`గడప గడపకు` ఆత్మీయ స్వాగతం
విజయవాడ: ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సర్కారు మూడేళ్ల పాలన సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. కార్యక్రమానికి వెళ్లిన ఎమ్మెల్యేలు, అధికారులకు ప్రజలు ఆత్మీయ స్వాగతం పలుకుతున్నారు. ప్రధానంగా గత మూడేళ్ల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన అంశాల్లో 95 శాతం అమలుచేసి చూపించింది. అంతేకాక.. ప్రభుత్వ పథకాలను కులం, ప్రాంతం, మతం, రాజకీయాలకు అతీతంగా అర్హులైన పేదలందరికీ సంతృప్త స్థాయిలో అమలుచేసింది.
సామాజిక తనిఖీల ద్వారా లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపికచేసి వారికి ఆయా పథకాలను అందించింది. అలాగే, మునుపెన్నడూ లేనివిధంగా పెద్దఎత్తున సంక్షేమ పథకాలను అమలుచేసింది. ఈ నేపథ్యంలో.. అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలను గడప గడపకు పంపించి ప్రజల నుంచి సలహాలను, సూచనలను తీసుకోవాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగానే నియోజకవర్గాల్లోని అన్ని ఇళ్లను ఎమ్మెల్యేలు సందర్శిస్తున్నారు.
విజయవాడ నగరంలో..
శనివారం విజయవాడ నగరంలోని 37 డివిజన్ లోని 184 సచివాలయం పరిదిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ గడప గడపకు వెళ్లి సమస్యలు అడిగి వాటిని వెను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఎమ్మెల్యే వెంట కార్పొరేటర్ చటర్జీ, నాయకులు కొఠారి, గ్రాంధి రమేశ్, సుంకర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
మహానంది మండలంలో..
శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి మహానంది మండలంలోని గోపవరం గ్రామంలో శనివారం రెండో రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రతి ఇంటిని సందర్శిస్తున్న ఎమ్మెల్యే..ఈ మూడేళ్లలో ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాల గురించి ఆరా తీస్తున్నారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డికి మద్దతుగా ఉండాలని కోరుతున్నారు.