కళ్యాణదుర్గంలో మద్యం మాఫియా రాజ్యం
కళ్యాణదుర్గం: కళ్యాణదుర్గం నియోజకవర్గంలో బెల్ట్ షాపుల ముసుగులో భారీ స్థాయిలో మద్యం దందా సాగుతోందని మాజీ ఎంపీ, వైయస్ఆర్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త తలారి రంగయ్య ఆరోపించారు. మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన, నియోజకవర్గంలోని దాదాపు ప్రతి గ్రామంలో యథేచ్ఛగా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారని విమర్శించారు. ప్రతి మద్యం బాటిల్‌పై రూ.30 నుంచి రూ.60 వరకు అదనంగా అక్రమ వసూళ్లు చేస్తున్నారని, ఇందుకు సంబంధించిన వివరాలను సాక్ష్యాలతో సహా మీడియా ముందుంచినట్లు తెలిపారు. ఈ అదనపు వసూళ్ల ద్వారా భారీ మొత్తంలో డబ్బు సమీకరించబడుతోందని పేర్కొన్నారు.
ఈ అక్రమ సంపాదన అంతా నేరుగా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు జేబుల్లోకే వెళ్తోందని తలారి రంగయ్య తీవ్ర ఆరోపణలు చేశారు. పేదల కష్టార్జిత సొమ్మును మద్యం విక్రయాల ద్వారా దోచుకుంటూ, అదే డబ్బుతో దేవాలయాలు, గోపురాలు, విగ్రహాలకు విరాళాలు ఇస్తూ "సొంత నిధులు" అంటూ ప్రచారం చేసుకోవడం ప్రజలను మోసం చేయడమేనని మండిపడ్డారు. నియోజకవర్గంలో జరుగుతున్న ఈ భారీ దోపిడీపై సంబంధిత అధికారులు వెంటనే దృష్టి సారించి విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. బెల్ట్ షాపుల ద్వారా జరుగుతున్న అక్రమ వ్యాపారాన్ని అరికట్టి, ప్రజలపై పడుతున్న అదనపు భారం తొలగించాలని కోరారు. బెల్ట్ షాపుల ముసుగులో జరుగుతున్న ఈ వ్యవస్థీకృత దోపిడీని ప్రజలందరూ గమనించాలని, ఎమ్మెల్యే అసలు రంగును గుర్తించాలని తలారి రంగయ్య పిలుపునిచ్చారు. ప్రజా ప్రతినిధులు ప్రజల సంక్షేమం కోసం పనిచేయాల్సిందిపోయి, అక్రమ వసూళ్లకు పాల్పడటం దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు.