అమరావతి తప్ప మిగిలిన ప్రాంతాల అభివృద్ధి పట్టదా బాబూ?
అనంతపురం: ముఖ్యమంత్రి చంద్రబాబు కు అమరావతి ప్రాంతం తప్పా ..రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల అభివృద్ధి పట్టదా? అని వైయస్ఆర్‌సీపీ నేత, రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి మండిపడ్డారు. రేపు ఉరవకొండ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన సందర్భంగా ప్రకాశ్‌రెడ్డి స్పందించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..జిల్లాకు వస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు రైతుల సమస్యలపై సానుకూలమైన నిర్ణయం తీసుకోవాలన్నారు. హంద్రీనీవా లైనింగ్ పనులను వెంటనే ఆపాలని ఆయన కోరారు. హంద్రీనీవా పనుల్లో నీళ్లు కాదు... అవినీతి కమీషన్లు పారిస్తున్నారని ఆక్షేపించారు. హంద్రీనీవా కాలువల వెడల్పు 6300 క్యూసెక్కుల స్థాయికి పెంచేందుకు వైయస్ జగన్ కృషి చేశారని గుర్తు చేశారు. హంద్రీనీవా కాలువ వెడల్పు కేవలం 3 వేల క్యూసెక్కుల కే పరిమితం చేయడం చంద్రబాబు సర్కార్ కు తగదన్నారు. రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టులకు చంద్రబాబు నిధులు ఇవ్వలేదని, డబ్బంతా అమరావతికే ఖర్చు చేయడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ కు విదేశీ నిధులు ఆపడంపై చంద్రబాబు స్పందించాలని, ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా తో మాట్లాడి సమస్యకు పరిష్కారం చూపాలని తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి డిమాండ్ చేశారు.