మట్టి మాఫియాను ప్రశ్నిస్తే జేసీబీలతో ఇళ్లు కూలుస్తారా?.
తాడేపల్లి: కూటమి పాలనలో రాష్ట్రంలో చట్టం, ప్రజాస్వామ్యం పూర్తిగా ఖూనీ అవుతున్నాయని వైయస్ఆర్‌సీపీ మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఏలూరు నగర నడిబొడ్డున టీడీపీ లీగల్ సెల్ వైస్ ప్రెసిడెంట్ ఈడ్పుగంటి శ్రీనివాస్ ఇంటిపై ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అర్ధరాత్రి పూటుగా తాగి, రౌడీమూకలతో జేసీబీ దాడికి తెగబడటం దేశ చరిత్రలోనే అత్యంత సిగ్గుచేటన్నారు. ఎమ్మెల్యే చేస్తున్న లిక్కర్, మట్టి మాఫియా దందాలను ప్రశ్నించినందుకే ఈ అరాచకానికి ఒడిగట్టారని ఆధారాలతో సహా ఆరోపించారు. ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని మహిళలను భయభ్రాంతులకు గురిచేస్తుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు. ఈ ఘటనపై తక్షణమే విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోకపోతే ప్రజలు తగిన బుద్ధి చెప్పడం ఖాయమని హెచ్చరించారు. ఏ జేసీబీ కూడా రాజ్యాంగం కంటే ఎక్కువ కాదు.. ఎమ్మెల్యే చింతమనేని అరాచకాలపై చంద్రబాబు ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు. ఈ సందర్భంగా ఇంకా ఏమన్నారంటే....
రాజకీయాల్లో పదవులు, అధికారం, ప్రభుత్వాలు శాశ్వతం కాదు. చట్టం ఒక్కటే శాశ్వతమనే విషయాన్ని కూటమి నేతలు గుర్తుంచుకోవాలి. ప్రజాస్వామ్యంలో ప్రజలే యజమానులు,ఎంత పెద్ద నాయకుడైనా చట్టం కంటే పెద్దవాడు కాదు, ఏ జేసీబీ కూడా రాజ్యాంగం కంటే ఎక్కువ కాదని ఆయన హెచ్చరించారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాల్సిన కూటమి ప్రభుత్వం వాటన్నింటినీ తుంగలో తొక్కి ప్రజల విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయింది.
- చింతమనేని జేసీబీ దాడి.. దేశ చరిత్రలోనే ఘోరం..
ఏలూరు, దెందులూరు నియోజకవర్గాల్లో నెలకొన్న పరిస్థితులు చూస్తుంటే తీవ్ర ఆవేదన కలుగుతోంది. రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు సహజమే అయినప్పటికీ, మహిళలను లాగి దూషించడాన్ని వైయస్ఆర్‌సీపీ ఎప్పుడూ వ్యతిరేకిస్తుంది. బాధ్యతగల సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన చింతమనేని ప్రభాకర్ అర్ధరాత్రి పూటుగా తాగి, రౌడీమూకలను వెంటబెట్టుకుని, ఒళ్లు తెలియని పరిస్థితుల్లో ఒకరి ఇంటిపైకి జేసీబీతో వెళ్లి దాడి చేయడం ప్రజాస్వామ్యంలో అత్యంత సిగ్గుచేటు.
ఎవరైనా తప్పు చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలి కానీ, ఎమ్మెల్యేనే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని నానా హంగామా చేయడం దారుణం. ఒక సామాన్య వ్యక్తి ఈ రకంగా చేస్తే పోలీసు యంత్రాంగం చూస్తూ ఊరుకుంటుందా? దేశ చరిత్రలో ఏ ప్రజాప్రతినిధి కూడా ఈ రకంగా ప్రవర్తించి ఉండడు.
- సొంత పార్టీ లీగల్ సెల్ నేతపైనే దాడి.. దందాలను ప్రశ్నించినందుకేనా?
ఈ దాడికి గురైన ఈడ్పుగంటి శ్రీనివాస్ అనే న్యాయవాది సాధారణ వ్యక్తి కాదు, ఆయన అధికార తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ వైస్ ప్రెసిడెంట్. దాదాపు 1700 మంది టీడీపీ కార్యకర్తల కేసులను వాదించిన వ్యక్తి ఇంటిపైనే టీడీపీ ఎమ్మెల్యే దాడికి దిగడం అమానుషం. చింతమనేని చేస్తున్న లిక్కర్ దందా, మట్టి మాఫియాను ప్రశ్నించినందుకే శ్రీనివాస్ ఇంటిపై ఈ దాడి జరిగింది.
శ్రీనివాస్ తప్పు చేస్తే శిక్షించడానికి పోలీసులు ఉన్నప్పటికీ, ఎమ్మెల్యే స్వయంగా వెళ్లి అర్ధరాత్రి ఇంట్లో ఉన్న మహిళలను భయభ్రాంతులకు గురిచేయడం అత్యంత నీచమైన చర్య.
దాడి చేయడమే కాకుండా, శ్రీనివాస్ కుటుంబ సభ్యులపై కూడా అత్యంత అమానుషంగా, నీచంగా మాట్లాడి పరస్పరం ఆరోపణలు చేసుకోవడం చట్టవిరుద్ధం.
