గుంతకల్‌లో వెంకటేశ్వర స్వామికి పాప పరిహార పూజలు

31 Jan, 2026 12:31 IST

అనంత‌పురం జిల్లా: తిరుమల లడ్డూ ప్రసాదంపై జంతు కొవ్వు కలిసిందంటూ కూటమి నేతలు సాగించిన విషప్రచారం పూర్తిగా అబద్ధమని సీబీఐ చార్జిషీట్‌లో స్పష్టమైన నేపథ్యంలో, గుంతకల్ పట్టణంలోని రాజేంద్రనగర్‌లో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైయ‌స్ఆర్‌  కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాప పరిహార పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గుంతకల్ నియోజకవర్గం వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి మాజీ ఎమ్మెల్యే వై. వెంకటరామిరెడ్డి హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి టెంకాయలు కొట్టి మొక్కులు చెల్లించారు. అనంతరం మాట్లాడుతూ, కోట్లాది మంది హిందువులు ఆరాధించే కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదంపై అసత్య ఆరోపణలు చేయడం అత్యంత దుర్మార్గమని మండిపడ్డారు. వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ హయాంలో తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు కలిసిన నెయ్యిని వాడారని కావాలనే విషప్రచారం చేశారని, దీనివల్ల భక్తుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని విమర్శించారు.

ఈ అంశంపై చంద్రబాబు ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసినప్పటికీ, నిజాలు వెలుగులోకి రావాలనే ఉద్దేశంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారని గుర్తు చేశారు. సీబీఐ పూర్తిస్థాయి దర్యాప్తు అనంతరం దాఖలు చేసిన చార్జిషీట్‌లో తిరుమల లడ్డూలో జంతు కొవ్వు కలిసిందన్న ప్రచారం పూర్తిగా అబద్ధమని తేల్చిందని తెలిపారు. దీంతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేక, ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేయాలనే కుట్ర ప్రజల ముందు బట్టబయలైందన్నారు.

రాజకీయ లబ్ధి కోసం దేవుడినే వాడుకోవడం అత్యంత హేయమైన చర్యగా అభివర్ణించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తుల్లో ఈ అంశంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోందని తెలిపారు. అయినప్పటికీ, తాము చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి తిరుమల శ్రీవారిని ఇంకా రాజకీయాల్లోకి లాగుతున్నారని చంద్రబాబుపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

చంద్రబాబుకు దేవుడిపై భయం, భక్తి ఉంటే ఇలాంటి క్షుద్ర రాజకీయాలు చేసేవాడే కాదని వ్యాఖ్యానించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు అడుగుజాడల్లోనే నడుస్తూ సనాతన ధర్మం ముసుగులో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తాము చేసిన తప్పులను గ్రహించి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌లు తెలుగు ప్రజలకు, శ్రీవారి భక్తులకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్టణ, మండల అధ్యక్షులు, మున్సిపల్ కౌన్సిలర్లు, గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, అనుబంధ సంఘాల నాయకులు, నియోజకవర్గం మరియు మండల స్థాయి పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.