సాధువులపై చేయి చేసుకోవడం బాబు పాలనలోనే జరిగింది
తిరుపతి: కూటమి ప్రభుత్వం పాలనలో సాధువులు, సన్యాసులు పట్ల అమానుషంగా ప్రవర్తిస్తారా అంటూ టీటీడీ మాజీ చైర్మన్, వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సాధువులపై చేయి చేసుకోవడం చంద్రబాబు పాలనలోనే జరిగిందని ఆక్షేపించారు. ఈ నెల 17న తిరుపతిలో కాషాయంబ దారులుపై జరిగిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. మంగళవారం భూమన కరుణాకర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..రెండువేల సంవత్సరాల చరిత్ర ఉన్న తిరుమలలో సాధువులు తిరుగుబాటు చేయడం ఇదే తొలిసారి అన్నారు. తిరుమలలో సాధువులు పట్ల అమానుషంగా ప్రవర్తించే తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సాధువులు పాదాలు మొక్కుతాం, కానీ నిన్న స్వామీజీలు మెడలు పట్టుకుని గెంటివేశారని ఫైర్ అయ్యారు. హిందూ ధర్మం కాపాడాలి అని త్యజించిన వారి పట్ల కూటమి ప్రభుత్వం కక్ష్య సాధింపు చర్యలకు దిగడం దుర్మార్గమన్నారు. ముంతాజ్ హోటల్ నిర్మాణానికి అనుమతులు ఇవ్వడంపై శాంతియుతంగా నిరసనలు చేపడుతున్న సాధువులను పనికి మాలిన వ్యాన్ లలో ఎక్కించి అడవుల్లో భాకరా పేట పోలీస్ స్టేషన్ కు తరలించడం భావ్యం కాదన్నారు. మత కల్లోలాలు ఉన్న ప్రాంతాల్లో కూడా ప్రమాద కరమైన పరిస్థితుల్లో ఇలా వ్యవహరించలేదని తప్పుపట్టారు. హిందూ ధర్మం పరిరక్షిస్తున్నామని చెప్పే కూటమి ప్రభుత్వం సాధువుల పట్ల ఇదేనా మీ వైఖరి అంటూ నిలదీశారు. ముంతాజ్ హోటల్ నిర్మాణం జరగనివ్వమని చెప్పిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇప్పుడు మాట మార్చారని మండిపడ్డారు. ఇటీవల తిరుమలలో మద్యం సేవించి ఒక తాగుబోతు వెదవ శ్రీవారి ఆలయం ముందు అసభ్యంగా ప్రవర్తిస్తే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. పుణ్యక్షేత్రంలో తాగుబోతు వీరంగం చేస్తే దిక్కు లేదని, ఆలయ అధికారులు కూటమి నేతలు సేవల్లో తరిస్తున్నారని భూమన విమర్శించారు.