చేసిందే ప్రజలకు ధైర్యంగా చెబుతున్నాం
ఉరవకొండ: వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో అదే ధైర్యంగా ప్రజలకు చెప్పే అవకాశాన్ని ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి తమకు కల్పించారని, అందుకే ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజలను పలకరించగలుగుతున్నామని ఉరవకొండ వైయస్ఆర్ సీపీ ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అన్నారు. నియోజకవర్గ పరిధిలోని వజ్రకరూరులో నిర్వహించిన 'గడపగడపకూ మన ప్రభుత్వం' కార్యక్రమంలో విశ్వేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. ఇంటింటికీ తిరిగి ప్రజల బాగోగులు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను, అభివృద్ధిని ప్రజలకు వివరించారు. స్థానికుల సమస్యలు తెలుసుకుని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
అనంతరం విశ్వేశ్వర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. వైయస్ జగన్ పాలనలో నవరత్నాల పథకాల అమలుపై ప్రజల్లో నూరు శాతం సంతృప్తి కనిపిస్తోందన్నారు. తమ ప్రభుత్వం విద్య, వైద్యం, మహిళ, రైతు సంక్షేమానికి పెద్దపీట వేసిందన్నారు. గత ప్రభుత్వం ఎన్నికల హామీలను గాలికి వదిలేసిందని విమర్శించారు. ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో చెప్పిన హామీల్లో అధికారంలోకి వచ్చిన మూడేళ్లలోనే 95 శాతం అమలు చేసిన ఘనత సీఎం వైయస్ జగన్‌దని చెప్పారు. మేనిఫెస్టో తమకు పవిత్రత గ్రంథంగా భావిస్తామన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.