అశృనయనాల మధ్య వైయ‌స్ఆర్‌సీపీ దళిత కార్యకర్త సాల్మన్ అంత్యక్రియలు

16 Jan, 2026 17:58 IST

పల్నాడు జిల్లా : గురజాల నియోజకవర్గ పరిధిలోని పిన్నెల్లి గ్రామంలో హ‌త్య‌కు గురైన వైయ‌స్ఆర్‌సీపీ దళిత కార్యకర్త మందా సాల్మన్ అంత్యక్రియలు అశృనయనాల మధ్య నిర్వహించారు. గ్రామమంతా విషాద ఛాయలు అలుముకోగా, కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఈ అంత్యక్రియ‌ల్లో  గురజాల నియోజకవర్గ వైయ‌స్ఆర్‌సీపీ ఇన్‌చార్జ్‌, మాజీ ఎమ్మెల్యే  కాసు మహేష్ రెడ్డి, పార్టీ నాయ‌కులు గౌతంరెడ్డి త‌దిత‌రులు పాల్గొని సాల్మన్ భౌతిక కాయానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం సాల్మన్ కుటుంబ సభ్యులను పరామర్శించి, ఈ కష్ట సమయంలో వైయ‌స్ఆర్‌సీపీ పార్టీ సంపూర్ణంగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

ఈ సందర్భంగా కాసు మహేష్ రెడ్డి మాట్లాడుతూ, సాల్మన్ మరణం పార్టీకి తీరని లోటని, బడుగు, బలహీన వర్గాలకు చెందిన కార్యకర్తలపై జరుగుతున్న దాడులు ప్రజాస్వామ్యానికి మచ్చగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని తక్షణమే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

అంత్యక్రియల్లో పలువురు వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా, మండల, గ్రామస్థాయి నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సాల్మన్ కుటుంబానికి అండగా నిలుస్తూ, న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని పార్టీ నేతలు స్పష్టం చేశారు. సాల్మన్ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు ధైర్యం చేకూరాలని ఆకాంక్షించారు. పిన్నెల్లి గ్రామంలో ఈ ఘటనతో తీవ్ర విషాద వాతావరణం నెలకొంది.