వైయస్ఆర్‌సీపీ సంస్థాగత నిర్మాణంలో ప్రతి కార్యకర్త క్రియాశీలకమే
పార్వతీపురం : వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణంలో ప్రతి కార్యకర్త కీలక పాత్ర పోషించాల్సిందేనని, గ్రామ స్థాయి కమిటీలే పార్టీకి పునాదులని మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు అన్నారు. పార్టీకి నిబద్ధతగా, నిరంతరం పనిచేసే కార్యకర్తలనే గ్రామ కమిటీల్లో నియమించాలని ఆయన సూచించారు. సోమవారం సీతానగరం మండల కేంద్రంలో నిర్వహించిన మండల స్థాయి పార్టీ సంస్థాగత నిర్మాణ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మండల పార్టీ అధ్యక్షులు (ఇన్‌చార్జ్), జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు బలగ శ్రీరాములు నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మండల పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అలజంగి జోగారావు మాట్లాడుతూ, “పార్టీ వృద్ధి కోసం అహర్నిశలు పనిచేస్తున్న కార్యకర్తల ఆలోచనలే పార్టీ భవిష్యత్ కార్యక్రమాలకు దిశానిర్దేశం చేస్తాయి. పార్టీ భవిష్యత్ పూర్తిగా కార్యకర్తల చేతుల్లోనే ఉంది. మీరే పార్టీ దిశా నిర్దేశకులుగా నిలిచి, ఇప్పటి నుంచే ప్రణాళికబద్ధంగా పనిచేసి రానున్న ఎన్నికల్లో పార్టీని విజయతీరాలకు చేర్చాలి” అని పిలుపునిచ్చారు.
రాష్ట్ర పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నియోజకవర్గ స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడమే ఈ సంస్థాగత నిర్మాణ కార్యక్రమ లక్ష్యమని చెప్పారు. సీతానగరం మండల పరిధిలోని 35 పంచాయతీల్లో ఇప్పటికే ఏర్పాటు చేసిన కమిటీలను పునఃపరిశీలన చేసి, పార్టీకి వంద శాతం నిబద్ధులైన కార్యకర్తలకే కమిటీల్లో చోటు కల్పించాలని స్పష్టం చేశారు.
“ఈ కమిటీలు భవిష్యత్తులో అత్యంత కీలకంగా మారబోతున్నాయి. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు తదుపరి సాధారణ ఎన్నికల్లో కూడా కమిటీల్లోని కార్యకర్తలే పార్టీకి బలంగా నిలవనున్నారు. ప్రతి గ్రామం నుంచి పార్టీకి విశ్వాసంతో పనిచేసే కార్యకర్తలను ఎంపిక చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. వచ్చే ఫిబ్రవరి నెలలోపు కమిటీల నిర్మాణం పూర్తిచేయాలి” అని ముఖ్య నాయకులకు ఆయన సూచించారు.
ఇప్పటికే రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయిలో నియమితులైన పార్టీ ప్రతినిధులను సభాముఖంగా పరిచయం చేస్తూ, వారికి అప్పగించిన బాధ్యతలను అలజంగి జోగారావు వివరించారు. క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులతో కలిసి సమన్వయంతో పనిచేసి పార్టీని నిర్మాణాత్మకంగా బలోపేతం చేయాలని కోరారు. భవిష్యత్తులో వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చినప్పుడు కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు, గౌరవం తప్పకుండా లభిస్తుందని భరోసా ఇచ్చారు.
ఈ సమావేశంలో జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు బలగ శ్రీరాములు నాయుడు, జిల్లా ప్రధాన కార్యదర్శులు పోల సత్యనారాయణ, జడ్పీటీసీ మామిడి బాబ్జి, ఎంపీపీ బలగ రమణమ్మ, మాజీ జడ్పీటీసీ అంబటి కృష్ణం నాయుడు, రాష్ట్ర కార్యదర్శులు నడిమింటి రామకృష్ణ, ఆర్వీ, పోల ఈశ్వరనారాయణ, జిల్లా పార్టీ కార్యదర్శులు బి.శంకరరావు, బి.ముకుందతో పాటు నియోజకవర్గ అనుబంధ విభాగాల అధ్యక్షులు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, గ్రామ పార్టీ అధ్యక్షులు, మండల పార్టీ ప్రతినిధులు, సీనియర్ నాయకులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.