టీటీడీని టీడీపీకి జేబు సంస్థగా మార్చిన పాలకమండలి

19 Feb, 2026 09:05 IST

తిరుపతి: పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అధికార తెలుగుదేశం పార్టీకి అనుబంధ సంస్థగా మార్చిన పాలకమండలి తీరుపై టీటీడీ మాజీ చైర్మన్, వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతిలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నెయ్యి టెండర్లలో జరిగిన అక్రమాలను ఆధారాలతో సహా ఎండగట్టారు.  టీటీడీ విడుదల చేసిన వివరణాత్మక ప్రకటనను చూస్తుంటే అది దేవస్థానం ఇచ్చిందా లేక టీడీపీ కార్యాలయం నుంచి వచ్చిందా అనే అనుమానం కలుగుతోందన్నారు. హెరిటేజ్ సంస్థ గురించి టీటీడీ  ఎలా వివరణ ఇస్తుందని ప్రశ్నించిన ఆయన... టీడీపీని ప్రశ్నిస్తే టీటీడీ ఎందుకు సమాధానం చెబుతోందని నిలదీశారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తన సోషల్ మీడియా ఖాతాల్లో ఆ ప్రకటనలను షేర్ చేయడం ద్వారా టీటీడీని టీడీపీకి అనుబంధ సంస్థగా మార్చేశారని స్పష్టమవుతోంది" అని ఆయన మండిపడ్డారు.  ఇందాపూర్ డెయిరీ కోసమే గతంలో సేకరణ పరిధి 1500 కిలోమీటర్లు ఉంటే, దాన్ని 800 కిలోమీటర్లకు కుదించారని, కేవలం చంద్రబాబు సొంత సంస్ధలకు లబ్ది చేకూర్చేందుకే  నెయ్యి సరఫరా టెండర్ల ప్రక్రియలో నిబంధనలను తుంగలో తొక్కారని భూమన మండిపడ్డారు. వారి అక్రమాలు బయటపడ్డం తట్టుకోలేక చివరకు ఆలయంలో ఉద్యోగులు, వేదపారాయణదారులను సైతం బెదిరింపులకు దిగడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. టీటీడీ స్వయంప్రతిపత్తిని కాపాడాలని, రాజకీయ అవసరాల కోసం శ్రీవారి ప్రతిష్టను దిగజార్చవద్దని భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఇంకా ఏమన్నారంటే... 
తిరుపతి.

● టీటీడీని టీడీపీకి అనుబంధ సంస్ధలా మార్చిన పాలకమండలి..

తిరుమల తిరుపతి దేవస్థానం నిన్న ఒక ప్రకటన ఇచ్చి దాన్ని టీటీడీ వెబ్ సైట్ లో కూడా పొందుపరిచింది. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పత్రికలు, ఛానెళ్లు దాన్ని బహుళ ప్రాచుర్యంలోకి తెచ్చాయి. మరోవైపు టీటీడీ కూడా ఆ ప్రకటన మేమివ్వలేదని ఖండించలేదు కాబట్టి దాన్ని టీటీడీ ప్రకటనగానే భావించాలి. మరోవైపు పాలకమండలి చైర్మన్ బీ ఆర్ నాయుడు ఆ ప్రకటనను యథావిధిగా తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. టీటీడీని ఎవరు ప్రశ్నించారని సమాధానమిచ్చారో అర్ధం కావడం లేదు? టీడీపీని ప్రశ్నిస్తే టీటీడీ ఎందుకు సమాధానమిచ్చిందన్నది ఆశ్చర్యంగా ఉంది? బోలేబాబా మా అసోసియేటెడ్ సంస్థ హెరిటేజ్ అని అన్నట్టు, ఇందాపూర్ మా మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ అని హెరిటేజ్ అన్నట్టుగా నిన్న టీటీడీ ఇచ్చిన లేఖతో... టీడీపీ పార్టీకి టీటీడీ అనుబంధ సంస్థా అన్న ఆనుమానాలు కలుగుతున్నాయి?    టీటీడీ అన్నా టీడీపీ అన్నా ఒకటేనేమో అని అనుకుంటున్నారు. 

