మురళీనాయక్ త్యాగాన్ని దేశం ఎన్నటికీ మరువదు
కర్నూలు: జమ్ము కాశ్మీర్‌లో వీరమరణం పొందిన తెలుగు జవాన్ మురళీనాయక్ త్యాగాన్ని దేశం ఎన్నటికీ మరువదని మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ అన్నారు. మురళినాయక్ మృతి పట్ల ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ సంతాపం తెలిపారు. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబానికి భగవంతుడు శక్తిని, ధైర్యాన్ని ఇవ్వాలని అన్నారు. ఈ మేరకు హఫీజ్‌ఖాన్ ఓ ప్రకటన విడుదల చేశారు. `ఆపరేషన్ సిందూరు ద్వారా భారతదేశం తన శక్తిని ప్రపంచానికి చూపించింది. మన దేశాన్ని విడదీయాలని ప్రయత్నించిన వాళ్లు, ఇప్పుడు తామే సైన్యంలో, రాజకీయాల్లో, రాష్ట్రాల్లో విడిపోతున్నారు. వాళ్లు మన దేశంలో వైరాన్ని కలిగించాలని చూశారు, కానీ ప్రతి భారతీయుడు ఒక్కటై, “మేము ఒక్కటైన భారత్” అని చాటి చెప్పారు. మన సైన్యం ధైర్యంగా, తెలివిగా శత్రు స్థావరాలను ధ్వంసం చేసింది. మన జవాన్లు భారతదేశాన్ని కాపాడారు, మన ప్రజల ప్రాణాలు రక్షించారు. భారత్ ఎప్పుడూ తలవంచదు, ఎప్పుడూ వెనుకడుగు వేయదు. శాంతి కోరుకుంటాం, కానీ అవసరమైతే దిమ్మ తిరిగే బలంతో సమాధానం చెబుతుంది..జై జవాన్!, జై హింద్! అంటూ మాజీ ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ సందేశం పంపించారు.