప్రశ్నలకు బదులిస్తూ..:
    ప్రజాస్వామ్య విలువలను నమ్ముతూ అభ్యర్థించేందుకు ఈరోజు వైయ‌స్ఆర్‌సీపీ నేతలు డీజీపీ కార్యాలయానికి వెళ్లారు. వైయ‌స్ఆర్‌సీపీ నేతలు కలవడానికి వస్తున్నారని తెలిసి డీజీపీగారే పక్కకు తప్పుకున్నారు. డీజీపీ లేరని చెప్పి కార్యాలయ గేట్లు మూసివేయడంతో గేటు వద్దే ధర్నా చేయాల్సి వచ్చింది. దీంతో డీజీపీ పరువు పోతుందనే భయంతో వేరే అధికారి ద్వారా వినతిపత్రం తీసుకున్నారు. ఇలా ఆఫీసులు మూసేసుకుంటే ప్రజలు ఎక్కడికి వెళ్లాలి?. అందుకే ఇలాంటి ధోరణి ప్రభుత్వానికి మంచిది కాదని జూపూడి ప్రభాకర్‌రావు తేల్చి చెప్పారు.