● నెయ్యి టెండర్లలో బట్టబయలైన అక్రమాలు...

484 జీవో ద్వారా తొలుత కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ టెండర్లలో పాల్గొని 20 లక్షల కేజీల సరఫరాకి 10 లక్షల కేజీలు మాత్రమే సరఫరా చేస్తామని చెప్పారు కాబట్టి.. మిగిలిన 10 లక్షలకు ఎల్ - 2 టెండరర్ కి అవకాశం ఇచ్చామని ప్రకటించారు. కానీ 484 జీవో తీర్మానంలో పాల్గొన్న కర్ణాటక మిల్క్ ప్రొడక్షన్ (నందినీ మిల్క్ ప్రొడక్ట్స్) 20 లక్షల కేజీల నెయ్యి సరఫరాకు సింగిల్ టెండరర్ గా పాల్గొంది. కానీ టీటీడీ తన ప్రకటనలో సింగిల్ టెండరర్ గా పాల్గొన్న కర్ణాటక మిల్క్ ప్రొడక్షన్ సంస్థ.. 20 లక్షలు సరఫరా చేయలేనని చెబితే..  ఎల్ -2 గా జాతీయ డెయిరీకి ఇచ్చామని చెప్పారు. 
కానీ కర్ణాటక మిల్క్ ప్రొడక్షన్ తాము 20 లక్షల కేజీలు సరఫరా చేయలేము  ప్రకటించలేదు. 10 లక్షలు సరఫరా చేస్తున్నామని చెప్పారు. ఈ టెండర్ ప్రక్రియలో అసలు ఎల్ - 2 టెండరర్ లేడు. అయినా  ఎల్ -2 కు 10 లక్షల కేజీల సరఫరాకు అవకాశం ఇచ్చామని టీటీడీ పచ్చి అబద్దాలు చెబుతుంటే.. టీడీపీకి అనుబంధ సంస్థ అనే అనుమానాలు ఎవరికైనా వస్తాయి? ఈ టెండరు 28-09-2025 నాడు కరారు అయింది.

ఆ తర్వాత వెంటనే 04-11-2025 నాడు 10 లక్షల కేజీలకు సంబంధించి టెండర్లు ఓపెన్ చేశారు. ఇందులో ఇందాపుర్ డెయిరీ సంస్థ మరియూ మరో డెయిరీ కలిపి పాల్గొంటే.. నేను 10 లక్షలే సరఫరా చేస్తానని చెప్పిన కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ ఆ తర్వాత నెలలో జరిగిన ఈ టెండర్లలో ఎల్ -3 గా రావడం ఆశ్చర్యకరంగా ఉంది.  ఆ తర్వాత 12-12-2025 నాటి టెండర్లలో మరో 10 లక్షల కేజీల నెయ్యి సరఫరాకు 
ఇందాపూర్ డెయిరీ ఎల్ -2 వచ్చింది. మదర్ డెయిరీ ఎల్ -1 వచ్చింది .ఇందులో కూడా 10 లక్షలు నెయ్యి సరఫరా చేస్తానంటూ కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ ఎల్ -3 గా పాల్గొంది. ఇందాపూర్, మదర్ డెయిరీ రెండూ 04-11-2025 ఒకటి ఎల్ -1, 12-12-2025 నాడు ఎల్ -2 మారి ఈ రెండు సంస్థలు రెండు టెండర్లను దక్కించుకున్నాయి. ఈ రెండు సంస్థలు రూ.130 కోట్ల నెయ్యిని కేజీ రూ.568 కు సరఫరా చేసేందుకు దక్కించుకున్నాయి. ఇందులో కూడా కర్ణాటక మిల్క్ డెయిరీ పాల్గొంది అంటే టీటీడీ ఎంత అబద్ధాలు చెప్పిందనడానికి ఇదే ఉదాహరణ. మేము నిబంధనలు కఠినతరం చేశామని చెపుతున్న బీఆర్ నాయుడు ఆధ్వర్వంలోని బోర్డు ఎక్స్ పర్ట్స్ కమిటీని నియమించి 1500 కిలోమీటర్ల సేకరణ పరిధిని 800 కిలోమీటర్లకు కుదించామని చెప్పారు. 

