గోపవరం ఉప సర్పంచ్ ఎన్నిక ప్రజాస్వామ్య పద్దతిలో జరపాలి
వైయస్ఆర్ జిల్లా: ఈ నెల 19న జరుగనున్న గోపవరం పంచాయతీ ఉప సర్పంచ్ ఎన్నికను ప్రజాస్వామ్య పద్ధతిలో పారదర్శకంగా నిర్వహించాలని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి కోరారు. గురువారం జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలను మాజీ ఎమ్మెల్యే కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.`గోపవరం పంచాయతీ ఉప సర్పంచ్ ఎన్నిక మార్చి 27 వతేదీన జరగాల్సి ఉండగా కూటమి పార్టీలకు మెజారిటీ లేని కారణంగా నాడు వాయిదా వేశారు. అధికార దుర్వినియోగం చేసి టిడిపి ఉపసర్పంచ్ ను కైవసం చేసుకొనేందుకు అన్నిరకాలుగా ప్రయత్నం చేసినా వారికి దక్కలేదు. ఈ ఎన్నికల్లో పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారు. గోపవరం గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ ఎన్నిక ఈ నెల 19 వ తేదీన జరపాలని నోటిఫికేషన్ ఇచ్చారు. నాటి నుంచి మళ్లీ తెలుగుదేశం పార్టీ ప్రలోభాలకు తెర లేపింది. వారి ప్రలోభాలకు13 మంది వైయస్ఆర్‌సీపీకి చెందిన వార్డు మెంబర్లకు లొంగలేదు. 19 వ తేదీన జరిగే ఎన్నిక ప్రజా స్వామ్య పద్దతిలో జరపాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీని కోరాను` అని రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి వెల్లడించారు.