- చంద్రబాబు గారూ.. ఇదేనా మీ క్రమశిక్షణ?:
సాక్షాత్తూ అధికార పార్టీ ఎమ్మెల్యే తాగి అర్ధరాత్రి ఏలూరు నగర నడిబొడ్డున జేసీబీతో ఒక ఇంటిపై దాడికి దిగితే, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఎందుకు ఇంతవరకు దీనిని ఖండించలేదు, ఎలాంటి చర్యలు తీసుకోలేదు. చంద్రబాబు మాటలు కేవలం ప్రకటనలకే పరిమితమా? ఇదీ చింతమనేని పాత చరిత్ర.......
గతంలో తన మట్టి సామ్రాజ్యానికి అడ్డువచ్చిన ఎమ్మార్వో వనజాక్షిపై దాడి చేసిన ఘటనను ప్రజలు ఇంకా మర్చిపోలేదు.
మాజీ మంత్రి వట్టి వసంతకుమార్‌ను నెట్టిన ఘటన, ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై దాడి, కొల్లేరులో అటవీశాఖ అధికారులతో ఘర్షణ మరియు వారిపై దాడులు అన్నీ చంద్రబాబు ప్రోత్సాహంతోనే జరిగాయి.
నాడు చంద్రబాబు హయాంలోనే 95కు పైగా కేసులున్న చింతమనేని ప్రభాకర్‌పై రౌడీషీట్ తెరిచారు. అలాంటి రౌడీషీటర్ అక్రమ చర్యలను ఖండించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై లేదా అని ప్రశ్నించారు.
- దెందులూరులో వైయస్ఆర్‌సీపీ నేతలు, ఆస్తులపై అరాచకాలు..
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటుతున్నా నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి పెట్టకుండా, కేవలం కుట్రలు, కుతంత్రాలు, గొడవలకు దిగడం దుర్మార్గం. దెందులూరు నియోజకవర్గంలో జరిగిన వరుస దాడులను చూస్తే..
మాజీ సర్పంచ్, ఎంపీపీ మేడికొండ కృష్ణపై అమానుషంగా దాడి చేయడమే కాకుండా, ఆయన కారు మధ్యలో గునపాన్ని గుచ్చి భయానక వాతావరణం సృష్టించారు.దెందులూరు మండల వైస్ ఎంపీపీ వేమూరు జితేంద్రకుమార్ పెట్రోల్ బంకు మరియు ఇంటిపై దాడులు చేశారు. దెందులూరు జెడ్పీటీసీ నెట్టా గంగరాజు తండ్రిపై భౌతిక దాడికి దిగారు.పొన్నూరు సుబ్బారావు అనే రైతు వ్యవసాయ క్షేత్రంపై దాడి చేసి తగులబెట్టారు. దెందులూరు మండల పార్టీ అధ్యక్షుడి ఇల్లు, కార్యాలయంపై దాడులు చేశారు.
- నాతో సహా మా ఆడపడుచుల ఆస్తులూ ధ్వంసం...
చివరికి మాజీ ఎమ్మెల్యేగా ఉన్న నా (అబ్బయ్య చౌదరి) ఇంటిపైనే టీడీపీ గుండాలు అబద్ధపు ప్రచారాలతో రాళ్ల దాడికి దిగారు. అత్యంత దుర్మార్గంగా మా ఇంటి ఆడపడుచులకు ఇచ్చిన వ్యవసాయ పొలాలపై దాడి చేసి, పామాయిల్ తోటలను ధ్వంసం చేశారు. "మీ ఇంట్లోనే మహిళలు ఉంటారా? మా ఇంటి ఆడబిడ్డలు మహిళలు కాదా? వారి ఆస్తులను ధ్వంసం చేసే హక్కు మీకెక్కడిది?".
- రేపు మీకూ ఇదే గతి?
రెడ్ బుక్ రాజ్యాంగం మీ ఇంటికే వచ్చింది.. పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడరు?
అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కనపెట్టి, కూటమి ప్రభుత్వం తెచ్చిన 'రెడ్ బుక్ రాజ్యాంగం' పేరుతో సాగిస్తున్న అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారు. వైయస్ఆర్‌సీపీ నేతలు, కార్యకర్తలపై అక్రమ అరెస్టులు, దాడులకు తెగబడ్డ ఈ రెడ్ బుక్ సంస్కృతి.. ఇవాళ తిరిగి మీ సొంత పార్టీ న్యాయవాది ఈడ్పుగంటి శ్రీనివాస్ ఇంటి వరకే వచ్చింది. రేపు మీ ఇళ్లకు రావడం కూడా ఖాయం.
మరోవైపు నాడు ప్రశ్నిస్తానని చెప్పిన జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ఈ అరాచకాలు కంటికి కనిపించడం లేదా? ఎందుకు నోరు మెదపడం లేదు.
- వైయస్ఆర్‌సీపీ డిమాండ్లు:
రాజ్యాంగం, చట్టం కంటే ఎవరూ అతీతులు కారు. భవిష్యత్తులో ఏలూరు జేసీబీ దాడి వంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి. ఈ ఘటనపై తక్షణమే సమగ్ర విచారణ జరిపి, చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరియు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అబ్బయ్య చౌదరి డిమాండ్ చేశారు. ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ ఇప్పటికైనా నోరు విప్పాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ఎమ్మెల్యేల రౌడీయిజానికి అడ్డుకట్ట వేయకపోతే.. తిరగబడే ప్రజల ఆగ్రహానికి కూటమి ప్రభుత్వం కొట్టుకుపోవడం ఖాయం అని అబ్బయ్య చౌదరి హెచ్చరించారు.