● నేటికీ వైయస్.జగన్ హయాంలో నిబంధనలే...

ఇంకా ఆశ్చర్యకరం ఏమిటంటే ఇవాళ సిట్ నివేదికలో ముద్దాయిలుగా ప్రకటించిన విజయభాస్కర్ రెడ్డి, సురేంద్రనాథులే .. సమూలమైన మార్పులు తెచ్చామన్న టీటీడీ, టీడీపీ, సీఎం చంద్రబాబులు నియమించిన ఎక్ట్ పర్ట్ కమిటీ సభ్యులు. మిగిలిన ఇద్దరు అప్పుడప్పుడూ వచ్చి పోయేవాళ్లు. ఈ ఎక్స్ పర్ట్ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం 1500 కిలోమీటర్ల పరిధిని 800 కిలోమీటర్లకు కుదించడం తప్ప మరేదీ కొత్తగా చేర్చలేదు సరికదా మా హయాంలో రూపొందించిన నిబంధనలనే యధాతధంగా అమలు చేస్తున్నారు. ఎలాంటి మార్పూ చేయలేదు. వైయస్.జగన్ హయాంలోనే నిబంధనలను కఠినతరం చేశారు. వాటినే ఈ ప్రభుత్వం అమలు చేస్తోంది.

● ఇందాపూర్ కోసమే నిబంధనలకు పాతర...

మరోవైపు 1500 కిలోమీటర్ల సేకరణ పరిధిని 800 కిలోమీటర్లకి కుదించామని చెబుతోంది. కానీ  10 లక్షల కేజీలు కంటే మించి సరఫరా చేయమని కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ చెప్పింది కనుక... తాము పెట్టిన 800 కిలోమీటర్ల సేకరణ పరిధి నిబంధనను తుంగలో తొక్కిన టీటీడీ.. తిరుమల నుంచి  దాదాపు 900 కిలోమీటర్లు దూరంలో ఉన్న హెరిటేజ్ అనుబంధ ఇందాపూర్ డెయిరీని తీసుకువచ్చింది.  కేవలం ఆ డెయిరీ కోసమే కూటమి ప్రభుత్వం, టీటీడీ నిబంధనను మార్చింది. ఇదే ఇందాపూర్ డెయిరీ 2015లో కేజీ నెయ్యి రూ.306 కే సరఫరా చేసింది. ఇదే ఇందాపూర్ డెయిరీని హెరిటేజ్ సంస్థ తన మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ అని చెప్పుకుంది. 27-11-2028న తీర్మానం ప్రకారం ఇవాళ సీబీఐ సిట్ నిందితుడుగా పేర్కొన్న ప్రీమియర్ డెయిరీతో కలిసి రూ.30.49 లక్షల విలువైన  9.50 లక్షల కేజీల నెయ్యిని సంయుక్తంగా హెరిటేజ్ మాన్యుఫ్యాక్చరింగ్ డెయిరీ నెయ్యి సరఫరా చేసింది. అంటే ఇందాపూర్ సంస్థచంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పుడే నెయ్యి సరఫరాకి ముందుకు వస్తుంది. గతంలో నిందితుడిగా ఉన్న డెయిరీ సంస్థలతో కలిసి నెయ్యి సరఫరా చేసింది. 

● నందిని డెయిరీ పై బీ ఆర్ నాయుడు అసత్యాలు...

