ముస్లిం మైనార్టీ వర్గాలకు రక్షణ కరువు

వినుకొండ: రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని, ముస్లిం మైనార్టీ వర్గాలకు కూడా రక్షణ కరువైందని వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు విమర్శించారు. పోలీసులు, టీడీపీ నాయకుల వేధింపులు తాళలేక పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఎస్‌కే రఫీని ఆయన పరామర్శించారు. పట్టణంలోని చిన్నపరెడ్డి ఆసుపత్రి వద్దకు వెళ్లి ఐసీయూలో చికిత్స పొందుతున్న ఎస్‌కే రఫీతో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం మీడియాతో బ్రహ్మనాయుడు మాట్లాడుతూ.. వైయస్ఆర్‌సీపీ నాయకులే లక్ష్యంగా కూటమి నేతలు దమనకాండ కొనసాగిస్తున్నారని ధ్వజమెత్తారు. గ్రామంలో కేవలం రెండు, మూడు కుటుంబాలు ఉన్న ముస్లిం మైనార్టీ వర్గాలకు కనీసం మాట్లాడే స్వేచ్ఛ కూడా లేకుండా చేస్తున్నారు. వైయస్ఆర్‌సీపీ కార్యకర్త రఫీని పోలీసులు ప్రతిరోజూ పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి బెదిరించినట్లు చెప్పారు. దీంతో మనస్తాపానికి గురై రఫీ ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు చెప్పారు. రఫీ కుటుంబసభ్యులకు అండగా ఉంటామని, న్యాయపరమైన పోరాటానికి కూడా సిద్ధమని ప్రకటించారు. చేతనైతే మంచి పరిపాలన అందించాలని, ఇలా కక్షసాధింపు రాజకీయాలు మానుకోవాలని అన్నారు. న్యాయం కోసం పోలీస్‌స్టేషన్‌కి వెళ్తే పోలీసులే ఈ విధంగా భయపెట్టి దారుణంగా కొట్టి హింసించి స్థానిక టీడీపీ నాయకుల కాళ్లు పట్టుకొని క్షమాపణ అడిగితేనే కేసులు లేకుండా చేస్తామని అనడం దేశంలో ఎక్కడా లేదన్నారు. ఇప్పటికై నా పనితీరు మార్చుకొని అభివృద్ధిపై దృష్టిపెట్టాలని, లేనిపక్షంలో కార్యకర్తల కోసం ఎందాకై నా పోరాడుతానని అన్నారు.