ఓటర్ల జాబితాపై అప్రమత్తంగా ఉండాలి
ఏలూరు జిల్లా: వైయస్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో నూజివీడు నియోజకవర్గంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) పై బూత్ లెవల్ ఏజెంట్లకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆదేశాల మేరకు, నూజివీడు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (Special Intensive Revision - SIR) ప్రక్రియపై బూత్ లెవల్ ఏజెంట్లకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించేందుకు ఈ సదస్సు ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏలూరు జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు దూలం నాగేశ్వరావు (డీఎన్‌ఆర్), ఏలూరు పార్లమెంట్ ఇన్‌చార్జ్ కారుమూరి సునీల్ కుమార్, ఏలూరు జిల్లా టాస్క్ ఫోర్స్ రాష్ట్ర కార్యదర్శి పోతుల శివారెడ్డి పాల్గొన్నారు. అలాగే జిల్లా బూత్ కమిటీ అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై బీఎల్‌ఏలకు ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ, ఇంటింటి పరిశీలన, అర్హులైన ఓటర్ల నమోదు, తప్పుల సవరణ, ఓటర్ల హక్కుల పరిరక్షణ వంటి అంశాలపై వివరణ ఇచ్చారు. ఓటర్ల జాబితాలో ఎలాంటి అవకతవకలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని, ప్రజాస్వామ్య పరిరక్షణలో బీఎల్‌ఏల పాత్ర కీలకమని నేతలు పేర్కొన్నారు.