రూ.300 కే కేజీ నెయ్యి  ఎలా వస్తుందని ప్రశ్నిస్తున్న చంద్రబాబు గారూ, మీ ఉత్పత్తి సంస్థ అయిన ఇందాపూర్ డెయిరీ కూడా ఇదే ధరకు సరఫరా చేసిన విషయం బయటపడింది, ఇప్పుడు మీరు ఏం చెబుతారు? అంటే దొంగలంతా కలిసి దోచుకున్నారనడానికి ఇదే నిదర్శనం. టీటీడీని ఎవరూ అడగకుండానే నిన్న హెరిటేజ్ గురించి ఇచ్చిన వివరణ చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. ఇంకా 2019-24 మధ్య నందినీ డెయిరీకి ఏ రకమైన సరఫా టెండర్లు ఇవ్వలేదని చెబుతున్నారు. టెండర్లలో పాల్గొన్నారా? లేదా? అన్న విషయం చెప్పకుండా టీడీపీకి అనుబంధంగా  ఉంటే తప్ప ఈ రకమైన ప్రకటన రాదు? 
వాస్తవానికి నందిని డెయిరీ 29-01-2021 న జరిగిన టెండర్లలో కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ రూ.396 కే బిడ్ ఫ్రైస్ కోట్ చేసింది. అందులో ఎల్ -1 గా ప్రీమియర్ ఆగ్రో, ఎల్ -2 గా ఆల్ఫా మిల్క్ ప్రొడక్ట్స్ సంస్థలు వస్తే టీటీడీ ఎల్ -3 అయిన కర్ణాటక మిల్క్ పెఢరేషన్ వాళ్లకు కూడా ఎల్ -1, ఎల్ -2 తో కలిపి 20 శాతం నెయ్యి సరఫరాకు అనుమతి ఇచ్చింది. 

● నందినిపై - టీటీడీ పొంతనలేని ప్రకటనలు...
 
పెరిగిన ధరల వల్ల బోర్డు తీర్మానం 484 ప్రకారం 2016లో ఆవు పాలు ధర తక్కువ ఉంది. 2025 నాటికి రూ.658 కి టెండరు వేసిన ఇందాపూర్ డెయిరీకి 137 శాతం పాలధర పెరిగింది కాబట్టి...  రూ.658 కోట చేశారు అని టీటీడీ చెబుతోంది. కర్ణాటక ఫెడరేషన్ నాలుగు సార్లు బిడ్ లో పాల్గొన్నారు. 62 శాతం నెయ్యి సరఫరా వాళ్లే చేస్తున్నారని టీటీడీ ప్రకటన ఇచ్చింది. వాస్తవానికి  2024 సంవత్సరం  11వ నెలలో రూ.494 కే కర్ణాటక ఫెడరేషన్ నెయ్యి సరఫరా చేసింది. టీటీడీ మాత్రం 2016లో పాల ధర తక్కువగా ఉందని సాకులు చెబుతున్నారు. కానీ వాస్తవానికి ఏడాదిన్నరలోనే అంటే 2024లో రూ. 494 కి టెండరు దాఖలు చేసిన కర్ణాటక మిల్క్ ఫెడరేషన్, 2025 నాటికి ఏకంగా రూ.716 కు పెంచుకుంటూ వెళ్లింది. అంటే పాలఉత్పత్తి సంస్థ, నెయ్యి ఉత్పత్తి, సరఫరా సంస్థ రూ.250 పైగా కేజీ నెయ్యిని ఎందుకు పెంచింది? మరో విషయం నెయ్యి పాల ఉప ఉత్పత్తి అన్న విషయం మర్చిపోయింది.   అందులో నెయ్యితో పాటు మిగిలిన చాలా పాల ఉత్పత్తులు అమ్ముతారు. వాటన్నింటినీ ఉద్దేశపూర్వకంగా పక్కనపెట్టి ఇలాంటి తప్పుడు ప్రకటనలు ఇస్తున్నారు. రూ.494 నుంచి రూ.716 వరకు టెండర్ల ధరలు పెంచుకుంటూ పోయింది.. వీటన్నింటినీ గమనిస్తే చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పుడే  నందిని, ఇందాపూర్ సంస్థలు టెండర్లలో పాల్గొనడం చూస్తుంటే ఎవరికైనా అనుమానాలు వస్తాయి. వీటిపై తెలుగుదేశం పార్టీ సమాధానం చెప్పాలి. అందుకు బదులుగా టీడీపీ ప్రకటన ఇవ్వడం చూస్తుంటే.. టీటీడీ టీడీపీకి ఎంతలా జేబు సంస్ధలా మారిపోయిందో అర్ధం అవుతుంది.  ఇది మహాపాతకం. దైవ ద్రోహం. పచ్చి మోసం. స్వామివారి ఆలయాన్ని ముఖ్యమంత్రి కార్యాలయం మానిటరింగ్ చేస్తుందని చెప్పడం దారుణం. సాక్షాత్తూ శ్రీవారి కళ్యాణాలు జరిగే  సంపంగి మండపంలో బీఆర్ నాయుడూ, ఆయన తొత్తులు వేదపారాయణదారులతో సహా, గుడిలో పనిచేసే సిబ్బందిని పిలిచి బెదిరిస్తున్నారు. మీరు కరుణాకర్ రెడ్డి కి సమాచారం ఇస్తున్నారు, మీ ఫోన్ లు ట్యాప్ చేస్తున్నామని హెచ్చరించడం నీచాతి నీచం. మీరు బెదిరిస్తే బెదిరిపోయే వాళ్లు లేరు. 

● వేదపారాయణ పోస్టులు అమ్ముకుంటున్న ధైన్యం..

వైయస్.జగన్ హయాంలో 700 వేదపారాయణ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేస్తే.. చంద్రబాబు ప్రభుత్వం దాన్ని తొక్కి పెట్టింది. నాలుగు నెలల క్రితం ఇంటర్వ్యూలు పూర్తి చేసి ఇప్పటివరకు ఫలితాలను ప్రకటించకుండా... ఎంపికైనా వాళ్ల ఇళ్ల దగ్గరకి వెళ్లి లక్ష రూపాయలు చొప్పున డిమాండ్ చేస్తున్నారు. చివరకు వేదపారాయణం ఉద్యోగాలను సంతలో బేరగాళ్లలా అమ్ముకోవడం దుర్మార్గం. 2018లో తిరుమల లడ్డూ ప్రసాదానికి నెయ్యి సువాసన కోసం రోజుకి 375 కేజీల చొప్పున రూ.4 కోట్ల విలువైన నెయ్యి ఎందుకు కొనుగోలు చేశారని అడిగితే ఇప్పటివరకు దానికి సమాధానం ఎందుకు ఇవ్వడం లేదు? 

ఇందాపూర్ ని మోయడానికి టీటీడీని భ్రష్టుపట్టించి తనకు కావాల్సిన అధిక లాభాలకు నెయ్యి సరఫరాని కట్టబెట్టడానికే చంద్రబాబు కల్తీ నెయ్యి వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారు. అందులో భాగంగానే నెయ్యి రూ.320కే దొరుకుతుందా అంటూ ప్రకటనలిచ్చిన .. ఇవాల ఏకంగా రూ.716 నెయ్యి సరఫరా కట్టపబెట్టడానికే ఈ తతంగమంతా నడిపారన్నది బట్టబయలైందని కరుణాకర్ రెడ్డి తేల్చి చెప్పారు. ఇది ఇంతటితో ఆగుతుందన్న నమ్మకం లేని చంద్రబాబు రానున్న ఏడాదికి నెయ్యి ధరను ఏకంగా రూ.2వేలు చేసినా ఆశ్చర్యపోనవసరం లేదని స్పష్టం చేశారు.